సత్తుపల్లి మార్కెట్‌యార్డులో మొక్కజొన్న తేమ శాతాన్ని పరిశీలిస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సత్తుపల్లి: ‘రైతే రాజు అంటారు.. రైతు లేనిదే ప్రభుత్వం లేదంటారు.. రైతు పంటలను కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.. ఇదెక్కడి బంగారు తెలంగాణ’ అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు రాజుల కాలం తరహాలో మారువేషాలతో తిరిగితే రైతుల బాధలు ఏంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లు ఖర్చు పెట్టి గోదాంలు నిర్మించింది రైతుల కోసం కాదా..? రైతుల పంటలను ఆరుబయట నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.. పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మొక్కజొన్న అమ్మిన తర్వాత కూడా బస్తాలకు కాపలా రైతులే ఉండాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి కాంటా వేయకపోతే రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని.. మంచినీరు, భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రైతులను అవమానించే రీతిలో మట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డు దుస్థితిని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
సీఎం, సీఎండీకి ధన్యవాదాలు..
సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పలు ఇళ్లకు బాంబ్ బ్లాస్టింగ్‌తో పగుళ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చర్యలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సుధాకర్‌రెడ్డి అన్నారు. సింగరేణి నిధులను బాధిత గ్రామాలలో ఖర్చు చేయాలని, డిస్పెన్సరీ, సీసీరోడ్లు, మంచినీరు ఇవ్వాలని, పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు పెంచాలని కోరారు. ఆయన వెంట కట్ల రంగారావు, రామిశెట్టి సుబ్బారావు ఉన్నారు.
కడియం.. నీ బాగోతం బయటపెడతాం
అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కడియం ఆ మాటలు చెప్పిన బహిరంగ సభలోనే.. అదే మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు చేసిన పనికి సర్పంచ్ అకౌంట్‌లో డబ్బులు వెళితే ఖర్చు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో అక్రమాలు, కార్పొరేట్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తానే స్వయంగా వచ్చి అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, మంత్రి కడియం శ్రీహరి బాగోతాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో మూడు శాతం పర్సంటేజీలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ చెప్పినట్లు స్వయంగా మున్సిపల్ చైర్మన్ చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దందా చేస్తోందని, పినపాకలో గోదావరిలోనే రోడ్డు వేశారంటే ఇసుక మాఫియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment