‘ఖమ్మం ఘటనపై న్యాయవిచారణ జరపాలి’
Published Sat, May 6 2017 4:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
హైదరాబాద్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విధ్వంసం సృష్టించిన ఘటనపై న్యాయ విచారణ చేయించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావును కలిశామన్నారు. ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఖమ్మం ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేసి వారిపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధ్వంసం వెనక ఎవరు ఉన్నారు... మార్కెట్ ఎవరి చేతిలో ఉంది.. రైతుల వివరాలు సేకరిస్తే అసలు గుట్టు బయట పడుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రైతు పరిస్థితి అధ్వానంగా ఉండగా రాజకీయ లబ్ధికోసం బీజేపీ, టీఆర్‌ఎస్ దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారయిందని, వ్యాపారులు, దళారులు మధ్య రైతు నష్ట పోతున్నాడని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, మార్కెట‍్లలో దిగువ స్థాయి అధికారులు వ్యాపారులతో లాలూచీ పడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనుల్లో లూటీ జరుగుతోందని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా కోసం గోదావరి నదిలో రోడ్డు వేశారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో మరణాలపై మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement