సీసీఐ ‘షో’
రెండోరోజు కూడా పత్తి కొనుగోలుకు ఆసక్తి చూపని బయ్యర్
ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా ‘షో’గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రెండో రోజు(శనివారం)న కూడా సీసీఐ కొనుగోళ్లు జరగలేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం నుంచి కొనుగోళ్లు సాగించాలని సీసీఐ నిర్ణయించింది.
తొలి రోజున ఇలా...
తొలి రోజున మార్కెట్‌కు ఇద్దరు సీసీఐ బయ్యర్లు, వరంగల్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్(జేడీఎం) వచ్చారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి జిల్లా ఉన్నతాధికారులను గానీ, ప్రజాప్రతినిధులనుగానీ ఆహ్వానించలేదు. వ్యాపారులతో, కమీషన్ ఏజెంట్లతో, రైతులతో, కార్మిక సంఘాల ప్రతినిధులతో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా విడి పత్తిని రైతులు తీసుకురాలేదని అన్నారు. ఆ తరువాత, వారు కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరగటంతో అధికారులు, ఇద్దరు బయ్యర్లు కలిసి మార్కెట్ యార్డులోకి వెళ్లి సరుకును పరీక్షించి, ‘తేమ అధికంగా ఉంది’ అని చెప్పి తొలి రోజున కొనుగోళ్లు ప్రారంభించలేదు.
రెండోరోజున..
రెండోరోజు శనివారం కూడా రైతులు దాదాపు 14,000కు పైగా బస్తాలలో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఒక్క బయ్యర్ మాత్రమే మార్కెట్‌లో ఉన్నారు. పత్తి కొనుగోలుకు ఆయన ఆసక్తి చూపలేదు. అదే సమయంలో.. ‘సీసీఐ కొనుగోళ్లు చేసినా డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుంది. నెల తరువాత సరుకు తాలూకు డబ్బు ఇస్తుంది’ అనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే అదనుగా జెండా పాటకు ముందే కొందరు వ్యాపారులు సరకు కొనుగోలు చేశారు.
బయ్యర్ ‘షో’
సరుకు కొనుగోలు చేయటం లేదన్న విమర్శలు రాకుండా ఉండేందుకు రెండోరోజున సీసీఐ బయ్యర్ ‘షో’ చేశారు. ఆయన మార్కెట్ అధికారులతో కలిసి యార్డులో అక్కడక్కడ తిరిగి సరుకును ‘పరిశీలించారు’. ‘ప్చ్.. ఈ రోజు వచ్చిన సరుకులో కూడా తేమ శాతం ఎక్కువ గా ఉంది. నిబంధనల ప్రకారంగా దీనిని కొనుగోలు చేయలేము’ అని చేతులెత్తేశారు. దీంతో, పత్తి రైతులు అయోమయానికి, ఆందోళనకు లోనయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరుకును వ్యాపారులకు (వారు చెప్పిన ధరకే) విక్రయించారు. ‘‘సీసీఐ బయ్యర్లు షో చేశారు. సరుకును కొనకూడదని ముందే నిర్ణయించుకున్నా రు’’అని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రచారం ఘనం.. ఫలితం శూన్యం..
‘ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ కేంద్రం ఏర్పాటవుతుంది. రైతులెవరూ కూడా తమ సరుకును దళారులకు అమ్మొద్దు’ అంటూ, గ్రామాల్లో మార్కెటింగ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనిని నమ్మి, సరుకును తీసుకొచ్చిన రైతులు.. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన ‘షో’ చూసి నివ్వెరపోయారు. ‘సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని, క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధర పొందండని చెప్పిన అధికారులు.. రెండు రోజులుగా సీసీఐ సాగిస్తున్న ‘షో’పై ఎందుకు స్పందించడం లేదంటూ రైతుల్లో ఆగ్రహావేశంతో ప్రశ్నిస్తున్నారు. పత్తి నిల్వలు ఉండడం, అంతర్జాతీయంగా ఎగుమతులు లేనందునే కొనుగోళ్లకు సీసీఐ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది.