Warangal market
-
పసిడితో మిర్చి పోటీ.. క్వింటాల్ రూ. 52 వేలు.. దేశవ్యాప్తంగా ఆల్లైమ్ రికార్డు!
సాక్షి, వరంగల్: మిర్చి పంట బంగారమైంది.. పసిడి రేటును తలదన్నింది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గడం.. ప్రస్తుత సీజన్లో పచ్చళ్లలో ఎక్కువగా దేశీ రకం మిర్చి కారాన్ని వినియోగిస్తుండటం కూడా రేటు పెరిగేందుకు కారణమైంది. బుధవారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల(తులం) బంగారం ధర రూ.51,989 ఉంటే.. మరో రూ.11 అదనంగా దేశీ మిర్చి రేటు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా ధర రూ.52వేలు అత్యధికంగా పలకడం విశేషం. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఆల్లైమ్ రికార్డు అని మార్కెట్ అధికారులు చెబుతున్నా.. మిర్చి దిగుబడి తగ్గడమే ఈసారి రేట్లు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు.. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా తామర తెగులుతో వేలాది ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. దీంతో దిగుబడి తగ్గడంతో రైతులకు వచ్చిన పంటలో నాణ్యత ఉన్న మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతోంది. ఇదే కాస్త ఉపశమనంగా మారిందని ఇటు అధికారులు, అటు రైతులు చెబుతున్నారు. అయితే బుధవారం ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డుకు 30వేల బస్తాలు వస్తే.. ఇందులో దేశీ మిర్చి రకం 800 బస్తాల వరకు ఉంది. ఇందులో అత్యధిక నాణ్యత ఉన్న ములుగు జిల్లా ఎస్ నగర్‌కు చెందిన బలుగూరి రాజేశ్వర్‌రావు తెచ్చిన ఏడు బస్తాల మిర్చికి క్వింటాల్‌కు రూ.52వేల ధర పెట్టి ఖరీదుదారు లాలా ట్రేడింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక మిగిలిన రకాల మిర్చికి రూ.18వేల నుంచి రూ.35వేల వరకు ధర పలికింది. ఎందుకింత డిమాండ్ అంటే.. ‘దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం.. ఇప్పుడు సీజన్ కూడా కావడంతో ఉన్న కొద్దిపాటి పంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంత రేటు వచ్చినా ఇది రైతులకు కంటి తుడుపు చర్య మాదిరిగానే ఉంది. ఎందుకంటే.. వారు రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాకపోవడంతో ఉన్న కొంత సరుకుకు ఈ ధర వస్తోంది. పెట్టుబడి కూడా పూర్తిగా రావడం లేదని మార్కెట్‌కు వచ్చిన రైతులు వాపోతున్నారు. గతంలో దేశీ మిర్చి క్వింటా ధర రూ.28వేలు పలికింది. ఇప్పుడది రూ.52వేలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’ అని మార్కెట్ గ్రేడ్ కార్యదర్శి రాహుల్ ‘సాక్షి’కి తెలిపారు. రెండెకరాలు.. రెండు క్వింటాళ్లపైనే.. మాకున్న రెండెకరాల్లో ఏటా మిర్చి పంట సాగు చేస్తున్నా. అంతకుముందు ఎకరానికి 10 క్వింటాళ్లపైగా దిగుబడి వచ్చేది. ఈసారి ఎకరాకు కొంచెం ఎక్కువగా వచ్చింది. తామర తెగులుతో పంట దిగుబడి తగ్గింది. ఈసారి పెట్టుబడి రూ.5లక్షలు పెడితే.. కేవలం రూ.1,70,000 మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.3,30,000 వరకు నష్టపోయాం. ఇంత అత్యధిక ధర రూ.52వేలు వచ్చినా పెద్దగా మాకు వచ్చిన ప్రయోజనమేమీ లేదు. బలుగూరి రాజేశ్వర్‌రావు, మిర్చి రైతు, ఎస్ నగర్, ములుగు జిల్లా -
వరంగల్.. బెల్లం బజార్ !
సాక్షి, రామన్నపేట: సాధారణంగా బెల్లం కేజీ ధర రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఇదంతా ఒకే రీతిలో ఉన్నా హోల్‌సేల్ వ్యాపారానికి పేరు గాంచిన వరంగల్ బీట్‌బజార్‌లో మాత్రం ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పోతోంది. ఇక్కడి సిండికేట్ కారణంగా హోల్‌సేల్‌గానే బెల్లం ధర రూ.55 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి ఇది రూ.60కి చేరుతుండడం గమనార్హం. ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు వ్యాపారుల తీరు కారణంగా ఈ ధర ఒక్కో సారి ఇంత కంటే ఎక్కువగా పలికిన సందర్భాలు ఉన్నాయి. గుడుంబా ముడిసరుకులపై నిషేధం గుడుంబా తయారీ, అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో భాగంగానే గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక అమ్మకాలపై నియంత్రణ పెంచింది. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తేనే బెల్లం అమ్మాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్రమక్రమంగా బెల్లం వినియోగాన్ని గృహ అవసరాలకు పరిమితం చేయడానికి ఉపక్రమించింది. గుడుంబా బట్టీలకు బెల్లం చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ వెళ్లడంతో బెల్లం గృహావసరాలకే పరిమితమైంది. రంగంలోకి సిండికేట్ వ్యాపారులు బెల్లం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టింది. కొద్ది మంది వ్యక్తులే ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా బెల్లాన్ని గుడుంబావ్యాపారులకు చేరవేసేవారు. కొద్దిరోజుల్లోనే రైళ్ల ద్వారా కూడా బెల్లం రాకుండా అధికారులు నియంత్రించగలిగారు. ఇక్కడే సిండికేట్ రంగంలోకి దిగింది. గు డుంబా తయారీ తగ్గుముఖం పడుతున్న క్రమంలో సిండికేట్‌గా మారిన కొందరు వ్యాపారులు మళ్లీ బెల్లం అమ్మకాలకు తెర తీయడం ద్వారా ప్రభుత్వ స్పూర్తికి తూట్లు పొడిచారు. ఈ వ్యాపా రం వరంగల్ బీట్ బజార్ కేంద్రంగా కొనసాగుతుండడం.. ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వస్తుండడం గమనార్హం. రెట్టింపు ధర మార్కెట్లో సాధారణ ప్రజలకు బెల్లం అమ్ముతున్నామన్న నెపంతో విక్రయిస్తున్నా ఎక్కువ శాతం సరుకు మళ్లీ గుడుంబా బట్టీలకే చేరుతోంది. బెల్లం అమ్మకాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి చాటుమాటుగా ఎంతో రిస్క్ తీసుకుని మరీ బెల్లం తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు వరంగల్ మార్కెట్లో బెల్లం లభిస్తుండడంతో గుడుంబా తయారీ దారులు సిండికేట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా గు డుంబా అమ్మకం, తయారీదారుల నుంచి ఉన్న డి మాండ్‌ను ఆసరాగా చేసుకుని సిండికేట్ వ్యాపారులు ధరను రెట్టింపు చేసేశారు. కేజీ రూ.30 ఉండాల్సిన బెల్లాన్ని హోల్‌సెల్ మార్కెట్లోనే రూ.55కు పెంచారు. దీంతో గృహ అవసరాలు, శుభకార్యాలకు బెల్లం కావాల్సిన వారు ఇంత ధర వెచ్చించలేక సమస్యెదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ సిండికేట్ ఫలితంగా పల్లెల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం విధించిన నిషేధం నీరుగారుతున్నట్లవుతోంది. ధర తగ్గనివ్వరు.. పది మంది బెల్లం వ్యాపారులతో కలిసి ఏర్పడిన సిండికేట్ మార్కెట్లో బెల్లం ధర తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త వారెవెరూ బెల్లం అమ్మకుండా చూస్తున్నారు. సరుకు తెప్పించడం, వ్యాపారుల వారీగా విభజించడం, డబ్బు వసూలు చేయడం, అధికారులను మచ్చిక చేసుకోవడం ఇలా పనులను విభజించకున్న వ్యాపారులు ధర ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా ‘మామూలు’గా ఊరుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సిండికేట్‌ను కాదని బెల్లం అమ్మే వారి సమాచారం ఇచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిషేధం సజావుగా అమలు జరగాలన్నా... సామాన్యులకు గృహ అవసరాల కు బెల్లం అందుబాటులోకి రావాల్సిన అధికారులు కొరఢా ఝులిపించాల్సిన అవసరం ఉంది. -
అవార్డులు ఎవరి సొత్తు కాదు
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సందడి చేశారు. రైతుల సమస్యలపై నిర్మిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం ఆయన ఇక్కడికి వచ్చారు. మార్కెట్లోని రైతులు, గుమస్తాలు, హమాలీలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. షూటింగ్లో వారిని భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ఎంపిక సవ్యంగా లేదన్నారు. ఆధార్ కార్డు, నాన్ రెసిడెన్షియల్ అని ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడడం సరికాద న్నారు. తనకు వచ్చిన నంది అవార్డును కూడా స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దని సూచించారు. సాక్షి, వరంగల్ రూరల్: ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే అవార్డులు అందజేస్తున్నారు.. నంది అవార్డులు ఎవరి సొత్తు కాదు.. అని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. రుద్రమదేవికి అవార్డుఇవ్వకపోవడం దారుణం.. ఝూన్సీలక్ష్మీభాయి బ్రిటిష్ పాలకులపై ఏ విధంగా యుద్ధం చేసిందో తెలుగు జాతి మనుగడ ఐక్యత కోసం రాణి రుద్రమదేవి కృషి చేసింది. ఆ కథను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు ఇవ్వకపోవడం దారుణం. అవార్డుల విషయం పునరాలోచించాలి.. ఇది వరకు ఉత్తమ సినిమాలను ఎంపిక చేసే సమయంలో అవి సమాజం, సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా రోల్ ప్లే చేస్తున్నాయని పరిశీలించేవారు. ప్రస్తుతం ఏది బాగా సక్సస్ అయింది.. ఏది హిట్టు అయిందని చూస్తున్నారు. అవార్డుల విషయంలో పునరాలోచించాలి. అవార్డులు ఎవరి సొత్తు కాదు.. ప్రజలు పన్నులు కడుతున్నారు.. వాటితోనే ఇస్తున్నారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దు. నరేంద్ర మోదీపై వాఖ్యలు చేస్తే ముక్కు కోసేస్తారా.. తల తీసేస్తారా.. పద్మావతి సినిమా విడుదల కానేలేదు. ఎవరూ చూడలేదు.. డైరెక్టర్ మీద.. అందులో నటించిన దీపిక పడుకొనె తల మీద రూ.ఐదు కోట్లు ప్రకటిస్తారా.. ఇది ప్రజా స్వామ్యమా.. రైతులపై కేంద్ర సర్కారు పట్టింపేది.. పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత ఇలా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. జీఎస్టీ ప్రారంభం రోజున అర్ధరాత్రి సంబరాలు చేసుకున్నారే కాని రైతు ఆత్మహత్యలను అత్యవసర పరిస్థితిగా ప్రకటించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎందుకు చర్చించడం లేదు. ఆత్మహత్యలు ఆపాలంటే గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. సీసీఐ ప్రకటించిన కనీస మద్దతు ధర సైతం రైతుకు దక్కడం లేదు. పత్తికి తేమ ఎక్కువైందని, రంగు మారిందని సాకులు చెప్పి కొనడం లేదు. రైతులు తెచ్చిన పత్తిలో 10 శాతం సీసీఐ, 90 శాతం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మాయాజాలాన్ని నిలువరించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే డైరెక్ట్‌గా కొనుగోలు చేయాలి. రైతును దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని సినిమా ద్వారా కోరుతా. కేంద్రమే రుణ మాఫీ చేయాలి.. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసినట్లుగా భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయాలి. పారిశ్రమిక వేత్తలకు రుణాలు మాఫీ చేస్తారు.. మళ్లీ ఇస్తారు. అదే రైతులు ఏం పాపం చేశారు. ఫసల్ యోజన పథకంలో ఒక్కో రైతు దగ్గర కేంద్ర ప్రభుత్వం రూ. 3900 తీసుకుంటోంది. అతివృష్టి అనావృష్టి వచ్చి నష్టపోయినప్పుడు తీసుకున్న ప్రీమియం మొత్తం నష్టపరిహారం చెల్లించాలి. -
మిర్చి@ రూ. 17,500
వరంగల్ సిటీ: మిర్చికి ధర తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మంగళవారం వరంగల్ మార్కెట్లో సింగిల్ పట్టి రకం మిర్చికి రికార్డుస్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 17,500 ధర పలికింది. గతేడాది సింగిల్పట్టి రకం మిర్చికి అత్యధికంగా రూ. 16,500 ధర పలికింది. మంగళ వారం పరకాలకు చెందిన రవీందర్ మొదటిసారి 7 బస్తాల నాణ్యమైన సింగిల్ పట్టి రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. దేశీ రకం మిర్చి కూడా మొదటిసారి క్వింటాల్‌కు రూ.14,500, 13,500 ధర పలికింది. ఇదే దేశీ రకం మిర్చికి గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18,001 రికార్డు ధర పలికింది. -
ఎట్టకేలకు ప్రారంభమైన పెసళ్ల కొనుగోళ్లు
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు శుక్రవారం మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి పర్యవేక్షణలో పెసళ్ల కొనుగోళ్లను చేపట్టారు. గురువారం నుంచే పెసళ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా, కారణంగా లేకుండా కొనుగోళ్లను వాయిదా వేశారు. దీంతో సాక్షి దినపత్రిక ‘పెసరఽ రైతులకు నిరాశ’ అనే కథనాన్ని శుక్రవారం ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం కొనుగోళ్లను చేపట్టారు. కాగా గురువారం పెసళ్లను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,900తో కొనుగోలు చేయగా, శుక్రవారం మార్క్‌ఫెడ్, నాఫెడ్ అధికారులు సంయుక్తంగా క్వింటాల్‌కు రూ.5,326తో కొనుగోలు చేశారు. ఒక్కరోజు తేడాలో క్వింటాల్‌కు రూ.400కు పైగా అదనపు డబ్బులు సమకూరడంతో పెసరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు 365 పెసరు బస్తాలు అమ్మకానికి రాగా, దాదాపు 330 బస్తాల పెసళ్లను అధికారులే కొనుగోలు చేశారు. మొదటి రోజు కొనుగోళ్లలో రవీందర్‌రెడ్డి, ఉసెన్తో పాటు గ్రేడ్-2 కార్యదర్శి జగన్మోహన్, సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, వేణు పాల్గొన్నారు. -
నిండుగా.. దండిగా
మార్కెట్‌ను ముంచెత్తిన మిర్చి 25వేల పైచిలుకు బస్తాల రాకా వ్యాపారుల సిండికేటు, పడిపోయిన ధర శివరాత్రికి ముందు మూడు రోజులు బంద్.. శనివారం నుంచి మళ్లీ మూడు దినాలు వరంగల్ మార్కెట్‌కు సెలవు కావడంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 25 వేలకు పైగా బస్తాలను రైతులు తీసుకురావడంతో యార్డులన్నీ ఎర్రబంగారమయ్యూరుు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. శుక్రవారం పెద్ద ఎత్తున మిర్చి ముంచెత్తింది. ఈ సీజన్లో తొలిసారిగా అన్ని రకాల మిర్చి కలిపి దాదాపుగా 25 వేల బస్తాలు వచ్చారుు. మార్కెట్‌కు సెలవుల తర్వాత మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులున్నాయనే సమాచారంతో రైతులు త్వరపడ్డారు. దీంతో వ్యాపారులు సిండికేటై ధరను ఒక్కసారిగా త గ్గించారు. నాలుగు రోజుల కిందట తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.8వేలు పై చిలుకు పలికింది. వండర్ హాట్, దీపిక, యూఎస్-341 రకాలకు రూ.10వేల ధర పలికింది. శుక్రవారం వీటిలో సగానికి ధర తగ్గించేశారు. అధికారులు, యూర్డు ఇన్చార్జి కల్పించుకోకపోవడంతో.. అడ్తిదారుల మాటలు న మ్మి ఎంతోకొంతకు అమ్ముకున్నారు కొందరు రైతులు. పూర్తిస్థాయి మిర్చి సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉండడం రైతులను కలవరపెడుతోంది. మార్కెట్ అధికారులు, యార్డు ఇన్చార్జిలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప మిర్చి ధర పెరిగే అవకాశాల్లేవు. ఇదే జరిగితే రైతులు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు మిర్చి తరలించే అవకాశం ఉంది. - వరంగల్‌సిటీ -
‘మద్దతు’ గగనమే..
జమ్మికుంట మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు ముహూర్తం కుదిరింది. నేటినుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ నెల నుంచే పత్తి మార్కెట్ సీజన్ ప్రారంభమైంది. దసరా పండగ ముందు కొత్త పత్తి మార్కెట్‌ను ముంచెత్తింది. కానీ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదు. అనేక కొర్రీలు పెడుతూ అరకొరగా కొనుగోళ్లు జరపినా.. మద్దతు ధర లభించక రైతులు నష్టపోయారు. తర్వాత ఈ నెల 9నుంచి 22వరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. దీంతో పత్తిని ఏరిన రైతులు దానిని అమ్ముకోలేక ఇంట్లోనే నిల్వ ఉంచారు. కొందరు రైతులు విధిలేక వరంగల్ మార్కెట్లో అమ్ముకున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు ఆదిలోనే ఇబ్బందులుపడ్డ రైతులు బుధవారం నుంచి పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే వ్యాపారులు కుమ్మక్కై రైతుల శ్రమను దోచుకుంటారా? మద్దతు ధర చెల్లించి అన్నదాతలను ఆదుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మికుంట, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణలో వరంగల్ తర్వాత జమ్మికుంట మార్కెట్లో పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతుంది. అయితే ప్రతిసారీ ఇక్కడ వ్యాపారులదే హవా నడుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి జమ్మికుంట మార్కెట్‌కు ప్రతిరోజు వెయ్యి మందికి పైగా రైతులు తాము పండించిన పత్తిని అమ్మకానికి తీసుకొస్తుంటారు. రోజుకు 5వేల క్వింటాళ్ల నుంచి 20వేల క్వింటాళ్ల వరకు సీజన్ అరంభంలో మార్కెట్‌కు వస్తుంది. ధరలు అధికంగా పలికితే 50వేల బస్తాల నుంచి 70వేల బస్తాల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొస్తుంటారు. ఇదే అదనుగా సీసీఐ రంగంలోకి దిగకుండా వ్యాపారులు తెలివిగా ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతుంటారు. వేలాది బస్తాల్లో నామమాత్రంగా మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తారు. మిగతా పత్తికి నాణ్యత లేదనే సాకుతో మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి రైతులను దగా చేస్తుంటారు. వ్యాపారులు మద్దతు ధరకన్నా ఎక్కువే చెల్లిస్తున్నారని సీసీఐ అటువైపు తొంగిచూడదు. సీసీఐ అధికారులు సైతం వ్యాపారులతో కుమ్మక్కై రైతులను నట్టేట ముంచిన సంఘటనలు గతంలో ఉన్నాయి. గత సీజన్ ఆరంభంలో పత్తికి డి మాండ్ లేదనే కారణంతో వ్యాపారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. దీంతో సీసీఐ రైతుల నుంచి 1,28,297 క్వింటాళ్ల పత్తిని సేకరించింది. క్వింటాల్‌కు రూ.3611-3722-3896 ధరలతో కొనుగోలు చేపట్టి రూ.49.88 కోట్ల వ్యాపారం చేసింది. తర్వాత పత్తికి డిమాండ్ రావడంతో వ్యాపారులు రంగంలోకి దిగి 2,11,280 క్వింటాళ్ల పత్తిని కొని సీసీఐ కంటే రూ.52 కోట్లు అదనంగా వ్యాపారం చేశారు. అయితే మద్దతు ధర పేరుతో కొనుగోళ్లు చేపట్టిన సీసీఐ నాణ్యత సాకుతో క్వింటాల్‌కు రూ.300 చొప్పున కోత విధించింది. క్వింటాల్‌కు రూ.3900 ధర పెట్టాల్సి ఉండగా ఎక్కువ శాతం రైతులకు గరిష్టంగా రూ.3600 చెల్లించింది. ఈ తతంగమంతా దళారుల కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈసారైనా న్యాయం జరిగేనా? గత మార్కెట్ సీజన్లో జమ్మికుంట మార్కెట్లో సీసీఐ, వ్యాపారులు కలిసి 3.39 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. ఈ సీజన్లో 5లక్షల క్వింటాళ్ల వరకు పత్తి విక్రయాలు జరిగే ఆవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4వేలు ప్రకటించింది. ప్రస్తుతం సీసీఐ రంగప్రవేశం చేయకపోవడం, వ్యాపారులే కొనుగోళ్లు చేస్తుండడంతో ధరలు ఎలా చెల్లిస్తారోనని రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 3, 9 తేదీల్లో మార్కెట్‌కు రోజుకు 5వేల బస్తాల పత్తి వచ్చింది. వ్యాపారులు మిల్లుల మరమ్మతుల పేరుతో కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొందరు వ్యాపారులు పత్తిని కొనేందుకు ముందుకు వచ్చినప్పటికీ తేమశాతం అధికంగా ఉందంటూ మద్దతు ధరకు మంగళం పాడారు. తేమ పరికరాలు లేకుండానే చేతులతో తడిమి చూస్తూ నాణ్యతను నిర్ధారిస్తూ రైతులను దోపిడీ చేశారు. దీంతో రైతులకు క్వింటాల్‌కు రూ.3500-3850 వరకు ధరలు చెల్లించారు. కొంతమందికి రూ.2500 మాత్రమే చెల్లించినట్లు రైతులు ఆరోపించారు. తేమ పరికరాలతో నాణ్యతను పరిశీలించాల్సి ఉండగా చేతితోనే నిర్ధారించడం పరిపాటిగా మారింది. సీసీఐ మాత్రమే తేమ పరికరాలను ఉపయోగిస్తోంది. మార్కెట్లో గ్రేడింగ్ ల్యాబ్ ఉన్న రైతులకు ఉపయోగం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీసీఐ కమర్షియల్ కొనుగోళ్లు చేస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ సంస్థ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం రైతులను కలవరపెడుతోంది. గన్నీ సంచుల డబ్బులు స్వాహా.. సీసీఐ రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి బస్తాలకు డబ్బులు చెల్లించలేకపోయింది. ఒక్కో గన్నీ సంచికి ప్రభుత్వ ధర ప్రకారం రూ.25 రైతులకు చెల్లించాలి, లేదా సంచులైనా తిరిగివ్వాలి. ఈ రెండింటిలో సీసీఐ ఏ ఒక్కటీ చేయలేదు. డబ్బుల కోసం తిరిగి వేసారిన రైతులు చివరకు ఆశలు వదులుకున్నారు. చివరకు సీసీఐ ఖాతాలోనే గన్నీ సంచుల డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్క జమ్మికుంట మార్కెట్లోనే సుమారు రూ.70 లక్షలు మింగగా, జిల్లావ్యాప్తంగా రూ.కోటికిపైనే స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. సీసీఐ గత సీజన్లో జిల్లాలోని 12 మార్కెట్లలో 14.97 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
పత్తిని సీసీఐ అధికారులే కొనాలి
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : పత్తి కొనుగోలు చేసిన రోజే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్తాల చందర్రావు సీసీఐ అధికారులను కోరారు. సంఘం ఆధ్వర్యం లో గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా పత్తి కొను గోలు చేయాలని ముంబైలో సీసీఐ సీఎండీ, కేంద్ర జౌళిశాఖ మం త్రికి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. తేమ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు.. మద్దతు ధరతో పత్తిని నేరుగా కొనుగోలు చేసి రైతులకు గన్నీ సంచుల డబ్బులతో సహా చెల్లించాలని కోరారు. కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు), ఖరీదుదారులు, జిన్నింగ్ మిల్లు యజమానుల ప్రమేయం లేకుండా చూడాలని సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయించాలని, తూకం, చిట్టాబుక్, తక్‌పట్టీల ద్వారా చెల్లింపులను రైతులకు తెలియజేయాలన్నారు. అవసరమైతే రైతులకు డబ్బులను అకౌంట్ పేమెంట్ ద్వారా చెల్లించాలని సూచించారు. సీజన్లో రోజుకు సుమారు లక్ష బస్తాల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొస్తారని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. పత్తి బస్తాలను ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి మీదనే తూకం వేయించాలని, ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 15 శాతం కమీషన్లు.. రైతులకు అడ్తిదారులు డబ్బులు అదేరోజు అందజేయాలని, రూ.2 కంటే కమీషన్ మించకుండా చూడాలని ఆయన సూచించారు. వరంగల్ మార్కెట్లో అడ్తిదారులు రూ.3 నుంచి రూ.6 వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకం పేరుతో మరో 4 శాతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఖాళీ బస్తాలు, హమాలీ, గుమస్తా, దడువాయి, ఇతర ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకుని క్వింటాలుకు రూ.15 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని వివరించారు. కమీషన్ల పేరుతో రైతులు మార్కెట్లో రోజుకు 7 నుంచి 8 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని వెల్లడించారు. రైతు సంఘం ప్రతినిధు లు వారం రోజులకోసారి మార్కెట్‌ను సందర్శించి కొనుగోళ్లలో జరిగే లోపాలు, అక్రమాలను బయటపెడతారని ఆయన అడ్తి వ్యాపారులను హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రతిని ధులు ఎం.వాసుదేవరెడ్డి, ఎస్.రోశయ్య, ఓదెల రాజయ్య, జె.జనార్దన్‌రెడ్డి, కత్తి సుధాకర్ పాల్గొన్నారు.