marketyard
-
మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరికోతలు ఊపందుకుంటున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. పలు జిల్లాల్లో వరికోతలు మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు 1,150 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్ వంటి పలుజిల్లాల్లోనే ఈ సెంటర్లను ప్రారంభించారు. ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ధాన్యాన్ని సెంటర్లకు తీసుకువస్తున్నా.. కొనుగోళ్లు లేక రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ఆరబెడుతూ.. ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేసే పరిస్థితి ఉండటంతో రైతులు కొన్నేళ్లుగా.. వరి కోతలు కాగానే ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. అయితే అధికారులు గత యాసంగి నుంచి కోసిన పంటను సొంత కల్లాల్లో ఆరబెట్టుకుని, ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు. సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో.. కొందరు రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంది పొలాల్లో తాత్కాలిక కల్లాలను ఏర్పాటు చేసుకొని ధాన్యం ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చినా.. కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి మాత్రం మారలేదు. ఈ యాసంగిలోనైనా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7,029 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.20 కోట్ల టన్నులకుపైగా వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సొంత అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా కోటి టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,028 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఇంకా కోతలు మొదలవకపోవడం, కోతలు జరుగుతున్న నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొందరు రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తుండటంతో.. ఇప్పటికిప్పుడే కొనుగోలు కేంద్రాల అవసరం లేదని భావిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని అంటున్నారు. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం ఇది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 868 మంది రైతులు 45,253 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాల్ ధాన్యానికి రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ధర చెల్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. – సూర్యాపేట సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాశులు ఇవి. శుక్రవారం ఒక్కరోజే 29,300 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. – తిరుమలగిరి (తుంగతుర్తి) ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం కరీంనగర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మంత్రి శుక్రవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 90 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచామన్నారు. -
నేటి నుంచి మార్కెట్ యార్డుల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు మిర్చి యార్డు మినహా రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌యార్డులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడంతో కొన్ని రకాల నిత్యవసర వస్తువుల కొరత ఏర్పడే పరిస్థితులొచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌యార్డులను ప్రారంభించి వాటిని ధరలను నియంత్రించాలని అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలని సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ► రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కందిపప్పు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కందికీ కొరత వచ్చే అవకాశం ఉండటంతో కందుల కొనుగోలుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ► రాయలసీమ జిల్లాల్లో కందులు, పప్పుశనగ నిల్వలు అధికంగా ఉన్నాయని, మార్కెట్‌యార్డులను ప్రారంభించిన వెంటనే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ► మార్కెట్‌యార్డుల్లో రైతులు, హమాలీలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ► మిర్చి యార్డులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ఉన్నతస్థాయి సమావేశం జరిగాక వీటి ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రద్యుమ్న వెల్లడించారు. -
కరోనా సాకుతో రైతుల్ని మోసం చేయద్దు
-
రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు
సాక్షి, అమరావతి: రైతుల బాగోగులు చేసుకోవడంలో ఎమ్మెల్యేలకు నేరుగా అవకాశం కల్పించేందుకు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కల్పించడంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకునేందుకు వీలుగా మార్కెటింగ్ శాఖలో సవరణ బిల్లును తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించడంలో కీలకమైన మార్కెటింగ్ శాఖ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ సవరణలో భాగంగా మార్కెట్ యార్డులకు ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నామని తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా లేదా అన్నది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సులభంగా తెలుస్తుందని, ఒకవేళ తమకు గిట్టుబాటు ధర రాకపోతే.. రైతులు మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేస్తారని, వారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకువస్తే.. ఆ విషయాన్ని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా, వివిధ వర్గాల ద్వారా తెలుసుకొని.. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోతే.. ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, రూ. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, ఆ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ ప్రగతి కోసమే రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతి కోసమే మార్కెటింగ్ శాఖలో సవరణ బిల్లును తీసుకువస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. రైతులను ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్లేందుకు, దళారి వ్యవస్థను రూపుమాపడానికి ఈ బిల్లును తెచ్చామన్నారు. రూ. రెండువేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులకు భరోసా లభించిందని, ధరల స్థిరీకరణ కోసం రూ. మూడువేల కోట్లు కేటాయించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించనున్నాయని తెలిపారు. -
నంద్యాల మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జి నియామకం
- ఆరు నెలలుగా ఏర్పాటు కాని పాలకవర్గం - రాజకీయ విభేదాలే ఇందుకు కారణం - ప్రభుత్వ నిర్ణయంతో భూమా, శిల్పాకు చుక్కెదురు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కీలకంగా ఉన్న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎట్టకేలకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జిగా మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్‌ను నియమించింది. రెండేళ్ల క్రితం నంద్యాల మార్కెట్ కమిటీకి సిద్ధం శివరామ్ నేతృత్వంలో పాలకవర్గం ఏర్పాటైంది. ఏడాది క్రితం పూర్తయిన పదవీ కాలాన్ని ఆర్నెళ్లపాటు పొడిగించారు. పొడిగింపు కూడా ఐదు నెలల క్రితమే పూర్తయింది. తర్వాత ఇప్పటివరకు పొడిగించలేదు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మధ్య విభేదాల కారణంగా పాలక వర్గం పొడిగింపు మరుగున పడిపోయింది. ఇటీవల పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న సిద్ధం.. శిల్పా అనుచరుడు కావడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అడ్డుకున్నట్లు సమాచారం. దీనివల్ల పాలకవర్గం పొడిగింపునకు నోచుకోలేదు. పాలకవర్గం లేకపోవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బిల్లులతోపాటు ఇతర ల్లులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దించి పర్సన్ ఇన్చార్జిగా సుధాకర్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువర్గాలకు షాక్... మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించుకోవడంలో తమదే పైచేయిగా ఉండాలని భావించిన శిల్పా, భూమా వర్గాలకు షాక్ తగిలినట్లయింది. మొన్నటి వరకు సిద్ధం శివరాం నేతృత్వంలోని పాలకవర్గాన్ని పొడిగించాలని శిల్పా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ వచ్చారు. తాను చెప్పిన వారికే చైర్మన్‌గిరి ఇవ్వాలని భూమా పట్టుబట్టారు. ఈ క్రమంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం సంక్లిష్టం కావడంతో ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జిని నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ చర్య ఇరువర్గాలకు విస్మయాన్ని కల్గించింది. -
నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి
అనంతపురం అర్బన్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు కానుక కింద అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెనక్కి పంపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. స్థానిక మార్కెట్ యార్డులోని పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. క్రిస్మస్ కానుక సరకుల నాణ్యతను పరిశీలించారు. పాడైనట్లు గుర్తించిన సరుకుని డీలర్లకు పంపించవద్దని ఆదేశించారు. -
మోడల్ మార్కెట్‌గా ఆదోని
- మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జున రావు ఆదోని: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు. బుధవారం ఆయన మార్కెట్ యార్డును పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రైతులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి, ఇతర మార్కెట్లలో ధరలు తెలుసుకునేందుకు..ఆరు డిస్ప్లే బోర్డులు, తాగునీటి సౌలభ్యం కోసం ఆరు ఆర్ఓ ప్లాంట్లు, సబ్సిడీ భోజనం మెస్, టాయిలెట్లు , సీసీ కెమెరాలుడిసెంబర్ లోపు ఏర్పాటు చేస్తామని వివరించారు. యార్డుల్లో పదిశాతం పేమెంట్లు మాత్రం నగదు రూపంలో నిర్వహించి మిగిలిన మొత్తానికి చెక్కులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 320 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో 50 యార్డులలో పేమెంట్ సమస్య ఎదురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చిల్లరనోట్ల కొరత కారణంగా నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలో మరో 20 రైతు బజార్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2014–15లో సీసీఐ ద్వారా పత్తికొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వారిలో 92 మంది మార్కెటింగ్ శాఖకు చెందిన వారిగా గుర్తించి ఆర్టికల్ ఆఫ్ చార్జ్‌మెమో జారీ చేçశామని చెప్పారు. దోషులుగా తేలితే అక్రమాలకు సంబంధించిన మొత్తంను రికవరీ చేయడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఏడీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఆదిశేషులు, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, డైరెక్టర్లు రంగస్వామి, యువరాజ్ పాల్గొన్నారు. -
నిర్వహణ ఇంత అధ్వానమా?
- అదోని మార్కెట్‌యార్డ్ అధికారులపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ ఆగ్రహం ఆదోని: స్థానిక మార్కెట్ యార్డు నిర్వహణ తీరుపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనరు మల్లికార్జున రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు రెండు గంటల పాటు యార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. యార్డులో స్టేట్ బ్యాంకు భవనం అభివృద్ది కోసం అధికారులు దాదాపు రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ మేరకు అభివృద్ధి కనిపించలేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనశాలలో కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయకుండా నారరాతి బండలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. రైతు విశ్రాంతి భవనం తాళాలు తన వద్ద లేవని చెప్పిన ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రామారావుపై కమిషనర్‌మండిపడ్డారు. రైతు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను పరిశీలించి..పనివేళలు, క్లినిక్ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. యార్డులో పత్తి దొంగతనాలపై తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.8 లక్షలతో నిర్మించిన మురుగు కాలువ నాణ్యతపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఇలాగేనా చేసేది? అని యార్డు డీఈఈ రఘురామరెడ్డిపై ఆగ్రహం వ్యక్త చేశారు. రైతుల తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును పరిశీలించారు.తుప్పు పట్టిన కుళాయిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డులో పారిశుద్ద్యంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట యార్డు చైర్మన్ భాస్కర రెడ్డి, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, ఎస్సీ శ్రీనివాసులు, ఈఈ రాజశేఖర్, డైరెక్టర్లు ఉన్నారు. -
నేటి నుంచి మూడు రోజులు మార్కెట్ బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్ బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. ఈ మూడు రోజులు రైతులు మార్కెట్‌కు ఉల్లితో సహా ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గురువారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు. -
ధాన్యంపై వేటు... మద్యానికి చోటు !
నరసరావుపేటవెస్ట్: రైతులు పండించిన ధాన్యం, అపరాలతోపాటు ఎరువులు నిల్వ ఉంచే సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లు ఇప్పుడు మద్యం నిల్వలకు చిరునామాగా మారాయి. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధరలేక, ఇళ్ల వద్ద దాచిఉంచే సౌకర్యంలేక మార్కెట్‌యార్డులో నిల్వచేద్దామనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం మద్యం నిల్వలను దాచి ఉంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వివరాలను పరిశీలిస్తే... ఆర్టీసీ బస్టాండ్, క్వార్టర్లకు ఎదురుగా గుంటూరు-కర్నూలు రహదారిలో వేర్‌హౌసింగ్ గోడౌన్లు వాటి పక్కనే మార్కెట్ యార్డు ఉంది. వేర్‌హౌసింగ్ గోడౌన్లలో ధాన్యం, లెవీ బియ్యం, ఎరువులు, అపరాలు నిల్వ చేస్తుంటారు. పక్కనే ఉన్న మార్కెట్‌యార్డు గోడౌన్లలో ఆత్మబంధు పథకం కింద ధాన్యం నిల్వ ఉంచుతున్నారు. ఒక గోడౌన్ పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఉంది. ఇటీవల మద్యం నిల్వలు ఉంచే ఏపీ బేవరేజెస్ గోడౌన్లను పన్ను చెల్లించలేదని ఆదాయ పన్నుశాఖ సీజ్ చేసింది. దీంతో వారం రోజుల పాటు బార్లు, మద్యం షాపులకు సరఫరా నిలిచిపోయింది. మద్యం వ్యాపారులతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం గిలగిలలాడింది. ఆదాయ పన్ను చెల్లించకుండానే యుద్ధప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖతో మరో గోడౌన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయటంతో వెంటనే వారు వేర్‌హౌసింగ్ గోడౌన్‌ను ఎంపికచేసి అందులో మద్యం నిల్వ ఉంచి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే గోడౌన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం నిల్వ ఉంచితే టీడీపీ నాయకులు ఎదో అపరాధం జరిగినట్లుగా ఊరూ, వాడా కోడై కూశారు. యార్డులో ధాన్యం దాచుకునేందుకు స్థలమేదీ? ధాన్యానికి ప్రస్తుతం మద్దతు ధరలేకపోవటంతో రైతులు దాచుకునేందుకు యార్డుకు తీసుకొస్తున్నారు. గోదాములు నిండిపోయినందున దాచుకునే అవకాశం లేదని యార్డు అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిగాలుగా వెళ్లిపోతున్నారు. ఎటూ అవకాశంలేని రైతులు యార్డులోని రేకుల షెడ్డుకిందనే ధాన్యం నిల్వచేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ప్రయోజనాలను గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం నిల్వలకు మాత్రం గోడౌన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయటం గమనార్హం. రైతులన్నా, రైతు పండించిన పంటలన్నా తెలుగుదేశం ప్రభ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు !
జడ్చర్ల: పదేళ్ల తరువాత జడ్చర్లకు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రం మంజూరైంది. సోమవారం నుండి ఇక్కడ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని బాదేపల్లి మార్కెట్‌యార్డు కార్యదర్శి అనంతయ్య తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, దశాబ్దకాలంగా జడ్చర్లలో సీసీఐ కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ఏనాడూ ప్రభుత్వం స్పందించలేదు. 2004లో బాదేపల్లి మార్కెట్‌యార్డులో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలుచేశారు. అయితే అప్పట్లో మద్దతుధరలు రాకపోవడంతో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేశారు. నాటినుండి ఎంత ప్రయత్నించినా.. సీసీఐ ఇక్కడ కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో జిల్లాలో ఒక్క షాద్‌నగర్‌లోనే సీసీఐ కొనుగోలు కేంద్రం కొనసాగుతూ వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో సీసీఐ కొనుగోలుకేంద్రం మంజూరైంది. దీంతో రైతులకు ప్రభుత్వ మద్దతుధరలు దక్కే అవకాశం ఏర్పడింది. జడ్చర్లలో కేవలం పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్ల అంచనావ్యయంతో గంగాపూర్ రహదారి సమీపంలో పత్తి మార్కెట్‌యార్డును ప్రత్యేకంగా నిర్మించారు. అయితే పత్తి మార్కెట్‌ను అన్ని హంగులతో నిర్మించినా సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో సాధారణ విక్రయాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఇక్కడ సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకునిపోయే పరిస్థితి ఉండేది. గ్రామాల్లో దళారులు, మార్కెట్లో వ్యాపారులు పత్తి రైతులను నిలువునా మోసంచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీసీఐ కేంద్రం ఏర్పాటుకావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దరిచేరని రైతుబంధు
చీరాల, న్యూస్‌లైన్: మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే రైతులకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు రూపొందించిన రైతుబంధు పథకం వారి దరి చేరడం లేదు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల రైతులకు మూడేళ్లలో ఈ పథకం కింద పైసా కూడా రుణం ఇవ్వలేదంటే పథకం పనితీరు తేటతెల్లమవుతోంది. రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నా..అధికారుల అలసత్వం కారణంగా అవి రైతులకు దక్కడం లేదు. పైసా వడ్డీ లేకుండా అప్పు ఇస్తామంటే రైతులు ముందుకు రావడం లేదని అధికారులంటున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన మార్కెట్ కమిటీలు కేవలం ఆదాయంపైనే దృష్టి సారించి సేవలను విస్మరించాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతుబంధు పథకం ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి రుణ సాయమందించాల్సిన అధికారులు రైతులు ఆసక్తి చూపడం లేదన్న సాకుతో చేతులెత్తేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిధులున్నా..మూడేళ్లుగా అరకొరగా కూడా రైతులకు రుణాలివ్వడం లేదు. రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసి వడ్డీ లేని రుణం పొందవచ్చు. పథకం కింద పంట విలువలో 75 శాతం వరకు రుణంగా ఇస్తారు. దీనికి 90 రోజుల వరకు వడ్డీ ఉండదు. పత్తి మినహా జిల్లాలో సాగయ్యే పంట ఉత్పత్తులన్నింటికీ ఈ పథకం కింద నిల్వ చేసుకుని రుణం పొందే అవకాశం ఉంది. ఇందు కోసం మార్కెట్ల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. రైతులు వస్తే రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నా..పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు. వడ్డీ లేకుండా రుణాలిస్తామంటే వద్దనేవారు ఎవరుంటారని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రైతుబంధు పథకానికి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూనే ఉన్నాయి. పథకం అమలులో భాగంగా ప్రారంభంలో క్రయవిక్రయాలు జరిపే రైతులకు రైతుబంధు పేరిట ప్రత్యేకంగా పాసుపుస్తకాలిచ్చారు. గతంలో వందల సంఖ్యలో రైతులు రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రుణం పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో రైతు బంధు పథకం కాగితాలకే పరిమితమైంది. పథకంపై అవగాహన లేక డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్లో ఏ ధర ఉంటే అదే ధరకు పంట అమ్ముకొని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. చాలా సందర్భాల్లో రైతులు అమ్ముకున్న తర్వాత పంటలకు ధరలు పెరిగాయి. అధికారులు మాత్రం రైతులు ముందుకొస్తే రుణాలిస్తామని చెబుతున్నారు. నగదు అవసరమైన రైతులు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నారని, దీంతో రుణం తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడేళ్లలో పథకం తీరు ఇదీ.. జిల్లాలో మొత్తం 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతులకు మూడేళ్లలో ఒక్కపైసా కూడా రైతుబంధు పథకం కింద రుణం మంజూరు చేయలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మాత్రం 2011-12 సంవత్సరానికి గాను 76 మంది రైతులకు రూ. 32.44 లక్షలు, 2012-13 లో 22 మంది రైతులకు రూ. 17.22 లక్షలు, 2013 నవంబర్ వరకు 31 మంది రైతులకు రూ. 22.63 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. మొక్కుబడిగా మంజూరు చేస్తూ ఈ పథకానికి దూరం చేయడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకున్నా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. -
నిర్దిష్ట సమయంలోనే పత్తి టెండర్లు
ఆదోని, న్యూస్‌లైన్: మార్కెట్‌యార్డులో పరిస్థితిని చక్కదిద్దే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి మూడు రోజుల క్రితం దాదాపు 60వేల క్వింటాళ్ల పత్తి దిగుబడులు తరలిరావడం, తుపాను కారణంగా భారీ వర్షాలతో యార్డులో వ్యాపారాలు స్తంబించడం తెలిసిందే. ముఖ్యంగా పత్తి దిగుబడులు తడిసిపోయి రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అమ్మకాకూ నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు బుధవారం కార్యదర్శి చాంబర్లో యార్డు కమిటీ అధ్యక్షుడు దేవిశెట్టి ప్రకాష్, మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, గ్రేడ్-2 కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీఈ సుబ్బారెడ్డి, సూపర్వజర్లు, పత్తి వ్యాపారుల సంఘం నాయకులు, ఏజెంట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పలువురు కమిషన్ ఏజెంట్లతో విడివిడిగా దాదాపు మూడు గంటల పాటు చర్చలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి వ్యాపారం సజావుగా సాగేందుకు సలహాలు, సూచనలను వారి నుంచి స్వీకరించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ కాటన్ యార్డును పాత గోదాముల ప్లాట్‌ఫాం వరకు విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యార్డు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ముళ్ల కంపలు తొలగించడంతో పాటు లైట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. తూకాల తర్వాత పత్తి డోక్రాలను తరలించేందుకు ప్లాట్‌ఫాం మద్యలో కనీసం 20 అడుగుల ఖాళీ స్థలం ఉండేలా డోక్రాల నిల్వలను క్రమబద్ధీకరించాలన్నారు. ఫ్లాట్‌ఫాంకు సరైన వెలుతురు సదుపాయం కోసం మరిన్ని లైట్లు ఏర్పాటు చేయాలని, నిర్దిష్టమైన సమయంలోనే పత్తి టెండర్లు నిర్వహించాలన్నారు. యార్డు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. జేసీ వెంట ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి ఉన్నారు. మరో 30వేల క్వింటాళ్ల పత్తి ఆరు బయటే యార్డులో మూడో రోజు బుధవారం కూడా పత్తి డోక్రాలను వ్యాపారులు తమ గోదాములకు తరలించుకోలేక పోయారు. మరో 30వేల క్వింటాళ్ల వరకు యార్డులోనే నిలిచిపోయింది. డోక్రాలు వర్షంలో మరింత తడిసిపోయి నాణ్యత బాగా దెబ్బతినడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. యార్డులో దాదాపు 250 వరకు పత్తి తరలించే ఎడ్ల బండ్లు ఉన్నాయి. హమాలీలు ఒక్కో బండితో నాలుగు విడతలుగా డోక్రాలను వ్యాపారుల గోదాములకు తరలించినా మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వర్షం తెరిపివ్వకపోతే తరలింపు మరింత జాజ్యం కానుంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం నుంచి టెండర్లు తిరిగి ప్రారంబించే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. యార్డులో టార్పాలిన్లు లేకపోవడంతో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి తడిసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదిలాఉండగా ఒకటి రెండు రోజుల్లో మరో 200 టార్పాలిన్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని యార్డు గ్రేడ్-2 కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. -
మార్కెట్‌కు మంగళం?
గద్వాల, న్యూస్‌లైన్ : ఐదేళ్ల క్రితం ప్రారంభమైన గద్వాల పత్తి మార్కెట్‌యార్డులో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోళ్లు ప్రారంభిస్తారని ఏటా ఎదురుచూస్తున్న రైతులకు పత్తి విత్తనోత్పత్తిసాగు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా తగ్గనున్న నేపథ్యంలో ఇక మార్కెట్ యార్డు మూతపడే పరిస్థితి నెలకొంది. 2008 అక్టోబర్ 5న ఇక్కడి పత్తి మార్కెట్‌యార్డును అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మరుసటి ఏడాది నుంచి మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీఇచ్చారు. ఈ హామీ వాయిదా పడుతూ వచ్చింది. 40వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తి సాగు ఉన్న గద్వాల ప్రాంతంలో పత్తి మార్కెట్ అవసరమన్న ఉద్దేశంతో దాదాపు రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల ఖర్చుతో యార్డును నిర్మించి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ మార్కెట్ ఏ ముహూర్తాన నిర్మించారో తెలియదు కానీ ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్లుగా గోదాంలకు అడ్డాగా మారింది. చివరకు మార్కెట్‌కు పత్తి రాకుండానే విత్తనోత్పత్తి సాగు ఈ ప్రాంతంలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పత్తి మార్కెట్ అవసరం లేకుండానే పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా గద్వాల పత్తి మార్కెట్ యార్డు ప్రారంభమైన నాటి నుంచి కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారంభం కాకుండానే చివరకు నిరవధికంగా మార్కెట్‌కు మోక్షం లేకుండా మిగిలిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం. కాగా, 2008లో ప్రారంభమైన గద్వాల పత్తి మార్కెట్‌యార్డులో 2009 నుంచి పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని అధికారులు చెప్పారు. నాటి నుంచి ఏటా సీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఇందుకు తగిన నిర్ణయం వెలువడుతుందని చెబుతూ వచ్చారు. ఈ ప్రాంత రైతులకు గద్వాల పత్తి మార్కెట్ ఏ సేవలు చేయకుండానే మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా గద్వాలప్రాంతంలో రైతులకు మేలు చేసే పత్తి విత్తనోత్పత్తి సాగు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోకుండా అవసరమైన చర్యలు చేపడితే ప్రయోజనం. -
ముంచిన ముసురు
న్యూస్‌లైన్ బృందం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పాలమూరును ముసురు వర్షం ముం చెత్తింది. మూలిగేనక్కపై తాటికాయపడ్డ చందం గా ఇప్పటికే అప్పులబాధతో కొట్టుమిట్టాడుతు న్న అన్నదాతను వరుణుడు దెబ్బతీశాడు. గత రెండురోజులుగా కరుస్తున్న వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. చేతికొచ్చిన మొక్కజొన్న మార్కెట్‌యార్డుల్లో తడిసిముద్దయింది. ఇప్పటికే తెల్లబంగారం నల్లబారి అన్నదాతకు ఆవేదన మిగి ల్చింది. ఆముదం పంటకు తెగుళ్లు సోకడంతో చేతికి రాకుండాపోయింది. జిల్లాలోని జడ్చర్ల, నవాబ్‌పేట, వనపర్తి, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట తదితర వ్యవసాయ మార్కెట్లలో వేలకొద్దీ బస్తాల మొక్కజొన్న వర్షార్పణమైంది. దేవరకద్ర మండలంలో 9వేల ఎకరాల్లో ఆముదం పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. జడ్చర్ల మార్కెట్లో విక్రయానికి తెచ్చిన ఆరువందల బస్తాల మొక్కజొ న్న తడిసిపోయింది. బుధవారం విక్రయాలు జ రగకపోవడంతో సరుకును అక్కడే ఉంచిన రైతు లు వర్షానికి తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. తేమ సాకుతో వ్యాపారులు కొనుగో ళ్లు జరపకపోవడంతో రైతులు అచ్చంపేట మా ర్కెట్‌యార్డు ఆవరణలో ఎండబెట్టుకున్న పంట తడిసిపోయింది. దీంతో మొక్కజొన్న రాసుల ను కవర్లతో కప్పి కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. నవాబ్‌పేట మర్కెట్ లో నాలుగువేల బస్తాల మొక్కజొన్న పనికిరాకుండా పోయింది. ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చిన తరుణంలోనే కొనుగోలు చేసి ఉంటే ఎలాగోలా బ యటపడేవారమని, తాజాగా మార్కెట్లో ధర కోసం వేచి ఉంటే రెక్కలకష్టం నీటి పాల య్యిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తడిసి ధాన్యాన్ని కొనుగోలుచేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో సుమారు మూడువేల బ్యాగుల మొక్కజొన్న తడిసిముద్దయింది. వ్యాపారులు, హమాలీల మధ్య తలెత్తిన వివాదం కారణంగా గతవారం రోజులుగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరగడం లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కూడా కొనుగోలు చేయడం లేదు. తీరా రైతుల కష్టం వర్షానికి కొట్టుకుపోయింది. నేలకొరిగిన వరిపైరు రెండురోజలుగా కురుస్తున్న ముసురువర్షానికి మిడ్జిల్ మండలంలో రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. తాడూరు మండలంలో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. పెద్దమందడి మండలంలో దొడగుంటపల్లి, చిన్నమందడి, అల్వాల, మోజర్ల, తదితర గ్రామాల్లో సుమారు రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. గోపాలపేట మండలంలో సోనామసూరి పంట నేలకొరిగి నష్టంవాటిల్లింది. ముసురువర్షాలకు కోడేరు మండలంలోని ఆరు ఇళ్లు కూలిపోయాయి. తెగిన చంద్రవాగు వంతెన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షానికి మండలంలోని చంద్రవాగు వద్ద వేసిన తాత్కాలిక వంతెన బుధవారం మరోసారి తెగిపోయింది. బొల్గట్‌పల్లి స్టేజీ సమీపంలో మహబూబ్‌నగర్- శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద పూర్తిస్థాయి వంతెన నిర్మాణం పనులు జరుగుతుండడంతో కాంట్రాక్టర్ పక్కనే తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టాడు. గతంలో కూడా రెండుసార్లు ఈ వంతెన భారీ వర్షాలకు తెగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముసురు వర్షం కురుస్తుండటంతో చంద్రవాగు నుంచి వరదనీటి ఉధృతికి తట్టుకోలేక మూడోసారి వంతెన తెగిపోయింది. దీంతో మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను హాజీపూర్ మీదుగా దారి మళ్లించారు. తెగిపోయిన వంతెనను అచ్చంపేట తహసీల్దార్ జ్యోతి, ఎస్ఐ రామలింగారెడ్డిలు పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా త్వరలో రాకపోకల పునరుద్ధరిస్తామని ఆర్అండ్బీ డీఈ చంద్రశేఖర్ తెలిపారు. -
ధర లేక దిగాలు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించడం, చీడపీడలు పెద్దగా ఆశించకపోవడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న అధిక దిగుబడి వచ్చింది. అయితే ఈ సారి క్వింటాలుకు రూ.1310 మద్దతు ధరగా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సిరులపంట పండిందని రైతులు సంతోషించారు. అధికారులు అంతలోనే వారి ఆశలపై నీళ్లుచల్లారు. రైతులు మొక్కజొన్నను మార్కెట్‌యార్డుకు తీసుకెళ్తే దళారులు రంగప్రవేశం చేయడంతో క్వింటాలుకు వెయ్యి రూపాయలకు మించి ధర పలకడం లేదు. వ్యాపారులు తేమశాతం పేరుతో నిలువునా మోసం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 42లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, బాదేపల్లి,నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్ మార్కెట్‌యార్డుల్లో మొక్కజొన్నను విక్రయించేందుకు వెళ్లగా అక్కడ వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి వారు నిర్ణయించిందే ధర అనేరీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో జిల్లా యంత్రాంగం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డుల్లో కౌంటర్లను ఏర్పాటుచేసింది. అయితే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు అంత ఉత్సాహం కనబరచడం లేదు. హమాలీల కొరత తీవ్రంగా ఉందని అందుకోసమే మొక్కజొన్న కొనుగోలు చేయడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం ఏడుచోట్ల మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కౌంటర్లు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కేవలం 616 క్వింటాళ్ల మొక్కజొన్నను మాత్రమే కొనుగోలుచేశారు. రైతన్నకు దక్కని మద్దతు ఇదిలాఉండగా మంగళవారం వ్యాపారులు మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో 513 క్వింటాళ్లు, బాదేపల్లి మార్కెట్లో 4746, అచ్చంపేటలో 572 మొత్తం 5831 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. ఆయా మార్కెట్లలో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కరైతుకు కూడా మద్దతుధర చెల్లించలేదు. వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, నవాబ్‌పేట మార్కెట్లలో కొనుగోళ్లు జరగలేదు. బాదేపల్లి వ్యవసాయమార్కెట్ యార్డులో సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 4,69,668 క్వింటాళ్ల మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేసినా ఒక్క రైతుకు కూడా మద్దతుధర దక్కలేదు. మద్దతు ధర కోసం మొక్కజొన్నను మార్కెట్లోనే ఉంచిన రైతులకు వరుణుడి దెబ్బ తగిలింది. అకాలవర్షం కురియడంతో కష్టమంతా వర్షార్పణమైంది. దాదాపు 80వేల బస్తాలు వర్షపు నీటిలో తడిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. మద్దతుధర కోసం ఎదురుచూస్తే తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో దోపిడీ మొక్కజొన్నకు తేమ ఎక్కువ గా ఉందనే సాకు చూపి వ్యా పారులు దోపిడీ చేస్తున్నారు. దోపిడీ గురించి నిలదీసిన రై తుల మొక్క జొన్నను కొనుగోలు చేయడం లేదు. మొన్నటి దాకా వ్యాపారస్తులు కొనకుండా వది లేస్తే మార్క్‌ఫెడ్ అధికారులైనా కొనుగోలు చేస్తారనుకున్నాం. తేమ పేరుతో వాళ్లూ కొనుగోలు చే యడం మానేశారు. దీంతో పది రోజులుగా ధా న్యంతో మార్కెట్లోనే మగ్గుతున్నాం. ఇన్నాళ్లూ మంచి ధర కోసం వేచి చూశాం. చివరకు ధర రా కపోగా ప్రస్తుతం ఎవరూ కొనే పరిస్థితి లేదు. - నర్సింహులు, రైతు, రుక్కంపల్లి, నవాబ్‌పేట మండలం ధర రావడం లేదు మార్క్‌ఫెడ్ వాళ్లు తేమ ఎక్కువగా ఉందని వదిలేయడం తో వ్యాపారులు ఈ ధాన్యా న్ని మరింత తక్కువకు అడుగుతున్నారు. దీంతో గిట్టుబాటు ధర అటుంచితే మామూలు ధర కూడా వచ్చే పరిస్థితి కనిపించ డం లేదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలి యడం లేదు. - రాంచందర్, ఇప్పటూరు, నవాబ్‌పేట మండలం