TG కార్డులొచ్చాయ్‌! | - | Sakshi
Sakshi News home page

TG కార్డులొచ్చాయ్‌!

Published Sun, Apr 14 2024 2:40 AM | Last Updated on Sun, Apr 14 2024 1:34 PM

కొత్తగా జారీ చేస్తున్న కార్డులు - Sakshi

కొత్తగా జారీ చేస్తున్న కార్డులు

తెలంగాణ స్టేట్‌ (టీఎస్‌)ను తెలంగాణ(టీజీ)గా మార్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

అందుకు అనుగుణంగా కార్డులు మార్చిన రవాణా శాఖ

వాహనదారులకు టీజీ కార్డుల జారీ ప్రక్రియ షురూ

ఉమ్మడి జిల్లాలో 1500 చొప్పున ఆర్సీ, డీఎల్‌ కొత్త కార్డుల పంపిణీ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ (టీజీ) పేరుతో రూపొందించిన కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌లు (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ) కార్డులు వచ్చేశాయి. రవాణా శాఖ వాటిని వాహనదారులకు జారీ చేయడాన్ని ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ స్టేట్‌ (టీఎస్‌) పేరుతోనే ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్‌సీలు, డీఎల్‌లను జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు యువకులు టీజీ పేరును వాహనాలపై రాసుకున్నారని, ఉద్యమంలో దానిని అందరూ అనుసరించారని, కాబట్టి టీఎస్‌ అవసరం లేదని, టీజీగా మారుస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా గత నెలలో టీఎస్‌ను టీజీగా మార్పు చేసింది. జాతీయ స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా డీఎల్‌, ఆర్‌సీలకు కేంద్రం ఆమోదం తీసుకొని గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ మేరకు మార్పులు చేసిన కొత్త కార్డులను రవాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాటి జారీ ప్రక్రియను ఇటీవల ప్రారంభించింది.

కార్డులపై ఇదీ మార్పు..
ఇన్నాళ్లు ఆర్‌సీ, డీఎల్‌ కార్డులపై ఇండియన్‌ యూనియన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇష్యూడ్‌ బై తెలంగాణ స్టేట్‌ అని ఉండటంతో పాటు కార్డుపై ఒకపక్కన సర్కిల్‌లో టీఎస్‌ అని ఉండేది. ఇప్పుడు దానిని మార్చి ఇండియన్‌ యూనియన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇష్యూడ్‌ బై తెలంగాణ అని ముద్రించింది. అలాగే ఒక పక్కన సర్కిల్‌లో గతంలో టీఎస్‌ అని ఉండగా ఇప్పుడు దానిని టీజీగా మార్చింది. అలాగే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డుపైనా ఇన్నాళ్లు ఇండియన్‌ యూనియన్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇష్యూడ్‌ బై తెలంగాణ స్టేట్‌ అని ఉండగా, ఇప్పుడు దానిని ఇండియన్‌ యూనియన్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇష్యూడ్‌ బై తెలంగాణగా మార్చింది. అలాగే కార్డుపై ఒక పక్కన సర్కిల్‌లో టీఎస్‌కు బదులు టీజీని ముద్రించింది.

వేగంగా కొత్త కార్డుల ముద్రణ..
కొత్త కార్డులను వేగంగా ముద్రించేలా రవాణా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర రవాణా శాఖ నుంచి జిల్లా కార్యాలయాలకు వచ్చిన కార్డులపై వాహనాలు, వాహనదారులకు సంబంధించిన వివరాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌పై దానిని పొందిన వారి వివరాలను ముద్రించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు మొదటి విడతలో 1500 ఆర్‌సీ కార్డులను రాష్ట్ర కార్యాలయం కేటాయించగా, వాటిని ముద్రించి జారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు మరో 3,500 వేల కార్డులను ఉమ్మడి జిల్లాకు కేటాయించగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాలు వాటి ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టాయి. అలాగే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రికి కలిపి దాదాపు 4500కు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులను కేటాయించగా, అందులో 1500వరకు ముద్రించి వాటి జారీని ప్రారంభించింది. మరో 3 వేల కార్డుల ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలోనే వాటిని కూడా వాహనదారులకు జారీచేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement