సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు.
ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు.
మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది.
మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్‌లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
కొత్త రుణమాఫీపై కసరత్తు...
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment