న్యూస్‌లైన్ బృందం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పాలమూరును ముసురు వర్షం ముం చెత్తింది. మూలిగేనక్కపై తాటికాయపడ్డ చందం గా ఇప్పటికే అప్పులబాధతో కొట్టుమిట్టాడుతు న్న అన్నదాతను వరుణుడు దెబ్బతీశాడు. గత రెండురోజులుగా కరుస్తున్న వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. చేతికొచ్చిన మొక్కజొన్న మార్కెట్‌యార్డుల్లో తడిసిముద్దయింది. ఇప్పటికే తెల్లబంగారం నల్లబారి అన్నదాతకు ఆవేదన మిగి ల్చింది.
ఆముదం పంటకు తెగుళ్లు సోకడంతో చేతికి రాకుండాపోయింది. జిల్లాలోని జడ్చర్ల, నవాబ్‌పేట, వనపర్తి, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట తదితర వ్యవసాయ మార్కెట్లలో వేలకొద్దీ బస్తాల మొక్కజొన్న వర్షార్పణమైంది. దేవరకద్ర మండలంలో 9వేల ఎకరాల్లో ఆముదం పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. జడ్చర్ల మార్కెట్‌లో విక్రయానికి తెచ్చిన ఆరువందల బస్తాల మొక్కజొ న్న తడిసిపోయింది. బుధవారం విక్రయాలు జ రగకపోవడంతో సరుకును అక్కడే ఉంచిన రైతు లు వర్షానికి తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. తేమ సాకుతో వ్యాపారులు కొనుగో ళ్లు జరపకపోవడంతో రైతులు అచ్చంపేట మా ర్కెట్‌యార్డు ఆవరణలో ఎండబెట్టుకున్న పంట తడిసిపోయింది.
దీంతో మొక్కజొన్న రాసుల ను కవర్లతో కప్పి కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. నవాబ్‌పేట మర్కెట్ లో నాలుగువేల బస్తాల మొక్కజొన్న పనికిరాకుండా పోయింది. ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చిన తరుణంలోనే కొనుగోలు చేసి ఉంటే ఎలాగోలా బ యటపడేవారమని, తాజాగా మార్కెట్‌లో ధర కోసం వేచి ఉంటే రెక్కలకష్టం నీటి పాల య్యిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తడిసి ధాన్యాన్ని కొనుగోలుచేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో సుమారు మూడువేల బ్యాగుల మొక్కజొన్న తడిసిముద్దయింది. వ్యాపారులు, హమాలీల మధ్య తలెత్తిన వివాదం కారణంగా గతవారం రోజులుగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగడం లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కూడా కొనుగోలు చేయడం లేదు. తీరా రైతుల కష్టం వర్షానికి కొట్టుకుపోయింది.
నేలకొరిగిన వరిపైరు
రెండురోజలుగా కురుస్తున్న ముసురువర్షానికి మిడ్జిల్ మండలంలో రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. తాడూరు మండలంలో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. పెద్దమందడి మండలంలో దొడగుంటపల్లి, చిన్నమందడి, అల్వాల, మోజర్ల, తదితర గ్రామాల్లో సుమారు రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. గోపాలపేట మండలంలో సోనామసూరి పంట నేలకొరిగి నష్టంవాటిల్లింది. ముసురువర్షాలకు కోడేరు మండలంలోని ఆరు ఇళ్లు కూలిపోయాయి.
తెగిన చంద్రవాగు వంతెన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షానికి మండలంలోని చంద్రవాగు వద్ద వేసిన తాత్కాలిక వంతెన బుధవారం మరోసారి తెగిపోయింది. బొల్గట్‌పల్లి స్టేజీ సమీపంలో మహబూబ్‌నగర్- శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద పూర్తిస్థాయి వంతెన నిర్మాణం పనులు జరుగుతుండడంతో కాంట్రాక్టర్ పక్కనే తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టాడు.
గతంలో కూడా రెండుసార్లు ఈ వంతెన భారీ వర్షాలకు తెగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముసురు వర్షం కురుస్తుండటంతో చంద్రవాగు నుంచి వరదనీటి ఉధృతికి తట్టుకోలేక మూడోసారి వంతెన తెగిపోయింది. దీంతో మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను హాజీపూర్ మీదుగా దారి మళ్లించారు. తెగిపోయిన వంతెనను అచ్చంపేట తహసీల్దార్ జ్యోతి, ఎస్‌ఐ రామలింగారెడ్డిలు పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా త్వరలో రాకపోకల పునరుద్ధరిస్తామని ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్ తెలిపారు.
ముంచిన ముసురు
Published Thu, Oct 24 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement