Cotton Corporation of India (CCI)
-
పత్తిపై కామన్ ఫండ్..!
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ (ఏ), ఆదిలాబాద్(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, బోథ్, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, కడెం, కొండపల్లి, కుభీర్, లక్షెట్టిపేట్, నేరడిగొండ, నిర్మల్, పొచ్చర, సారంగాపూర్, సొనాల, వాంకిడి, ఇందారం ప్రాంతాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ ఈ ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకొని అక్కడ బయ్యర్లు అంటే సంస్థకు చెందిన అధికారులు పత్తి కొనుగోలు అధికారి (సీపీఓ) లను నియమించి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటీవలే జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో సీసీఐ అధికారులు దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుని త్వరలో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దూది శాతం.. లోగుట్టు ప్రతియేడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తిని నిల్వ చేసి జిన్నింగ్ ద్వారా దాని నుంచి దూది, గింజలను వేరు చేసి ప్రెస్సింగ్ ద్వారా దూదిని బేళ్లుగా తయారు చేసేందుకు సీసీఐ జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటుంది. ఇందుకోసం ఈయేడాది ఉమ్మడి జిల్లాలో 20 జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకొని ఒక బేల్ తయారీకి రూ.1195 చెల్లించే విధంగా టెండర్ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ జిన్నింగ్ వ్యాపారికి బేల్ తయారీ ద్వారా వచ్చే లాభం అదే. సీసీఐ లక్షల బేళ్లను తయారు చేయిస్తుంది. ఇక్కడివరకు అంతా ఓకే.. ఇక టెండర్ నిబంధనలో కిటుకులు సీసీఐ అక్రమ సంపాదనకు మార్గంగా మలుచుకున్నాయి. అద్దెకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసేది సంస్థ అధికారులే. ఆ తర్వాత పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడంలో మిల్లుదే భాగస్వామ్యం. ఇక్కడే అవినీతికి తెర లేస్తుంది. అది ఏవిధంగా అంటే.. ఒక క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు తీయాలని సీసీఐలో నిబంధన ఉంది. అయితే ఇటీవల దూది ఔట్టన్ (ఓటీ)ని అక్టోబర్‌లో 31 శాతంగా నిర్ధారించారు. నవంబర్‌లో 31.10, డిసెంబర్లో 31.60, జనవరిలో 32.40, ఫిబ్రవరిలో 33.00, మార్చిలో 33.40 శాతం సీసీఐ వ్యాపారులకు నిర్దేషించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు పత్తి సీజన్ కొనసాగుతుంది. ఆ తర్వాత జనవరి నుంచి దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా దాదాపుగా దిగుబడి వచ్చే సీజన్లో 31 శాతంలో నిర్ధారించి సీజన్ అయిపోయే దశలో 33 శాతం వరకు పొడిగించారు. ఇక్కడే కిటుకు దాగివుంది. కామన్ ఫండ్.. కొన్ని శాఖల్లో అక్రమ సంపాదనకు ఒక్కో పేరు ఉంటుంది. సీసీఐలో ఈ సంపాదనకు ముద్దుపేరే కామన్ ఫండ్.. పత్తి నుంచి దూది తీసే శాతం 31కి తగ్గించడం ద్వారా సీసీఐ అధికారులు అక్రమాలకు తెర లేపారు. క్వింటాలు పత్తి నుంచి దూది 33శాతం వరకు వస్తుందనేది ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఇక్కడ శాతం తగ్గించడంలో స్వార్థ ప్రయోజనాలు దాగివున్నాయి. 31 శాతానికి పైబడి వచ్చే దూదిని అక్రమంగా విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటారు. ఈ వ్యవహారంలో వ్యాపారులు అధికారులకు వంత పాడుతారు. పత్తి సంస్థ ఉమ్మడి జిల్లాలో లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేస్తుంది. ఈ అక్రమ దూది విక్రయం ద్వారా వచ్చే సంపాదన వ్యవహారంలో సీసీఐలో పైనుంచి కిందిస్థాయి వరకు నిర్దేశిత వాటాలు లోగుట్టుగా జరిగిపోతాయి. దీన్ని సీసీఐ పరిభాషలో కామన్ ఫండ్‌గా పిలుస్తారనే నానుడి ఉంది. అయితే సీజన్లో ఈ అధికారులు ఉత్సాహంగా పనిచేసేందుకు కామన్ ఫండ్ దోహద పడుతుందన్న అభిప్రాయం ఉంది. దీంతోనే సంస్థ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శలు లేకపోలేదు. స్పందన కరువు.. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ వివరణ తీసుకునేందుకు సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ కార్యాలయానికి సోమవారం వెళ్లగా ఆ సమయంలో జీఎం చాంబర్లోనే ఉన్నారు. అక్కడ ఎదురుపడ్డ జీఎం పీఏ అపాయింట్మెంట్ లేనిది జీఎం గారిని కలవలేరని చెప్పారు. దీంతో అపాయింట్మెంట్ అడగగా తర్వాత ఫోన్ చేస్తే చెబుతానని పేర్కొన్నారు. దీంతో ‘సాక్షి’ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేయగా జీఎంను అడిగి చెబుతానని చెప్పిన పీఏ సాయంత్రం వరకు స్పందించలేదు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో జీఎం నంబర్‌కే నేరుగా ఫోన్ చేయగా ఆయన ఫోన్లో కూడా స్పందించలేదు. సీసీఐలో వ్యవహారాలన్నీ దాగుడుమూతలే. గతంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రాగా సీబీసీఐడీ బృందం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేయగా ఆ సమయంలోనూ సీసీఐ అధికారులు స్పందించేందుకు ముందుకు రాలేదు. ఇలా ప్రతి వ్యవహారంలోనూ గోప్యత పాటించడంలో వెనక ఇలాంటి అక్రమ వ్యవహారాలే కారణమన్న విమర్శలు లేకపోలేదు. -
దళారీ తానా.. సీసీఐ తందానా!
సాక్షి, హైదరాబాద్ : తేమశాతం పేరుతో వ్యాపారులు పత్తి రైతును చేస్తున్న దగా అంతాఇంతా కాదు. రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కని పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన సీసీఐ పత్తా లేకుండా పోయింది. వ్యాపారులు, దళారులతో సీసీఐ కుమ్మక్కైందని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. దళారులు, వ్యాపారులు కలసి రైతును నిలువుదోపిడీ చేస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోనే కీలకమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ తీరు ఇంత దారుణంగా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ధర రావడం లేదని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్దామంటే అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పత్తి వ్యాపారులతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వ్యాపారులు ఎంత చెబితే అదే ధర... ఏం చెబితే అదే నడుస్తోంది. ఒకరకంగా మార్కెట్లో వ్యాపారులు, దళారుల మాఫియా నడుస్తోంది. యంత్రాలు లేకుండానే తేమ నిర్ధారణేంటి? పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.4,320, 9 శాతం ఉంటే రూ. 4,277, 10 శాతం ఉంటే రూ.4,234, 11 శాతం ఉంటే రూ.4,190కి, 12 శాతం ఉంటే రూ.4,147 చొప్పున కొనుగోలు చేయాలి. రైతులు తెచ్చిన బస్తాలను తేమ శాతం గుర్తించే యంత్రాలతో పరిశీలించి ఇలా ధర ఖరారు చేయాలి. కానీ ఖమ్మం మార్కెట్‌కు తెస్తున్న పత్తిలో కనీసం రెండు మూడు శాతాన్ని కూడా ఇలా యంత్రంతో పరిశీలించడం లేదు. తేమ శాతం పరిశీలించకుండానే వ్యాపారులు అడ్డగోలుగా ధర నిర్ణయించేస్తున్నారు. చేతితో పైపైన చూసి అశాస్త్రీయంగా ధర నిర్ధారిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో దాదాపు 50 మంది పత్తి వ్యాపారులుంటే ఇద్దరంటే ఇద్దరే తేమ శాతం గుర్తించే యంత్రాలను తెచ్చి అక్కడక్కడ పరిశీలిస్తున్నారు. వర్షానికి నల్లరంగులోకి మారిన పత్తి ధర క్వింటాలుకు రూ.2–3 వేల మధ్యే కొంటున్నారు. ఇక నాణ్యత కలిగిన పత్తికి ఎంఎస్పీ రూ.4,320 ఇవ్వాల్సి ఉండగా... మార్కెట్లో మాత్రం రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.2,500కే అమ్మేశా: నాకు ఐదెకరాలుంది. పత్తి, వరి సాగు చేస్తున్నా. నాలుగెకరాల్లో పత్తి సాగుచేశా. పత్తి అమ్మితే ఎంతో ఆదాయం వస్తుందని ఆశపడ్డా. కానీ వర్షాలకు దెబ్బతిన్నది. తొలి తీతలో 2 క్వింటాళ్ల మేర వచ్చింది. అమ్మకానికి తెచ్చా. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.2,500 ఇచ్చారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా పూడని పరిస్థితి ఏర్పడింది. పంట సాగుపై రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చేలా ఉంది. పత్తి వేసి నష్టాల పాలవుతున్నా. వచ్చే ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉండాలని బావిస్తున్నా. -- పల్లెనుల యూసూబు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం నా జీవితంలో ఇంత దారుణం చూడలేదు ఆరెకరాల్లో పత్తి వేశా. మొదటి తీతలో వచ్చిన 20 బస్తాల పత్తిని ఆరబెట్టి అమ్మకానికి తెచ్చా. వర్షాలకు కొద్దిగా రంగు మారింది. కానీ తేమశాతం నిబంధనల ప్రకారమే ఉంది. వ్యాపారులు క్వింటాలుకు రూ.2,500 ధర పెట్టారు. రూ.3 వేలకైనా కొనండని ప్రాధేయపడ్డా. ఎంత మాత్రం కనికరించలేదు. మరీ అడిగితే మాకొద్దు అని సమాధానం చెప్పారు. 45 ఏళ్ల వ్యవసాయ జీవితంలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదు. కిలో పత్తి తీసినందుకు కూలీలు రూ.12 చొప్పున తీసుకుంటున్నారు. అంటే పత్తి ధరలో సగం కూలీలకే పోతుంది. పెట్టుబడుల్లో సగం కూడా పూడని పరిస్థితి ఉంది. పత్తి సాగు ద్వారా ఈ ఏడాది సుమారు రూ.1.80 లక్షల నష్టం వచ్చేట్లు ఉంది. --పగడవరపు రామకృష్ణ, గోపవరం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులదే రాజ్యం పత్తిని తేమ శాతానికి అనుగుణంగా గ్రేడింగ్ చేసి తెచ్చా. కానీ క్వింటాలుకు రూ. 4,100కే కొనుగోలు చేశారు. ఇంతకంటే దారుణమేముంది? మంచి ధర పలికే కాలంలో ఇలాంటి పత్తి క్వింటాలుకు రూ.7–8 వేలు పలికింది. ఇప్పుడు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీసీఐ అడ్రస్ లేదు. ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. రైతు మందు తాగి చావాల్సిన పరిస్థితి తెస్తున్నారు. -- కొమ్ము నాగయ్య, లచ్చగూడెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నాం వ్యాపారులను కూర్చొబెట్టి రైతులకు సరైన ధర ఇచ్చేలా మాట్లాడుతున్నాం. ఇటీవల కురిసిన వర్షాలతో ధర తక్కువగానే పలుకుతోంది. నిబంధనల ప్రకారం లేకపోవడంతో ధర తక్కువగా ఉంటోంది. తేమ శాతం ఆధారంగానే నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. -- రత్నం సంతోష్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఖమ్మం మరి రైతులు ఎక్కడకు పోవాలి? ఇది ఖమ్మం మార్కెట్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం! ఫ్లెక్సీ తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రం కనిపించడం లేదే అనుకుంటున్నారా? అయినా ఇది కొనుగోలు కేంద్రమే. ఇలా కేవలం ఒక ఫ్లెక్సీని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గోడకు తగిలించేశారు. దాన్నే కొనుగోలు కేంద్రం అనుకోమన్నారు. అక్కడ సీసీఐ సిబ్బంది ఒక్కరూ లేరు. కాంటా లేదు. తేమ శాతం గుర్తించే యంత్రమూ లేదు. కనీసం ఓ కుర్చీ కూడా లేదు!! -
సీసీఐ ‘షో’
రెండోరోజు కూడా పత్తి కొనుగోలుకు ఆసక్తి చూపని బయ్యర్ ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా ‘షో’గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు(శనివారం)న కూడా సీసీఐ కొనుగోళ్లు జరగలేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి కొనుగోళ్లు సాగించాలని సీసీఐ నిర్ణయించింది. తొలి రోజున ఇలా... తొలి రోజున మార్కెట్‌కు ఇద్దరు సీసీఐ బయ్యర్లు, వరంగల్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్(జేడీఎం) వచ్చారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి జిల్లా ఉన్నతాధికారులను గానీ, ప్రజాప్రతినిధులనుగానీ ఆహ్వానించలేదు. వ్యాపారులతో, కమీషన్ ఏజెంట్లతో, రైతులతో, కార్మిక సంఘాల ప్రతినిధులతో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా విడి పత్తిని రైతులు తీసుకురాలేదని అన్నారు. ఆ తరువాత, వారు కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరగటంతో అధికారులు, ఇద్దరు బయ్యర్లు కలిసి మార్కెట్ యార్డులోకి వెళ్లి సరుకును పరీక్షించి, ‘తేమ అధికంగా ఉంది’ అని చెప్పి తొలి రోజున కొనుగోళ్లు ప్రారంభించలేదు. రెండోరోజున.. రెండోరోజు శనివారం కూడా రైతులు దాదాపు 14,000కు పైగా బస్తాలలో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఒక్క బయ్యర్ మాత్రమే మార్కెట్లో ఉన్నారు. పత్తి కొనుగోలుకు ఆయన ఆసక్తి చూపలేదు. అదే సమయంలో.. ‘సీసీఐ కొనుగోళ్లు చేసినా డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుంది. నెల తరువాత సరుకు తాలూకు డబ్బు ఇస్తుంది’ అనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే అదనుగా జెండా పాటకు ముందే కొందరు వ్యాపారులు సరకు కొనుగోలు చేశారు. బయ్యర్ ‘షో’ సరుకు కొనుగోలు చేయటం లేదన్న విమర్శలు రాకుండా ఉండేందుకు రెండోరోజున సీసీఐ బయ్యర్ ‘షో’ చేశారు. ఆయన మార్కెట్ అధికారులతో కలిసి యార్డులో అక్కడక్కడ తిరిగి సరుకును ‘పరిశీలించారు’. ‘ప్చ్.. ఈ రోజు వచ్చిన సరుకులో కూడా తేమ శాతం ఎక్కువ గా ఉంది. నిబంధనల ప్రకారంగా దీనిని కొనుగోలు చేయలేము’ అని చేతులెత్తేశారు. దీంతో, పత్తి రైతులు అయోమయానికి, ఆందోళనకు లోనయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరుకును వ్యాపారులకు (వారు చెప్పిన ధరకే) విక్రయించారు. ‘‘సీసీఐ బయ్యర్లు షో చేశారు. సరుకును కొనకూడదని ముందే నిర్ణయించుకున్నా రు’’అని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రచారం ఘనం.. ఫలితం శూన్యం.. ‘ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటవుతుంది. రైతులెవరూ కూడా తమ సరుకును దళారులకు అమ్మొద్దు’ అంటూ, గ్రామాల్లో మార్కెటింగ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనిని నమ్మి, సరుకును తీసుకొచ్చిన రైతులు.. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన ‘షో’ చూసి నివ్వెరపోయారు. ‘సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని, క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధర పొందండని చెప్పిన అధికారులు.. రెండు రోజులుగా సీసీఐ సాగిస్తున్న ‘షో’పై ఎందుకు స్పందించడం లేదంటూ రైతుల్లో ఆగ్రహావేశంతో ప్రశ్నిస్తున్నారు. పత్తి నిల్వలు ఉండడం, అంతర్జాతీయంగా ఎగుమతులు లేనందునే కొనుగోళ్లకు సీసీఐ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది.