పత్తి రైతు కన్నెర్ర | Government neglect on Cotton farmers | Sakshi
Sakshi News home page

పత్తి రైతు కన్నెర్ర

Published Wed, Oct 14 2015 4:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

పత్తి రైతు కన్నెర్ర

పత్తి రైతు కన్నెర్ర

సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యాపారుల మాయాజాలం, అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం కలసి ఈసారీ పత్తి రైతుల పొట్టకొడుతున్నాయి. మద్దతు ధరపై ఏటా జరుగుతున్న మోసం ఈ సీజన్‌లోనూ మొదలైంది. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోళ్లు మొదలుపెట్టిన తొలిరోజే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందలేదు. ఈసారి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 ప్రకటించగా... మంగళవారం వరంగల్ మార్కెట్లో వ్యాపారులు ఇచ్చింది రూ.3,000 నుంచి రూ.3,300 మాత్రమే.

తమ కష్టమంతా కళ్లముందే దోపిడీ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో మార్కెట్‌లో కొనుగోళ్లు చాలాసేపు నిలిచిపోయాయి.
 
మొదలు పెట్టగానే..
రాష్ట్రంలో ఈ ఏడాది 16.32 లక్షల హెక్టార్లలో పత్తి సాగుకాగా.. దాదాపు 150 లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అంచనా. 2015-16 మార్కెట్ సీజన్‌లో పత్తికి రూ.4,100 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీసీఐ ప్రకటించింది. ఈనెల 10 నుంచి కొనుగోళ్లు చేపడతామని ప్రకటించినా.. సెలవుల పేరుతో 12వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

మంగళవారం వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు రైతులు 24 వాహనాల్లో లూజుగా(బస్తాల్లో కాకుండా నేరుగా), విడిగా మరో 50 వేల బస్తాల్లో పత్తిని తెచ్చారు. అయితే సీసీఐ అధికారులు కొనుగోలుకు ముందే నిబంధనల సాకులు మొదలుపెట్టారు. వాహనాల్లో లూజుగా తెచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. అలా తెచ్చిన పత్తికే తేమ పరీక్షలు చేశారు. 15 వాహనాల్లోని పత్తికి మద్దతు ధర చెల్లించారు. మిగతా తొమ్మిది వాహనాల్లోని పత్తిని తేమ సాకు చెప్పి తిరస్కరించారు. ఇక బస్తాల్లో పత్తిని తెచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
వ్యాపారుల దోపిడీ ఇలా..
సీసీఐ తిరస్కరించిన, బస్తాల్లో తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. దాదాపు 80 శాతం పత్తికి రూ.3,000 నుంచి రూ.3,300 మధ్య ఇస్తామన్నారు. మిగతా 20 శాతం పత్తికి రూ.3,920 ధర పెట్టారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ పత్తి కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి రైతులను నియంత్రించారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన సాంబయ్య అనే రైతు కొంత పత్తిని కాల్చే ప్రయత్నం చేశారు. కొద్దిగా పొగలు కమ్ముకోవడంతో మార్కెట్‌లోని ఫైరింజన్ వచ్చింది. కొద్దిగా అంటుకున్న పత్తిపై సిబ్బంది నీళ్లు చల్లి ఆర్పారు. అనంతరం కొందరు రైతులు మార్కెట్ కార్యాలయానికి వచ్చి పత్తికి క్వింటాల్‌కు రూ.6 వేలు చొప్పున ధర ఇవ్వాలని, బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన వరంగల్ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నిరసన తెలిపిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
 
ఖమ్మం, కరీంనగర్‌లోనూ ఇదే తీరు..

ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి మార్కెట్లకు వస్తోంది. సీసీఐ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులను వ్యాపారులు, దళారులు నిండా ముంచుతున్నారు. తేమ శాతం సాకుతో రూ.3000 నుంచి రూ.3,500 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని 8 కేంద్రాల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయనుంది. ఇక మంగళవారం కరీంనగర్ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించినా... తేమ సాకుతో కొనుగోళ్లు చేపట్టలేదు.

12 శాతం తేమ ఉంటేనే కనీస మద్దతు ధర రూ.4,100 చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ విషయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని జమ్మికుంట, కరీంనగర్, గంగాధర, చొప్పదండి, పెద్దపల్లి యార్డుల్లోనూ సీసీఐ కేంద్రాల జాప్యంతో వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు సగటున రూ.3 వేల చొప్పున కొనుగోలు చేశారు.

మేం తెచ్చింది పత్తి కాదా..?
మార్కెట్‌కు 16 బస్తాల పత్తిని తెచ్చిన. బస్తాలల్ల తెచ్చిన్నని సీసీఐ అధికారులు కొనరట. మేము తెచ్చింది పత్తి కాదా. నిమ్ముతో సహా మంచిదో కాదో చూసుకోండి. లూజుగా తేవాలంటే వ్యాను కిరాయి తక్కువ అయితదా. ఏందీ మోసం?
- గుండారపు స్వామి, మొగుళ్లపల్లి
 
అంతా మోసపు మాటలు
నేను 21 బస్తాల పత్తిని వరంగల్ మార్కెట్‌కు తీసుకువచ్చిన. ఇక్కడ క్వింటాలుకు రూ.3,350 ధర పెట్టారు. మరి ప్రభుత్వం చెబుతున్న మద్దతు ధర ఏది. సీసీఐ అధికారులు ఏరి. అంతా మోసపు మాటలు. అందరు కలసి దోచుకోవడమే లెక్క.
- జోడు కనకయ్య, జమ్మికుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement