వరంగల్‌.. బెల్లం బజార్‌ ! | Jaggery Syndicate People Increase Price Market In Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌.. బెల్లం బజార్‌ !

Published Mon, Aug 5 2019 1:05 PM | Last Updated on Mon, Aug 5 2019 1:06 PM

Jaggery Syndicate People Increase Price Market In Warangal - Sakshi

సాక్షి, రామన్నపేట: సాధారణంగా బెల్లం కేజీ ధర రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఇదంతా ఒకే రీతిలో ఉన్నా హోల్‌సేల్‌ వ్యాపారానికి పేరు గాంచిన వరంగల్‌ బీట్‌బజార్‌లో మాత్రం ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పోతోంది. ఇక్కడి సిండికేట్‌ కారణంగా హోల్‌సేల్‌గానే బెల్లం ధర రూ.55 పలుకుతుండగా.. రిటైల్‌ మార్కెట్‌కు వచ్చే సరికి ఇది రూ.60కి చేరుతుండడం గమనార్హం. ‘సిండికేట్‌’గా ఏర్పడిన కొందరు వ్యాపారుల తీరు కారణంగా ఈ ధర ఒక్కో సారి ఇంత కంటే ఎక్కువగా పలికిన సందర్భాలు ఉన్నాయి.
 
గుడుంబా ముడిసరుకులపై నిషేధం
గుడుంబా తయారీ, అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో భాగంగానే గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక అమ్మకాలపై నియంత్రణ పెంచింది. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఇస్తేనే బెల్లం అమ్మాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్రమక్రమంగా బెల్లం వినియోగాన్ని గృహ అవసరాలకు పరిమితం చేయడానికి ఉపక్రమించింది. గుడుంబా బట్టీలకు బెల్లం చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ వెళ్లడంతో బెల్లం గృహావసరాలకే పరిమితమైంది.

రంగంలోకి సిండికేట్‌ వ్యాపారులు
బెల్లం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టింది. కొద్ది మంది వ్యక్తులే ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా బెల్లాన్ని గుడుంబావ్యాపారులకు చేరవేసేవారు. కొద్దిరోజుల్లోనే  రైళ్ల ద్వారా కూడా బెల్లం రాకుండా అధికారులు నియంత్రించగలిగారు. ఇక్కడే సిండికేట్‌ రంగంలోకి దిగింది. గు డుంబా తయారీ తగ్గుముఖం పడుతున్న క్రమంలో సిండికేట్‌గా మారిన కొందరు వ్యాపారులు మళ్లీ బెల్లం అమ్మకాలకు తెర తీయడం ద్వారా ప్రభుత్వ స్పూర్తికి తూట్లు పొడిచారు. ఈ వ్యాపా రం వరంగల్‌ బీట్‌ బజార్‌ కేంద్రంగా కొనసాగుతుండడం.. ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వస్తుండడం గమనార్హం.

రెట్టింపు ధర
మార్కెట్‌లో సాధారణ ప్రజలకు బెల్లం అమ్ముతున్నామన్న నెపంతో విక్రయిస్తున్నా ఎక్కువ శాతం సరుకు మళ్లీ గుడుంబా బట్టీలకే చేరుతోంది. బెల్లం అమ్మకాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి చాటుమాటుగా ఎంతో రిస్క్‌ తీసుకుని మరీ బెల్లం తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు వరంగల్‌ మార్కెట్‌లో బెల్లం లభిస్తుండడంతో గుడుంబా తయారీ దారులు సిండికేట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా గు డుంబా అమ్మకం, తయారీదారుల నుంచి ఉన్న డి మాండ్‌ను ఆసరాగా చేసుకుని సిండికేట్‌ వ్యాపారులు ధరను రెట్టింపు చేసేశారు. కేజీ రూ.30 ఉండాల్సిన బెల్లాన్ని హోల్‌సెల్‌ మార్కెట్‌లోనే రూ.55కు పెంచారు. దీంతో గృహ అవసరాలు, శుభకార్యాలకు బెల్లం కావాల్సిన వారు ఇంత ధర వెచ్చించలేక సమస్యెదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ సిండికేట్‌ ఫలితంగా పల్లెల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం విధించిన నిషేధం నీరుగారుతున్నట్లవుతోంది.

ధర తగ్గనివ్వరు..
పది మంది బెల్లం వ్యాపారులతో కలిసి ఏర్పడిన సిండికేట్‌ మార్కెట్‌లో బెల్లం ధర తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త వారెవెరూ బెల్లం అమ్మకుండా చూస్తున్నారు. సరుకు తెప్పించడం, వ్యాపారుల వారీగా విభజించడం, డబ్బు వసూలు చేయడం, అధికారులను మచ్చిక చేసుకోవడం ఇలా పనులను విభజించకున్న వ్యాపారులు ధర ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు తెలిసినా ‘మామూలు’గా ఊరుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సిండికేట్‌ను కాదని బెల్లం అమ్మే వారి సమాచారం ఇచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిషేధం సజావుగా అమలు జరగాలన్నా... సామాన్యులకు గృహ అవసరాల కు బెల్లం అందుబాటులోకి రావాల్సిన అధికారులు కొరఢా ఝులిపించాల్సిన అవసరం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement