నిర్దిష్ట సమయంలోనే పత్తి టెండర్లు | Cotton tenders for a specific period of time | Sakshi
Sakshi News home page

నిర్దిష్ట సమయంలోనే పత్తి టెండర్లు

Published Thu, Oct 24 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Cotton tenders for a specific period of time

ఆదోని, న్యూస్‌లైన్: మార్కెట్‌యార్డులో పరిస్థితిని చక్కదిద్దే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి మూడు రోజుల క్రితం దాదాపు 60వేల క్వింటాళ్ల పత్తి దిగుబడులు తరలిరావడం, తుపాను కారణంగా భారీ వర్షాలతో యార్డులో వ్యాపారాలు స్తంబించడం తెలిసిందే. ముఖ్యంగా పత్తి దిగుబడులు తడిసిపోయి రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.
 
 అమ్మకాకూ నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు బుధవారం కార్యదర్శి చాంబర్‌లో యార్డు కమిటీ అధ్యక్షుడు దేవిశెట్టి ప్రకాష్, మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, గ్రేడ్-2 కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీఈ సుబ్బారెడ్డి, సూపర్‌వజర్లు, పత్తి వ్యాపారుల సంఘం నాయకులు, ఏజెంట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పలువురు కమిషన్ ఏజెంట్లతో విడివిడిగా దాదాపు మూడు గంటల పాటు చర్చలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి వ్యాపారం సజావుగా సాగేందుకు సలహాలు, సూచనలను వారి నుంచి స్వీకరించారు.
 
 ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ కాటన్ యార్డును పాత గోదాముల ప్లాట్‌ఫాం వరకు విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యార్డు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ముళ్ల కంపలు తొలగించడంతో పాటు లైట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. తూకాల తర్వాత పత్తి డోక్రాలను తరలించేందుకు ప్లాట్‌ఫాం మద్యలో కనీసం 20 అడుగుల ఖాళీ స్థలం ఉండేలా డోక్రాల నిల్వలను క్రమబద్ధీకరించాలన్నారు. ఫ్లాట్‌ఫాంకు సరైన వెలుతురు సదుపాయం కోసం మరిన్ని లైట్లు ఏర్పాటు చేయాలని, నిర్దిష్టమైన సమయంలోనే పత్తి టెండర్లు నిర్వహించాలన్నారు. యార్డు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. జేసీ వెంట ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
 
 మరో 30వేల క్వింటాళ్ల పత్తి ఆరు బయటే
 యార్డులో మూడో రోజు బుధవారం కూడా పత్తి డోక్రాలను వ్యాపారులు తమ గోదాములకు తరలించుకోలేక పోయారు. మరో 30వేల క్వింటాళ్ల వరకు యార్డులోనే నిలిచిపోయింది. డోక్రాలు వర్షంలో మరింత తడిసిపోయి నాణ్యత బాగా దెబ్బతినడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. యార్డులో దాదాపు 250 వరకు పత్తి తరలించే ఎడ్ల బండ్లు ఉన్నాయి. హమాలీలు ఒక్కో బండితో నాలుగు విడతలుగా డోక్రాలను వ్యాపారుల గోదాములకు తరలించినా మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వర్షం తెరిపివ్వకపోతే తరలింపు మరింత జాజ్యం కానుంది.
 
 ఈ పరిస్థితుల్లో శుక్రవారం నుంచి టెండర్లు తిరిగి ప్రారంబించే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. యార్డులో టార్పాలిన్లు లేకపోవడంతో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి తడిసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదిలాఉండగా ఒకటి రెండు రోజుల్లో మరో 200 టార్పాలిన్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని యార్డు గ్రేడ్-2 కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement