నల్లగొండ టౌన్ : యాసంగి సీజన్ రైతుబంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది.
ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు..
జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్‌లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే రూ.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం
యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నాం.
– సోమగోని అంజయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం
Comments
Please login to add a commentAdd a comment