రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలు చేస్తున్న గుత్తా కుటుంబం
సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో అమిత్‌రెడ్డి భేటీ
కాంగ్రెస్‌లో చేరే యోచనలోభాగమేనని చర్చ
బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ టికెట్ అవకాశాలు కరువు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్ నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాజకీయ ఎదుగుదలకు సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడంతో ఆయన అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి సరైన దారి అదేనని, కాంగ్రెస్ పార్టీలో చేరితేనే భవిష్యత్ బాగుంటుందని గుత్తా కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అయితే, నరేందర్‌రెడ్డితో తమకున్న బంధుత్వం కారణంగానే అమిత్ కలిసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుచరులు పలువురు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డితో పాటు దేవరకొండలో ఆలంపల్లి నర్సింహ ఇతర నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలో గుత్తా కుటుంబం పార్టీ మారుతుందనే ప్రచారం జరిగినా, దానిని సుఖేందర్‌రెడ్డి కొట్టిపారేశారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ బీఆర్‌ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జిగా అమిత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఎంపీ టికెట్‌కు సహకరించని బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుమారుడు అమిత్‌రెడ్డికి మునుగోడు టికెట్ ఇప్పించేందుకు సుఖేందర్‌రెడ్డి ప్రయత్నించారు.
అప్పుడు అమిత్‌కు టికెట్ దక్కలేదు. ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో.. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచైనా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, అమిత్‌కు టికెట్ తాము సహకరించబోమని మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు అధిష్టానానికి చెప్పినట్లుగా ప్రచారం సాగింది. తనకు బీఆర్‌ఎస్ నేతలు సహకరించరనేది తేలిపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయబోమని బీఆర్‌ఎస్ అధిష్టానానికి అమిత్ చెప్పేశారు. ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నాలుగు రోజుల క్రితం కలిశారు. దీంతో గుత్తా కుటుంబం పార్టీ మారడం పక్కా అని ప్రచారం జరిగింది.
సీఎం సలహాదారుతో భేటీ
హైదరాబాద్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో రేపో మాపో కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జోరందుకుంది. బంధుత్వం కారణంగానే నరేందర్‌రెడ్డిని కలిసినట్లుగా చెబుతున్నా.. ఏదైనా పదవి కోసం స్పష్టమైన హామీ పొందేందుకే కలిసినట్లుగా చర్చ జరుగుతోంది. భువనగిరి ఎంపీ టికెట్ అడుగుతున్నా, అది కుదరకపోతే పార్టీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాతే కాంగ్రెస్‌లో చేరే విషయంలో నిర్ణయం తీసుకుంటారని గుత్తా వర్గీయుల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment