పత్తిపై కామన్‌ ఫండ్‌..! | Cotton Purchases Is Going To Start In Adilabad | Sakshi
Sakshi News home page

పత్తిపై కామన్‌ ఫండ్‌..!

Published Tue, Oct 15 2019 8:14 AM | Last Updated on Tue, Oct 15 2019 8:14 AM

Cotton Purchases Is Going To Start In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్‌ (ఏ), ఆదిలాబాద్‌(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, బోథ్, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, కడెం, కొండపల్లి, కుభీర్, లక్షెట్టిపేట్, నేరడిగొండ, నిర్మల్, పొచ్చర, సారంగాపూర్, సొనాల, వాంకిడి, ఇందారం ప్రాంతాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ ఈ ప్రాంతాల్లో జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకొని అక్కడ బయ్యర్లు అంటే సంస్థకు చెందిన అధికారులు పత్తి కొనుగోలు అధికారి (సీపీఓ) లను నియమించి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటీవలే జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులతో సీసీఐ అధికారులు దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుని త్వరలో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  

దూది శాతం.. లోగుట్టు 
ప్రతియేడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తిని నిల్వ చేసి జిన్నింగ్‌ ద్వారా దాని నుంచి దూది, గింజలను వేరు చేసి ప్రెస్సింగ్‌ ద్వారా దూదిని బేళ్లుగా తయారు చేసేందుకు సీసీఐ జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుంటుంది. ఇందుకోసం ఈయేడాది ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకొని ఒక బేల్‌ తయారీకి రూ.1195 చెల్లించే విధంగా టెండర్‌ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ జిన్నింగ్‌ వ్యాపారికి బేల్‌ తయారీ ద్వారా వచ్చే లాభం అదే. సీసీఐ లక్షల బేళ్లను తయారు చేయిస్తుంది. ఇక్కడివరకు అంతా ఓకే.. ఇక టెండర్‌ నిబంధనలో కిటుకులు సీసీఐ అక్రమ సంపాదనకు మార్గంగా మలుచుకున్నాయి.

అద్దెకు తీసుకున్న జిన్నింగ్‌ మిల్లులో పత్తి కొనుగోలు చేసేది సంస్థ అధికారులే. ఆ తర్వాత పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్‌ చేయడంలో మిల్లుదే భాగస్వామ్యం. ఇక్కడే అవినీతికి తెర లేస్తుంది. అది ఏవిధంగా అంటే.. ఒక క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు తీయాలని సీసీఐలో నిబంధన ఉంది. అయితే ఇటీవల దూది ఔట్‌టన్‌ (ఓటీ)ని అక్టోబర్‌లో 31 శాతంగా నిర్ధారించారు. నవంబర్‌లో 31.10, డిసెంబర్‌లో 31.60, జనవరిలో 32.40, ఫిబ్రవరిలో 33.00, మార్చిలో 33.40 శాతం సీసీఐ వ్యాపారులకు నిర్దేషించింది. అక్టోబర్‌ నుంచి జనవరి వరకు పత్తి సీజన్‌ కొనసాగుతుంది. ఆ తర్వాత జనవరి నుంచి దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా దాదాపుగా దిగుబడి వచ్చే సీజన్‌లో 31 శాతంలో నిర్ధారించి సీజన్‌ అయిపోయే దశలో 33 శాతం వరకు పొడిగించారు. ఇక్కడే కిటుకు దాగివుంది. 

కామన్‌ ఫండ్‌.. 
కొన్ని శాఖల్లో అక్రమ సంపాదనకు ఒక్కో పేరు ఉంటుంది. సీసీఐలో ఈ సంపాదనకు ముద్దుపేరే కామన్‌ ఫండ్‌.. పత్తి నుంచి దూది తీసే శాతం 31కి తగ్గించడం ద్వారా సీసీఐ అధికారులు అక్రమాలకు తెర లేపారు. క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు వస్తుందనేది ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఇక్కడ శాతం తగ్గించడంలో స్వార్థ ప్రయోజనాలు దాగివున్నాయి. 31 శాతానికి పైబడి వచ్చే దూదిని అక్రమంగా విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటారు. ఈ వ్యవహారంలో వ్యాపారులు అధికారులకు వంత పాడుతారు. పత్తి సంస్థ ఉమ్మడి జిల్లాలో లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేస్తుంది.

ఈ అక్రమ దూది విక్రయం ద్వారా వచ్చే సంపాదన వ్యవహారంలో సీసీఐలో పైనుంచి కిందిస్థాయి వరకు నిర్దేశిత వాటాలు లోగుట్టుగా జరిగిపోతాయి. దీన్ని సీసీఐ పరిభాషలో కామన్‌ ఫండ్‌గా పిలుస్తారనే నానుడి ఉంది. అయితే సీజన్‌లో ఈ అధికారులు ఉత్సాహంగా పనిచేసేందుకు కామన్‌ ఫండ్‌ దోహద పడుతుందన్న అభిప్రాయం ఉంది. దీంతోనే సంస్థ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శలు లేకపోలేదు. 

స్పందన కరువు.. 
ఈ వ్యవహారంలో ‘సాక్షి’ వివరణ తీసుకునేందుకు సీసీఐ ఆదిలాబాద్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి సోమవారం వెళ్లగా ఆ సమయంలో జీఎం చాంబర్‌లోనే ఉన్నారు. అక్కడ ఎదురుపడ్డ జీఎం పీఏ అపాయింట్‌మెంట్‌ లేనిది జీఎం గారిని కలవలేరని చెప్పారు. దీంతో అపాయింట్‌మెంట్‌ అడగగా తర్వాత ఫోన్‌ చేస్తే చెబుతానని పేర్కొన్నారు. దీంతో ‘సాక్షి’ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫోన్‌ చేయగా జీఎంను అడిగి చెబుతానని చెప్పిన పీఏ సాయంత్రం వరకు స్పందించలేదు. మళ్లీ ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు.

దీంతో జీఎం నంబర్‌కే నేరుగా ఫోన్‌ చేయగా ఆయన ఫోన్‌లో కూడా స్పందించలేదు. సీసీఐలో వ్యవహారాలన్నీ దాగుడుమూతలే. గతంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రాగా సీబీసీఐడీ బృందం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేయగా ఆ సమయంలోనూ సీసీఐ అధికారులు స్పందించేందుకు ముందుకు రాలేదు. ఇలా ప్రతి వ్యవహారంలోనూ గోప్యత పాటించడంలో వెనక ఇలాంటి అక్రమ వ్యవహారాలే కారణమన్న విమర్శలు లేకపోలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement