నిర్వహణ ఇంత అధ్వానమా?
నిర్వహణ ఇంత అధ్వానమా?
Published Mon, Oct 17 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
- అదోని మార్కెట్‌యార్డ్ అధికారులపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ ఆగ్రహం
ఆదోని: స్థానిక మార్కెట్ యార్డు నిర్వహణ తీరుపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనరు మల్లికార్జున రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు రెండు గంటల పాటు యార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. యార్డులో స్టేట్ బ్యాంకు భవనం అభివృద్ది కోసం అధికారులు దాదాపు రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ మేరకు అభివృద్ధి కనిపించలేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనశాలలో కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయకుండా నారరాతి బండలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. రైతు విశ్రాంతి భవనం తాళాలు తన వద్ద లేవని చెప్పిన ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రామారావుపై కమిషనర్‌మండిపడ్డారు. రైతు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను పరిశీలించి..పనివేళలు, క్లినిక్ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. యార్డులో పత్తి దొంగతనాలపై తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.8 లక్షలతో నిర్మించిన మురుగు కాలువ నాణ్యతపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఇలాగేనా చేసేది? అని యార్డు డీఈఈ రఘురామరెడ్డిపై ఆగ్రహం వ్యక్త చేశారు. రైతుల తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంటును పరిశీలించారు.తుప్పు పట్టిన కుళాయిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డులో పారిశుద్ద్యంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట యార్డు చైర్మన్ భాస్కర రెడ్డి, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, ఎస్సీ శ్రీనివాసులు, ఈఈ రాజశేఖర్, డైరెక్టర్లు ఉన్నారు.
Advertisement