‘మద్దతు’ గగనమే.. | market is large-scale business | Sakshi
Sakshi News home page

‘మద్దతు’ గగనమే..

Published Wed, Oct 23 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

market is large-scale business

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లకు ముహూర్తం కుదిరింది. నేటినుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ నెల నుంచే పత్తి మార్కెట్ సీజన్ ప్రారంభమైంది. దసరా పండగ ముందు కొత్త పత్తి మార్కెట్‌ను ముంచెత్తింది. కానీ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదు. అనేక కొర్రీలు పెడుతూ అరకొరగా కొనుగోళ్లు జరపినా.. మద్దతు ధర లభించక రైతులు నష్టపోయారు. తర్వాత ఈ నెల 9నుంచి 22వరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు.
 
 దీంతో పత్తిని ఏరిన రైతులు దానిని అమ్ముకోలేక ఇంట్లోనే నిల్వ ఉంచారు. కొందరు రైతులు విధిలేక వరంగల్ మార్కెట్‌లో అమ్ముకున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు ఆదిలోనే ఇబ్బందులుపడ్డ రైతులు బుధవారం నుంచి పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే వ్యాపారులు కుమ్మక్కై రైతుల శ్రమను దోచుకుంటారా? మద్దతు ధర చెల్లించి అన్నదాతలను ఆదుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 జమ్మికుంట, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణలో వరంగల్ తర్వాత జమ్మికుంట మార్కెట్‌లో పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతుంది. అయితే ప్రతిసారీ ఇక్కడ వ్యాపారులదే హవా నడుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి జమ్మికుంట మార్కెట్‌కు ప్రతిరోజు వెయ్యి మందికి పైగా రైతులు తాము పండించిన పత్తిని అమ్మకానికి తీసుకొస్తుంటారు. రోజుకు 5వేల క్వింటాళ్ల నుంచి 20వేల క్వింటాళ్ల వరకు సీజన్ అరంభంలో మార్కెట్‌కు వస్తుంది. ధరలు అధికంగా పలికితే 50వేల బస్తాల నుంచి 70వేల బస్తాల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొస్తుంటారు. ఇదే అదనుగా సీసీఐ రంగంలోకి దిగకుండా వ్యాపారులు తెలివిగా ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతుంటారు.
 

 వేలాది బస్తాల్లో నామమాత్రంగా మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తారు. మిగతా పత్తికి నాణ్యత లేదనే సాకుతో మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి రైతులను దగా చేస్తుంటారు. వ్యాపారులు మద్దతు ధరకన్నా ఎక్కువే చెల్లిస్తున్నారని సీసీఐ అటువైపు తొంగిచూడదు. సీసీఐ అధికారులు సైతం వ్యాపారులతో కుమ్మక్కై రైతులను నట్టేట ముంచిన సంఘటనలు గతంలో ఉన్నాయి. గత సీజన్ ఆరంభంలో పత్తికి డి మాండ్ లేదనే కారణంతో వ్యాపారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు.

దీంతో సీసీఐ రైతుల నుంచి 1,28,297 క్వింటాళ్ల పత్తిని సేకరించింది. క్వింటాల్‌కు రూ.3611-3722-3896 ధరలతో కొనుగోలు చేపట్టి రూ.49.88 కోట్ల వ్యాపారం చేసింది. తర్వాత పత్తికి డిమాండ్ రావడంతో వ్యాపారులు రంగంలోకి దిగి 2,11,280 క్వింటాళ్ల పత్తిని కొని సీసీఐ కంటే రూ.52 కోట్లు అదనంగా వ్యాపారం చేశారు. అయితే మద్దతు ధర పేరుతో కొనుగోళ్లు చేపట్టిన సీసీఐ నాణ్యత సాకుతో క్వింటాల్‌కు రూ.300 చొప్పున కోత విధించింది. క్వింటాల్‌కు రూ.3900 ధర పెట్టాల్సి ఉండగా ఎక్కువ శాతం రైతులకు గరిష్టంగా రూ.3600 చెల్లించింది. ఈ తతంగమంతా దళారుల కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి.
 
 ఈసారైనా న్యాయం జరిగేనా?
 గత మార్కెట్ సీజన్‌లో జమ్మికుంట మార్కెట్లో సీసీఐ, వ్యాపారులు కలిసి 3.39 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. ఈ సీజన్‌లో 5లక్షల క్వింటాళ్ల వరకు పత్తి విక్రయాలు జరిగే ఆవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4వేలు ప్రకటించింది. ప్రస్తుతం సీసీఐ రంగప్రవేశం చేయకపోవడం,  వ్యాపారులే కొనుగోళ్లు చేస్తుండడంతో ధరలు ఎలా చెల్లిస్తారోనని రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 3, 9 తేదీల్లో మార్కెట్‌కు రోజుకు 5వేల బస్తాల పత్తి వచ్చింది. వ్యాపారులు మిల్లుల మరమ్మతుల పేరుతో కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.
 
  దీంతో కొందరు వ్యాపారులు పత్తిని కొనేందుకు ముందుకు వచ్చినప్పటికీ తేమశాతం అధికంగా ఉందంటూ మద్దతు ధరకు మంగళం పాడారు. తేమ పరికరాలు లేకుండానే చేతులతో తడిమి చూస్తూ నాణ్యతను నిర్ధారిస్తూ రైతులను దోపిడీ చేశారు. దీంతో రైతులకు క్వింటాల్‌కు రూ.3500-3850 వరకు ధరలు చెల్లించారు. కొంతమందికి రూ.2500 మాత్రమే చెల్లించినట్లు రైతులు ఆరోపించారు. తేమ పరికరాలతో నాణ్యతను పరిశీలించాల్సి ఉండగా చేతితోనే నిర్ధారించడం పరిపాటిగా మారింది. సీసీఐ మాత్రమే తేమ పరికరాలను ఉపయోగిస్తోంది. మార్కెట్‌లో గ్రేడింగ్ ల్యాబ్ ఉన్న రైతులకు ఉపయోగం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీసీఐ కమర్షియల్ కొనుగోళ్లు చేస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ సంస్థ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం రైతులను కలవరపెడుతోంది.
 
 గన్నీ సంచుల డబ్బులు స్వాహా..
 సీసీఐ రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి బస్తాలకు డబ్బులు చెల్లించలేకపోయింది. ఒక్కో గన్నీ సంచికి ప్రభుత్వ ధర ప్రకారం రూ.25 రైతులకు చెల్లించాలి, లేదా సంచులైనా తిరిగివ్వాలి. ఈ రెండింటిలో సీసీఐ ఏ ఒక్కటీ చేయలేదు. డబ్బుల కోసం తిరిగి వేసారిన రైతులు చివరకు ఆశలు వదులుకున్నారు. చివరకు సీసీఐ ఖాతాలోనే గన్నీ సంచుల డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్క జమ్మికుంట మార్కెట్‌లోనే సుమారు రూ.70 లక్షలు మింగగా, జిల్లావ్యాప్తంగా రూ.కోటికిపైనే స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. సీసీఐ గత సీజన్‌లో జిల్లాలోని 12 మార్కెట్లలో 14.97 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement