సాక్షి, అమరావతి: రైతుల బాగోగులు చేసుకోవడంలో ఎమ్మెల్యేలకు నేరుగా అవకాశం కల్పించేందుకు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కల్పించడంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకునేందుకు వీలుగా మార్కెటింగ్ శాఖలో సవరణ బిల్లును తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించడంలో కీలకమైన మార్కెటింగ్ శాఖ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ సవరణలో భాగంగా మార్కెట్ యార్డులకు ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నామని తెలిపారు.
ఇలా చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా లేదా అన్నది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సులభంగా తెలుస్తుందని, ఒకవేళ తమకు గిట్టుబాటు ధర రాకపోతే.. రైతులు మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేస్తారని, వారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకువస్తే.. ఆ విషయాన్ని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా, వివిధ వర్గాల ద్వారా తెలుసుకొని.. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోతే.. ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, రూ. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, ఆ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు.
వ్యవసాయ ప్రగతి కోసమే
రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతి కోసమే మార్కెటింగ్ శాఖలో సవరణ బిల్లును తీసుకువస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. రైతులను ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్లేందుకు, దళారి వ్యవస్థను రూపుమాపడానికి ఈ బిల్లును తెచ్చామన్నారు. రూ. రెండువేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులకు భరోసా లభించిందని, ధరల స్థిరీకరణ కోసం రూ. మూడువేల కోట్లు కేటాయించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించనున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment