Purchase of cotton
-
సీసీఐపైనే పత్తి కొనుగోలు భారం!
లావాదేవీలపైవెనక్కి తగ్గిన మార్క్‌ఫెడ్ వచ్చే ఏడాది నుంచి సేకరణకు ప్రణాళిక మహారాష్ట్ర తరహా విధానంపై అధ్యయనం హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మార్క్‌ఫెడ్ చివరి నిమిషంలో ప్రతిపాదన విరమించుకుంది. పత్తి సేకరణలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుసరించిన విధానం పలు చోట్ల వివాదాస్పమైంది. ఈ నేపథ్యంలో 2015-16 సీజన్ పత్తి కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే సీసీఐ నుంచి పత్తి సేకరణకు అవసరమైన నిధులు, అనుమతులు తక్షణమే లభించడం కష్టమని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఏటా వరి, మొక్కజొన్న ధాన్యం సేకరణలో కీలకంగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్ పత్తి సేకరణకు కనీసం రూ. 2వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అదీగాక సేకరించిన పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయడం తక్షణమే ఆచరణ సాధ్యం కాదని భావించింది. దీంతో మహారాష్ట్ర తరహా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. మహారాష్ట్రలో మార్క్‌ఫెడ్ తరహా సంస్థలు కేవలం పత్తి సేకరణకు పరిమితం కాకుండా అమ్మకాలు కూడా సాగిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర విధానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని సంకల్పించింది. దీంతో ఈ ఏడాది పత్తి సేకరణ బాధ్యత సీసీఐకే అప్పగించి, వచ్చే ఏడాది నుంచి రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌కు ఇటీవల మార్కెటింగ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్పులు సూచించిన సర్కారు గత ఏడాది పత్తి కొనుగోలుకు సీసీఐ రాష్ట్రంలో 83 కేంద్రాలు ఏర్పాటు చేసి 2.02 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 16.33 లక్షల హెక్టార్లలో 27.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సీసీఐ వంటి సంస్థల జోక్యంతోనే పత్తి సేకరణలో మధ్య దళారీల ప్రమేయాన్ని తగ్గింవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు సీసీఐ గత ఏడాది జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో జిన్నింగ్ మిల్లు యజమానులు సీసీఐకి పత్తి నిల్వలు అంటగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో సీసీఐ తీరు విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వెనక్కి తగ్గడంతో మరోమారు సీసీఐపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. కొనుగోలు కేంద్రాలను 90కి పెంచాలని, జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు పత్తి రైతుల జాబితా రూపొందించి గుర్తింపు కార్డులు అందజేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే పత్తి కొనుగోలులో సీసీఐ ఎంతమేర సఫలమవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయండి
సీసీఐ సీఎండీ బీకే మిశ్రాకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు గత ఏడాది ఏర్పాటు చేసిన 83 కేంద్రాలతో పాటు అదనంగా మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారులకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. సంస్థ వరంగల్, ఆదిలాబాద్ జనరల్ మేనేజర్లు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ పది నుంచి 30వ తేదీలోపు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ఏడాది పత్తి కొనుగోలు సందర్భంగా ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ తరఫున సిబ్బందిని నియమించి, కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలన్నారు. జిల్లాలవారీగా పత్తి రైతులను గుర్తించి, వారి వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన పత్తికి 48 గంటల లోపు రైతుల ఖాతాలోకి ఆన్లైన్లో డబ్బులు జమ చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందు హమాలీలతో సమావేశాలు నిర్వహించాలని, సీసీఐ అధికారులతో కలసి తూకపు యంత్రాలు, మౌలిక సౌకర్యాలను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి తక్కువ వుండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై మార్కెటింగ్ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కేంద్రం పత్తికి రూ.4,100 కనీస మద్దతుధర ప్రకటించిందని సీసీఐ సీఎండీ బీకే మిశ్రా వెల్లడించారు. -
కాటన్..టెన్షన్..!
- పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన - రికార్డులు తారుమారు చేసే పనిలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు - మంత్రి ప్రత్తిపాటిని కలసిన దళారులు, పారిశ్రామికవేత్తలు - నామామాత్ర విచారణ జరిగేలా చూడాలని వేడుకోలు - మరో వైపు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరిన విజిలెన్స్ ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కొనుగోలులోని అవినీతి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని వివిధ శాఖల అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ అక్రమంలో ముఖ్య భూమిక వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు పాత రికార్డులను సరిచేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో తెరవెనుక ఉండి వ్యవహారం నడిపిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సేఫ్ జోన్లోనే ఉంటారని, తమపైనే వేటు పడుతుందనే ఆందోళనలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు. ఈ గండం నుంచి తమను గట్టెక్కించకపోతే విచారణలో అసలు బండారం బయట పెడతామని కొందరు హెచ్చరించడంతో ఈ వ్యవహారం ముదురు పాకాన పడింది. దీంతో కొంతమంది దళారీలు, పత్తి ఆధారిత పారిశ్రామికవేత్తలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలసి విచారణ నామమాత్రంగా జరిగే విధంగా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశాలు ఇస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తమతోపాటు అనేక మంది నేరస్తులుగా మిగిలిపోతారని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పత్తి కొనుగోలులోని అక్రమాలపై వివిధ దినపత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురి ంచడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి. కేవీ మోహన్‌రావు వాటి వివరాలను ప్రభుత్వానికి వివరించారు. విచారణకు అనుమతి కోరారు. అయితే సీబీఐతోనే విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద పత్తి కొనుగోలుకు సంబంధించిన వివరాలను అందించాలని సీసీఐ అధికారులను విపక్షాల ప్రతినిధులు కోరారు. రికార్డుల తారుమారు ... జిల్లాలోని 11 కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆ కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో 2.19 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవంగా మిగిలిన కొనుగోలు కేంద్రాల్లో సెప్టెంబరులో కొనుగోళ్లు ప్రారంభమైతే చిలకలూరిపేటలో మంత్రి కుమార్తె వివాహ వేదిక మార్కెట్‌యార్డు కావడంతో నవంబరులో ప్రారంభించారు. అప్పటికే రైతులు ప్రైవేట్ వ్యాపారుల పేరుతో చెలామణి అయిన మంత్రి అనుచరులకు క్వింటాలు రూ.3500లోపే అమ్ముకున్నారు. ఏప్రిల్ 15తో కొనుగోళ్లు నిలిపివేశామని సీసీఐ అధికారులు ప్రకటించినా, మార్చినెలాఖరునాటికి కొను గోళ్లు నిలిచిపోయాయి. ఈ కేంద్రంలో లక్ష క్వింటాళ్ల లోపే కొనుగోళ్లు జరిగినట్టు అక్కడి సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. రికార్డుల్లోని మిగిలిన తేడాను సరిచేసేందుకు మిగిలిన ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చినట్టుగా రికార్డులు తారుమారు చేస్తున్నారని, గుంటూరు మార్కెట్ యార్డులోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇంకా పూర్తికాని విచారణ ..... ఇదిలాఉండగా, 2004లో కూడా పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో దీనిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అనేక మంది ఉద్యోగులు, అధికారులు విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు. -
సర్కార్కే టోకరా!
ప్రస్తుతం మార్కెట్లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న పత్తిరైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.రూ.3,750- రూ.4,050 మధ్య చెల్లిస్తోంది. కానీ ఈ మద్దతు మాత్రం రైతుకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కార్ మద్దతును దక్కించుకుంటున్నారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ చెల్లింపులకు కనీసంగా 10 రోజుల సమయం తీసుకుంటుంది. కానీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు అన్ని రోజులు ఆగలేక మద్దతు ధర కంటే రూ.400 తక్కువకే వ్యాపారికి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి పత్తి కొన్న వ్యాపారులు రైతుల పేరుమీదే సీసీఐకి పత్తిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారికి అటు మార్కెట్ ఫీజు వడ్డన తప్పడంతో పాటు క్వింటాల్‌కు రూ.400 అదనంగా లభిస్తోంది. గజ్వేల్: జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగులోకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులతో పంటకు అపార నష్టం కలిగింది. పరిస్థితులు కలిసివస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 60 లక్షల పైచిలుకు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ కాలం కలిసి రాకపోవడంతో సాగైన పంటలో 50 శాతానికిపైగా పంట దెబ్బతినింది. ప్రస్తుతం 25 నుంచి 30 లక్షల క్వింటాళ్ల దిగుబడులు మాత్రం చేతికందే అవకాశముంది. ఇప్పటివరకు సీసీఐ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, తొగుట, వట్పల్లి కేంద్రాల ద్వారా 3.21 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కేవలం 11 వేల పైచిలుకు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ప్రతిఏటా ఈ సీజన్లో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పత్తి ధర ఎంఎస్పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) కంటే ఎక్కువ పలుకుతుంది. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులంతా ‘ప్రభుత్వ మద్దతు ధర’పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయిస్తే డబ్బులు ఆలస్యమవుతాయనే కారణంతో రైతులు మద్దతు ధర రూ.3,750- రూ.4,050 కంటే రూ. 300 నుంచి రూ.400 తక్కువైనా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. రైతుల నుంచి రైతుపేరుతోనే అమ్ముతారు చిన్న, సన్నకారు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వ్యాపారులు తిరిగి సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కే విక్రయిస్తున్నారు. సాధారణంగా సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలను సమర్పించి, మార్కెట్ యార్డుల్లో తక్‌పట్టీని పొందిన తర్వాతే తమ ఉత్పత్తులను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాల్సి ఉంటుంది. రైతు సీసీఐకి పత్తి విక్రయించిన10 రోజుల్లో చెక్కురూపంలో చెల్లింపులు జరుగుతాయి. కానీ వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని వారి పాస్బుక్కుల జిరాక్స్‌లు, అక్కౌంట్ నంబర్లు తీసుకొని రైతుల పేరుతోనే సీసీఐ విక్రయిస్తూ మద్దతు ధర పొందుతున్నారు. నిజానికి వ్యాపారులు తాము లావాదేవీలు లెక్కలు చూపితే వారి కొనుగోళ్ల విలువలో 1 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే వ్యాపారులు ఇటు మార్కెట్ఫీజును ఎగొట్టడంతో పాటు రైతుల పేరుతో పత్తిని విక్రయించి మద్దతును దక్కించుకుంటున్నారు. గజ్వేల్‌లో ప్రస్తుత సీజన్లో సీసీఐ ఇప్పటివరకు 97 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. మద్దతు ధర క్వింటాలుకు సుమారు రూ.4వేల చొప్పున లెక్కిస్తే మొత్తం దీని విలువ సుమారు రూ.39 కోట్ల వరకు ఉంటుంది. ఇందుకుగానూ సీసీఐ మార్కెట్ యార్డుకు రూ.39 లక్షల మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన 97 వేల క్వింటాళ్లలో 80 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులకు చెందిన ఉత్పత్తులే ఉంటాయి. ఈ లెక్కన రైతుల పేరిట తమ ఉత్పత్తులను అమ్ముకోవటం ద్వారా సుమారు రూ.30 లక్షల వరకు మార్కెట్ ఫీజు ఎగవేసినట్టు స్పష్టమవుతుంది. వ్యాపారులు మాత్రం తాము ఇప్పటివరకు కేవలం 10 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశామని (దీని విలువ సుమారు రూ. 4 కోట్లు) లెక్కలు చూపుతూ కేవలం రూ.4 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు చెల్లించనున్నారు. అధికారుల అండదండలతో ఈ అక్రమం నడుస్తుందనే ఆరోపణలున్నాయి. అన్నీ కాకిలెక్కలు..! పత్తి కొనుగోళ్ల తీరుపై మార్కెటింగ్ శాఖ చెబుతున్న లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రెండ్రోజుల క్రితం వరకు 3.17 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారని మార్కెటింగ్ శాఖ చెబుతోంది. వారి లెక్కల ప్రకారం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది 11 వేల పైచిలుకు క్వింట్లాళ్లే. అందులో 10 వేలకుపైగా లావాదేవీలు కూడా గజ్వేల్‌లో జరిగాయని కాకిలెక్కలు చెబుతున్నారు. జిల్లాలోని సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, వట్‌పల్లిల్లో ప్రైవేట్ వ్యాపారులు చాలామందే ఉన్నా, వారు మాత్రం పత్తిని కొనుగోలు చేయలేదన్నది సర్కార్ లెక్కల సారాంశం. కొనుగోలు చేసినా పదుల సంఖ్యలో క్వింటాళ్లల్లో మాత్రమే కొనుగోలు చేశారంట. నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన పత్తి ఉత్పత్తుల్లో 50 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులే ఉంటాయని తెలుస్తోంది. దీన్ని బట్టి సీసీఐ కొనుగోలు చేసిన 3.21 క్వింటాళ్ల విలువ సుమారు రూ.12.5 కోట్లకుపైగా ఉంది. దీని ప్రకారం ఆయా మార్కెట్ యార్డులకు ఆ సంస్థ రూ.1.25 కోట్ల మేర మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగానికిపైగా వ్యాపారుల ఉత్పతులున్నాయని తెలుస్తుండగా, వారు తమ ఉత్పత్తులను రైతుల పేరిట అమ్ముకోవటంవల్ల రూ.62.5 లక్షల మేర మార్కెట్ ఫీజు ఎగవేశారని చెప్పొచ్చు. మరి కొన్ని రోజులూ పరిస్థితి ఇలానే ఉంటే కోట్లల్లో మార్కెట్ కమిటీలు ఆదాయాన్ని కోల్పోవడం ఖాయం. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. జిన్నింగ్ మిల్లుల్లో ఇష్టారాజ్యం... జిన్నింగ్ మిల్లుల్లోనూ సీసీఐ అధ్వర్యంలో కొనుగోళ్లను చేపట్టవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడం వ్యాపారులకు వరంగా మారింది. సీసీఐ సిబ్బంది అంతా జిన్నింగ్ మిల్లుల్లోనే ఉంటూ కొనుగోళ్లు సాగిస్తున్నారు. దీంతో వ్యాపారులు రైతుల రూపేణా పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను మిల్లులకు తరలిస్తున్నారు. -
పత్తి పోటెత్తె..
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రానికి మంగళవారం పత్తి భారీగా అమ్మకానికి వచ్చింది. సుమారు 45 వేల పత్తి బస్తాలు విక్రయానికి వచ్చాయి. గత గురువారం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేశారు. ఆ రోజు కూడా సుమారు 30 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఒక్క రోజులో పత్తి కొనుగోళ్లు పూర్తిగాక పోవడంతో శుక్రవారం కూడా కొనుగోళ్లు చేశారు. శనివారం అమావాస కావడం, మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ఆ రోజు కాంటాలు తదితర పనులు పూర్తికాలేదు. దీంతో గురువారం సీసీఐ కేంద్రానికి వచ్చిన సరుకు కాంటాలు తదితర పనులు సోమవారానికి పూర్తయ్యాయి. దీంతో నాలుగు రోజుల పాటు సీసీఐ కేంద్రంలో కొత్తగా సరుకు కొనుగోళ్లు జరప లేదు. దీంతో మంగళవారం సీసీఐ కేంద్రానికి పత్తి పోటెత్తింది. తప్పని కొనుగోలు కష్టాలు మంగళవారం కూడా గురువారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యాయి. ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లకు ఒక్క బయ్యరును మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఒక్క బయ్యరు సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన 45 వేల బస్తాలను ఒక్క రోజులో కొనుగోలు చేయటం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా ఇదే బయ్యరుకు కొత్తగూడెం, చండ్రుగొండ సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోళ్ల పనిని కూడా అప్పగించారు. ఒక్క బయ్యరుకు మూడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల పని అప్పగించడంతో సరుకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు కొనుగోలుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుండగా సరుకు కాంటాలకు మరో రెండు రోజులు పడుతుంది. మొత్తంగా రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకొస్తే వారం రోజులు ఆ కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక అమ్మిన సరుకు చెక్కులు 20 రోజులకైనా రావటం లేదు. వాటి కోసం కూడా రైతులు మార్కెట్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రంలో పత్తి అమ్మకానికి రైతులు తీవ్ర అవస్థలు పడక తప్పటం లేదు. మంగళవారం అమ్మకానికి తెచ్చిన సరుకులో అదే రోజు కేవలం 15 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. మరో 25 వేల బస్తాలను బుధవారం కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో 25 వేల బస్తాలు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిండచం లేదు. బుధవారం ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు జరపడం లేదని కొత్తగా రైతులు సీసీఐ కేంద్రానికి సరుకు అమ్మకానికి తీసుకురావొద్దని మార్కెట్ అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థంకంగానే ఉంది. సీసీఐ కొనుగోళ్లు సజావుగా లేకపోవడం, డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో విసుగు చెందుతున్న రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. సీసీఐ ఇబ్బందులను భరించలేక రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు సరుకును అమ్ముకుంటున్నారు. సీసీఐకి విక్రయించడంకంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని రైతులు భావిస్తున్నారు. -
పత్తి కొనుగోలుకు సీసీఐ మరోమారు విముఖత
ఖమ్మం వ్యవసాయం: పత్తి కొనుగోలుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి కనబరచటం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి గురువారం అమ్మకానికి వచ్చిన దాదాపు 25 వేల పత్తి బస్తాలను కొనేందుకు సీసీఐ బయ్యర్లు విముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచే వారు వెనుకడుగు వేశారు. బుధవారం రాత్రి 7 గంటల తరువాత గరువారం పత్తి కొనుగోలు చేయలేమని మార్కెట్ అధికారులకు సీసీఐ బయ్యర్ తెలిపారు. జీళ్లచెరువు వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో పత్తి అన్లోడ్ చేయటానికి ఇబ్బందిగా ఉందని, మాయిశ్చర్ మిషన్లు సక్రమంగా పని చేయటం లేదని, సోమవారం కొనుగోలు చేసిన సరుకు కాంటాలు పూర్తికాలేదనే కారణాలు చూపుతూ సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేశారు. సోమవారం సరుకును కొనుగోలు చేసిన సీసీఐ మంగళ, బుధవారాల్లో దార్ని కాంటాలు పెట్టాలని గురువారం తిరిగి కొనుగోళ్లు జరుపుతామని ప్రకటించింది. ఆ విధంగానే మార్కెట్ అధికారులు మంగళ, బుధ వారాల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు ఉండవని ప్రకటించారు. గురువారం నుంచి కొనుగోళ్లు ఉంటాయని బుధవారం రాత్రి నుంచే రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకురావడం ప్రారంభించారు. తీరా బుధవారం రాత్రి సీసీఐ బయ్యర్ గురువారం కూడా కొనుగోళ్లు చేయలేమని చెప్పారు. దీనికి మార్కెట్ అధికారులు అంగీకరించలేదు. గురువారం ఉదయం 9 గంటల వరకు కూడా సీసీఐ బయ్యర్ పత్తి కొనుగోలుకు రాకపోవటంతో వరంగల్ జోన్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పర్సన్ ఇన్చార్జి సుధాకర్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి బయ్యర్ వశిష్టను మార్కెట్ కార్యాలయానికి పిలిపించారు. పత్తి కొనుగోలు చేయటానికి పలు ఇబ్బందులున్నాయని బయ్యర్ అధికారులకు చెప్పారు. అందుకు అధికారులు అంగీకరించ లేదు. సరుకును కొనుగోలు చేయాలని చెప్పారు. ఉదయం వేళలో మాయిశ్చర్ ఉంటుందని కాలం గడిపి 11:30 గంటల సమయంలో కొనుగోళ్లను ప్రారంభించారు. కేంద్రానికి వచ్చిన 25వేల బస్తాలలో కేవలం 12 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. వీటిని కూడా బయ్యర్ అనుచరులు మాయిశ్చర్ మిషన్‌తో పరీక్షలు నిర్వహించి కొనుగోలు చేశారు. సాయంత్రం 4:30 గంటల తరువాత కొనుగోళ్లను నిలిపివేయటంతో తమ సరుకును కూడా కొనుగోళ్లు జరపాలని రైతులు ఆందోళన చేశారు. మార్కెట్ అధికారులు బయ్యర్‌ను సంప్రదించి సరుకు కొనుగోలు చేయాలని కోరారు. శుక్రవారం సరుకు కొనుగోలు చేస్తానని చెప్పారు. అధికారులు రైతులకు సర్ది చెప్పారు. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకువస్తే రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాయాల్సివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
సీసీఐ ‘షో’
రెండోరోజు కూడా పత్తి కొనుగోలుకు ఆసక్తి చూపని బయ్యర్ ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా ‘షో’గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు(శనివారం)న కూడా సీసీఐ కొనుగోళ్లు జరగలేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి కొనుగోళ్లు సాగించాలని సీసీఐ నిర్ణయించింది. తొలి రోజున ఇలా... తొలి రోజున మార్కెట్‌కు ఇద్దరు సీసీఐ బయ్యర్లు, వరంగల్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్(జేడీఎం) వచ్చారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి జిల్లా ఉన్నతాధికారులను గానీ, ప్రజాప్రతినిధులనుగానీ ఆహ్వానించలేదు. వ్యాపారులతో, కమీషన్ ఏజెంట్లతో, రైతులతో, కార్మిక సంఘాల ప్రతినిధులతో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా విడి పత్తిని రైతులు తీసుకురాలేదని అన్నారు. ఆ తరువాత, వారు కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరగటంతో అధికారులు, ఇద్దరు బయ్యర్లు కలిసి మార్కెట్ యార్డులోకి వెళ్లి సరుకును పరీక్షించి, ‘తేమ అధికంగా ఉంది’ అని చెప్పి తొలి రోజున కొనుగోళ్లు ప్రారంభించలేదు. రెండోరోజున.. రెండోరోజు శనివారం కూడా రైతులు దాదాపు 14,000కు పైగా బస్తాలలో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఒక్క బయ్యర్ మాత్రమే మార్కెట్లో ఉన్నారు. పత్తి కొనుగోలుకు ఆయన ఆసక్తి చూపలేదు. అదే సమయంలో.. ‘సీసీఐ కొనుగోళ్లు చేసినా డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుంది. నెల తరువాత సరుకు తాలూకు డబ్బు ఇస్తుంది’ అనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే అదనుగా జెండా పాటకు ముందే కొందరు వ్యాపారులు సరకు కొనుగోలు చేశారు. బయ్యర్ ‘షో’ సరుకు కొనుగోలు చేయటం లేదన్న విమర్శలు రాకుండా ఉండేందుకు రెండోరోజున సీసీఐ బయ్యర్ ‘షో’ చేశారు. ఆయన మార్కెట్ అధికారులతో కలిసి యార్డులో అక్కడక్కడ తిరిగి సరుకును ‘పరిశీలించారు’. ‘ప్చ్.. ఈ రోజు వచ్చిన సరుకులో కూడా తేమ శాతం ఎక్కువ గా ఉంది. నిబంధనల ప్రకారంగా దీనిని కొనుగోలు చేయలేము’ అని చేతులెత్తేశారు. దీంతో, పత్తి రైతులు అయోమయానికి, ఆందోళనకు లోనయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరుకును వ్యాపారులకు (వారు చెప్పిన ధరకే) విక్రయించారు. ‘‘సీసీఐ బయ్యర్లు షో చేశారు. సరుకును కొనకూడదని ముందే నిర్ణయించుకున్నా రు’’అని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రచారం ఘనం.. ఫలితం శూన్యం.. ‘ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటవుతుంది. రైతులెవరూ కూడా తమ సరుకును దళారులకు అమ్మొద్దు’ అంటూ, గ్రామాల్లో మార్కెటింగ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనిని నమ్మి, సరుకును తీసుకొచ్చిన రైతులు.. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన ‘షో’ చూసి నివ్వెరపోయారు. ‘సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని, క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధర పొందండని చెప్పిన అధికారులు.. రెండు రోజులుగా సీసీఐ సాగిస్తున్న ‘షో’పై ఎందుకు స్పందించడం లేదంటూ రైతుల్లో ఆగ్రహావేశంతో ప్రశ్నిస్తున్నారు. పత్తి నిల్వలు ఉండడం, అంతర్జాతీయంగా ఎగుమతులు లేనందునే కొనుగోళ్లకు సీసీఐ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది. -
పత్తిని సీసీఐ అధికారులే కొనాలి
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : పత్తి కొనుగోలు చేసిన రోజే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్తాల చందర్రావు సీసీఐ అధికారులను కోరారు. సంఘం ఆధ్వర్యం లో గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా పత్తి కొను గోలు చేయాలని ముంబైలో సీసీఐ సీఎండీ, కేంద్ర జౌళిశాఖ మం త్రికి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. తేమ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు.. మద్దతు ధరతో పత్తిని నేరుగా కొనుగోలు చేసి రైతులకు గన్నీ సంచుల డబ్బులతో సహా చెల్లించాలని కోరారు. కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు), ఖరీదుదారులు, జిన్నింగ్ మిల్లు యజమానుల ప్రమేయం లేకుండా చూడాలని సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయించాలని, తూకం, చిట్టాబుక్, తక్‌పట్టీల ద్వారా చెల్లింపులను రైతులకు తెలియజేయాలన్నారు. అవసరమైతే రైతులకు డబ్బులను అకౌంట్ పేమెంట్ ద్వారా చెల్లించాలని సూచించారు. సీజన్లో రోజుకు సుమారు లక్ష బస్తాల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొస్తారని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. పత్తి బస్తాలను ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి మీదనే తూకం వేయించాలని, ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 15 శాతం కమీషన్లు.. రైతులకు అడ్తిదారులు డబ్బులు అదేరోజు అందజేయాలని, రూ.2 కంటే కమీషన్ మించకుండా చూడాలని ఆయన సూచించారు. వరంగల్ మార్కెట్లో అడ్తిదారులు రూ.3 నుంచి రూ.6 వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకం పేరుతో మరో 4 శాతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఖాళీ బస్తాలు, హమాలీ, గుమస్తా, దడువాయి, ఇతర ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకుని క్వింటాలుకు రూ.15 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని వివరించారు. కమీషన్ల పేరుతో రైతులు మార్కెట్లో రోజుకు 7 నుంచి 8 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని వెల్లడించారు. రైతు సంఘం ప్రతినిధు లు వారం రోజులకోసారి మార్కెట్‌ను సందర్శించి కొనుగోళ్లలో జరిగే లోపాలు, అక్రమాలను బయటపెడతారని ఆయన అడ్తి వ్యాపారులను హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రతిని ధులు ఎం.వాసుదేవరెడ్డి, ఎస్.రోశయ్య, ఓదెల రాజయ్య, జె.జనార్దన్‌రెడ్డి, కత్తి సుధాకర్ పాల్గొన్నారు.