పత్తిని సీసీఐ అధికారులే కొనాలి | CCI officials to buy cotton | Sakshi
Sakshi News home page

పత్తిని సీసీఐ అధికారులే కొనాలి

Published Fri, Oct 4 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

CCI officials to buy cotton

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : పత్తి కొనుగోలు చేసిన రోజే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్తాల చందర్‌రావు సీసీఐ అధికారులను కోరారు. సంఘం ఆధ్వర్యం లో గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా పత్తి కొను గోలు చేయాలని ముంబైలో సీసీఐ సీఎండీ, కేంద్ర జౌళిశాఖ మం త్రికి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు.

 తేమ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు..

మద్దతు ధరతో పత్తిని నేరుగా కొనుగోలు చేసి రైతులకు గన్నీ సంచుల డబ్బులతో సహా చెల్లించాలని కోరారు. కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు), ఖరీదుదారులు, జిన్నింగ్ మిల్లు యజమానుల ప్రమేయం లేకుండా చూడాలని సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయించాలని, తూకం, చిట్టాబుక్, తక్‌పట్టీల ద్వారా చెల్లింపులను రైతులకు తెలియజేయాలన్నారు. అవసరమైతే రైతులకు డబ్బులను అకౌంట్ పేమెంట్ ద్వారా చెల్లించాలని సూచించారు. సీజన్‌లో రోజుకు సుమారు లక్ష బస్తాల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొస్తారని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. పత్తి బస్తాలను ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి మీదనే తూకం వేయించాలని, ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని డిమాండ్ చేశారు.

 క్వింటాలుకు 15 శాతం కమీషన్లు..

 రైతులకు అడ్తిదారులు డబ్బులు అదేరోజు అందజేయాలని, రూ.2 కంటే కమీషన్ మించకుండా చూడాలని ఆయన సూచించారు. వరంగల్ మార్కెట్‌లో అడ్తిదారులు రూ.3 నుంచి రూ.6 వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకం పేరుతో మరో 4 శాతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఖాళీ బస్తాలు, హమాలీ, గుమస్తా, దడువాయి, ఇతర ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకుని క్వింటాలుకు రూ.15 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని వివరించారు.

కమీషన్ల పేరుతో రైతులు మార్కెట్‌లో రోజుకు 7 నుంచి 8 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని వెల్లడించారు. రైతు సంఘం ప్రతినిధు లు వారం రోజులకోసారి మార్కెట్‌ను సందర్శించి కొనుగోళ్లలో జరిగే లోపాలు, అక్రమాలను బయటపెడతారని ఆయన అడ్తి వ్యాపారులను హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రతిని ధులు ఎం.వాసుదేవరెడ్డి, ఎస్.రోశయ్య, ఓదెల రాజయ్య, జె.జనార్దన్‌రెడ్డి, కత్తి సుధాకర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement