ఖమ్మంవ్యవసాయం: రైతుబంధుకు కాసుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రారంభించినా.. ఖజానాలో నగదు కొరత వల్ల రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభం కాగా.. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. నెల క్రితమే రబీ కోసం రైతుబంధు నగదును రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడిగా అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు బ్యాంకు చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం అందించారు.
జిల్లాలో వివిధ కారణాలతో 20వేల మంది రైతులకు అందలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలుపై పలు ఆంక్షలు విధించింది. ఖరీఫ్‌లో మాదిరిగానే చెక్కుల విధానం కాకుండా రైతుల బ్యాంక్ ఖాతాలో ఆన్‌లైన్ విధానంలో నగదును జమ చేయాలని ఈసీ ఆదేశించింది.
దీంతో వ్యవసాయాధికారులు రైతుల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఆన్‌లైన్‌లో పంపించారు. వీటి ఆధారంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. జిల్లాలో రబీ సీజన్‌కు గాను 2,59,264 మంది రైతులను రైతుబంధు పథకం కోసం వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికున్న భూముల ఆధారంగా రూ.256కోట్లు అవసరం ఉంది. ఈ క్రమంలో విడతలవారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేసే ప్రక్రియను ప్రారంభించారు. అయితే నిధుల లేమి కారణంగా ఆదిలోనే దీనికి బ్రేకులు పడ్డాయి. వ్యవసాయ శాఖ 2,32,765 మంది అర్హులైన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించింది.
ఇందులో 1,37,565 మంది రైతులకు రూ.140కోట్ల నగదు మంజూరైంది. ఈ మొత్తంలో 74,727 మంది రైతులకు రూ.80కోట్లు గత నెల చివరి వారంలో జమ అయ్యాయి. అప్పటి నుంచి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ ఖజానాలో నగదు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని తెలిసింది. ఇంకా 1.85 లక్షల మంది రైతులకు సుమారు రూ.186కోట్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కొందరు రైతులు డబ్బుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని చెబుతున్నారు. అధికారులు ఆయా రైతులకు సమాధానం చెప్పేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. కొందరు రైతులకు రైతుబంధు నగదు రావడం.. మరికొందరికి రాకపోవడంతో అధికారులకు ఇబ్బందికరంగా మారింది.
అన్నదాతల ఎదురు చూపులు
రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేస్తున్నారు. వరినార్లు కూడా అక్కడక్కడ పోస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది అందితే కనీసం దుక్కులకు, విత్తనాలకు కొంత మేరకు ఉపయోగపడతాయని భావించారు. గ్రామాల్లో కొందరు రైతులకు మొదటి విడతగా ఖాతాల్లో నగదు పడగా.. మరికొందరు రైతులకు పడలేదు. దీంతో రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు నగదు ఎందుకు పడలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల్లో పడతాయని అధికారులు చెబుతున్నా.. ప్రక్రియ నిలిచిపోయి సుమారు 20 రోజులు కావస్తోంది. దీంతో నగదు ఎప్పుడు బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని రైతులు అధికారుల చట్టూ తిరుగుతున్నారు.
పెట్టుబడి రాలేదు..
రబీ రైతుబంధు పెట్టుబ డి నగదు బ్యాంక్ ఖాతా లో జమ కాలేదు. ఐదెకరాలకు పెట్టుబడి సహా యం రూ.20వేలు వస్తా యి. ఆ సహాయం అంది తే రబీలో మొక్కజొన్న వేయాలని ఉంది. వ్యవసాయశాఖ అధికారులు వస్తాయంటున్నారు. బ్యాంక్ ఖాతాలో మాత్రం ఇంకా జమ కాలేదు. – తోట శ్రీను, బచ్చోడు, తిరుమలాయపాలెం మండలం
వెంటనే ప్రయోజనం
రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి వెంటనే అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. నష్టం వచ్చింది. ఈ భూమిలో మొక్కజొన్న వేయాలనుకుంటున్నా. రెండెకరాలకు రూ.8వేలు వస్తే విత్తనాలు, దుక్కికి ఉపయోగపడతాయి. – భూక్యా వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం
ప్రక్రియ కొనసాగిస్తున్నాం..
రైతుబంధు పథకం ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఆన్‌లైన్‌లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయశాఖకు పం పించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లావ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment