బ్యాంకు సిబ్బంది నిర్వాకం ఆందోళనలో బాధితురాలు
సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్‌బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు.
రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి.
ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నరేశ్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment