సాక్షి, హైదరాబాద్ : తేమశాతం పేరుతో వ్యాపారులు పత్తి రైతును చేస్తున్న దగా అంతాఇంతా కాదు. రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) దక్కని పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన సీసీఐ పత్తా లేకుండా పోయింది. వ్యాపారులు, దళారులతో సీసీఐ కుమ్మక్కైందని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. దళారులు, వ్యాపారులు కలసి రైతును నిలువుదోపిడీ చేస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోనే కీలకమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ తీరు ఇంత దారుణంగా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ధర రావడం లేదని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్దామంటే అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పత్తి వ్యాపారులతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వ్యాపారులు ఎంత చెబితే అదే ధర... ఏం చెబితే అదే నడుస్తోంది. ఒకరకంగా మార్కెట్లో వ్యాపారులు, దళారుల మాఫియా నడుస్తోంది.
యంత్రాలు లేకుండానే తేమ నిర్ధారణేంటి?
పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.4,320, 9 శాతం ఉంటే రూ. 4,277, 10 శాతం ఉంటే రూ.4,234, 11 శాతం ఉంటే రూ.4,190కి, 12 శాతం ఉంటే రూ.4,147 చొప్పున కొనుగోలు చేయాలి. రైతులు తెచ్చిన బస్తాలను తేమ శాతం గుర్తించే యంత్రాలతో పరిశీలించి ఇలా ధర ఖరారు చేయాలి. కానీ ఖమ్మం మార్కెట్‌కు తెస్తున్న పత్తిలో కనీసం రెండు మూడు శాతాన్ని కూడా ఇలా యంత్రంతో పరిశీలించడం లేదు. తేమ శాతం పరిశీలించకుండానే వ్యాపారులు అడ్డగోలుగా ధర నిర్ణయించేస్తున్నారు. చేతితో పైపైన చూసి అశాస్త్రీయంగా ధర నిర్ధారిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో దాదాపు 50 మంది పత్తి వ్యాపారులుంటే ఇద్దరంటే ఇద్దరే తేమ శాతం గుర్తించే యంత్రాలను తెచ్చి అక్కడక్కడ పరిశీలిస్తున్నారు. వర్షానికి నల్లరంగులోకి మారిన పత్తి ధర క్వింటాలుకు రూ.2–3 వేల మధ్యే కొంటున్నారు. ఇక నాణ్యత కలిగిన పత్తికి ఎంఎస్‌పీ రూ.4,320 ఇవ్వాల్సి ఉండగా... మార్కెట్లో మాత్రం రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు చోద్యం చూస్తున్నారు.
రూ.2,500కే అమ్మేశా:
నాకు ఐదెకరాలుంది. పత్తి, వరి సాగు చేస్తున్నా. నాలుగెకరాల్లో పత్తి సాగుచేశా. పత్తి అమ్మితే ఎంతో ఆదాయం వస్తుందని ఆశపడ్డా. కానీ వర్షాలకు దెబ్బతిన్నది. తొలి తీతలో 2 క్వింటాళ్ల మేర వచ్చింది. అమ్మకానికి తెచ్చా. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.2,500 ఇచ్చారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా పూడని పరిస్థితి ఏర్పడింది. పంట సాగుపై రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చేలా ఉంది. పత్తి వేసి నష్టాల పాలవుతున్నా. వచ్చే ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉండాలని బావిస్తున్నా. -- పల్లెనుల యూసూబు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం
నా జీవితంలో ఇంత దారుణం చూడలేదు
ఆరెకరాల్లో పత్తి వేశా. మొదటి తీతలో వచ్చిన 20 బస్తాల పత్తిని ఆరబెట్టి అమ్మకానికి తెచ్చా. వర్షాలకు కొద్దిగా రంగు మారింది. కానీ తేమశాతం నిబంధనల ప్రకారమే ఉంది. వ్యాపారులు క్వింటాలుకు రూ.2,500 ధర పెట్టారు. రూ.3 వేలకైనా కొనండని ప్రాధేయపడ్డా. ఎంత మాత్రం కనికరించలేదు. మరీ అడిగితే మాకొద్దు అని సమాధానం చెప్పారు. 45 ఏళ్ల వ్యవసాయ జీవితంలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదు. కిలో పత్తి తీసినందుకు కూలీలు రూ.12 చొప్పున తీసుకుంటున్నారు. అంటే పత్తి ధరలో సగం కూలీలకే పోతుంది. పెట్టుబడుల్లో సగం కూడా పూడని పరిస్థితి ఉంది. పత్తి సాగు ద్వారా ఈ ఏడాది సుమారు రూ.1.80 లక్షల నష్టం వచ్చేట్లు ఉంది. --పగడవరపు రామకృష్ణ, గోపవరం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా
వ్యాపారులదే రాజ్యం
పత్తిని తేమ శాతానికి అనుగుణంగా గ్రేడింగ్ చేసి తెచ్చా. కానీ క్వింటాలుకు రూ. 4,100కే కొనుగోలు చేశారు. ఇంతకంటే దారుణమేముంది? మంచి ధర పలికే కాలంలో ఇలాంటి పత్తి క్వింటాలుకు రూ.7–8 వేలు పలికింది. ఇప్పుడు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీసీఐ అడ్రస్ లేదు. ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. రైతు మందు తాగి చావాల్సిన పరిస్థితి తెస్తున్నారు.
-- కొమ్ము నాగయ్య, లచ్చగూడెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
వ్యాపారులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నాం
వ్యాపారులను కూర్చొబెట్టి రైతులకు సరైన ధర ఇచ్చేలా మాట్లాడుతున్నాం. ఇటీవల కురిసిన వర్షాలతో ధర తక్కువగానే పలుకుతోంది. నిబంధనల ప్రకారం లేకపోవడంతో ధర తక్కువగా ఉంటోంది. తేమ శాతం ఆధారంగానే నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. -- రత్నం సంతోష్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఖమ్మం
మరి రైతులు ఎక్కడకు పోవాలి?
ఇది ఖమ్మం మార్కెట్‌లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం! ఫ్లెక్సీ తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రం కనిపించడం లేదే అనుకుంటున్నారా? అయినా ఇది కొనుగోలు కేంద్రమే. ఇలా కేవలం ఒక ఫ్లెక్సీని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గోడకు తగిలించేశారు. దాన్నే కొనుగోలు కేంద్రం అనుకోమన్నారు. అక్కడ సీసీఐ సిబ్బంది ఒక్కరూ లేరు. కాంటా లేదు. తేమ శాతం గుర్తించే యంత్రమూ లేదు. కనీసం ఓ కుర్చీ కూడా లేదు!!
Comments
Please login to add a commentAdd a comment