ఖమ్మంవ్యవసాయం: మిర్చిని ప్రస్తుత ధరతో చూస్తే ఎర్ర బంగారం అని చెప్పక తప్పదు. మిరప ధర రోజురోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి ధర మంగళవారం క్వింటా రూ. 13,100 పలికింది. జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ‘తేజా’ రకం మిర్చిని ప్రధానంగా సాగు చేస్తుంటారు. ఉభయ జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో ఈ పంటను సాగవుతుంది. దీనికి చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు మిర్చి ఎగుమతులకు అనుమతి లభించటంతో దేశంలో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు అక్కడికి తరలిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా.
ఉమ్మడి జిల్లాల్లో పండించిన పంటతో పాటు ఖమ్మానికి పరిసర జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ రూరల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పండించే తేజా రకం మిర్చిని అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విక్రయిస్తుంటారు. పంట సీజన్‌లో రైతుల నుంచి క్వింటా రూ. 7,000 నుంచి రూ. 8,500 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ఆ నిల్వలకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. జూన్ నెల చివరి వారంలో రూ. 12 వేలు పలికిన ధర రోజుకో రకంగా పెరుగుతూ వచ్చింది. జూన్ 30న క్వింటా మిర్చి ధర రూ. 12,100 ఉంది. జూలై 9 నాటికి ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ. 13,100కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసే పంట చాలా తక్కువ.
వ్యాపారుల పంట మూడు వంతులకు పైగా నిల్వ ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. స్థానిక వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయా వ్యాపారులు ఎగుమతిదారులు(ఖరీదు దారులు)కు నిల్వ పంటను విక్రయిస్తున్నారు. నిల్వ చేసిన వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. క్వింటాకు ఏకంగా రూ. 5 నుంచి 6 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర మరికొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా మిర్చి ధర రూ.13 వేలు పలికింది. ఈ ఏడాది అంతకు మించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment