నల్లగొండ టౌన్: యాసంగి సీజన్ ఆరంభమై నెలన్నర గడుస్తున్నా రైతుబంధు పెట్టుబడి సాయం అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఇప్పటి వరకు 12 విడతలుగా రైతుల ఖాతాల్లో సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయ జమచేసింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎకరానికి రూ.7,500ల చొప్పున ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చింది.
కానీ, ప్రభుత్వం రైతు భరోసాకు విధివిధానాలను సిద్ధం చేయని కారణంగా పాత పద్ధతిలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేయడం ప్రారంభించింది. ప్రక్రియ ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సుమారు రూ.27 కోట్లు జమచేసింది. దీంతో ఎకరంపైగా భూమి ఉన్న మిగతా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
5.42లక్షల మంది అర్హులుంటే..
రైతుబంధు పథకానికి జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు అర్హులు కాగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రతి సీజన్‌కు రూ.624,14,84,629లను గత ప్రభుత్వం జమచేసింది. మొదట ఎకరంలోపు రైతులకు తర్వాత రెండెకరాలు, ఆ తర్వాత మూడు, నాలుగు ఇలా దశలవారీగా గత ప్రభుత్వం నెల రోజులలోపునే రైతులందరి ఖాతాల్లో రైతుబంధు సాయం జమచేసింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి ఉన్న 1,14,542 మంది రైతులకు రూ.26,94,65,516లను జమచేసింది. వీరిలో పూర్తిగా ఎకరం భూమి ఉన్న వారికి కూడా డబ్బులు జమచేయని పరిస్థితి.
జిల్లాలో ఇంకా 4లక్షల మందికిపైగా రైతులు రైతుబంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. రైతుబంధు పెట్టుబడి సాయం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగి వాకబ్ చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అసలు ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందో లేదోనన్న రందీ రైతులలో నెలకొంది. యాసంగి సీజన్ ప్రారంభమై నెలదాటిన నేపథ్యంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఇప్పటికై నా రైతు బంధు డబ్బులు జమచేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment