ఆత్మీయతలో కమిషనర్‌ను నిలదీస్తున్న బాధితుడు మధుసూదన్‌రెడ్డి
10 నెలలుగా బిల్లుల కోసం ఎదురుచూపులు
Published Mon, Sep 26 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– ఆపదలో ఆదుకుంటే అన్యాయం చేస్తారా..?
– మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన జేసీబీ నిర్వాహకుడు
మదనపల్లె: ‘గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు, చెరువులు నిండిపోయాయి. ఆ సమయంలో వరద నీరు ఇళ్లలోకిరాకుండా దారి మళ్లించేందుకు జేసీబీతో పనులు చేశాను. రూ.2.75 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటున్నారు’ అని జేసీబీ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి వాపోయారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆత్మీయతా కార్యక్రమంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఆలోచించకుండా రేయింబవళ్లు జేసీబీతో పనులు చేయించుకుని బిల్లుల మంజూరులో జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. 10 నెలలుగా వందలసార్లు మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదని వాపోయారు. అప్పటి కమిషనర్ మారిపోయారని, ఆ బిల్లులతో తనకు సంబంధం లేదని ప్రస్తుత కమిషనర్ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. తనకు బిల్లులు చెల్లించకపోతే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంపై సబ్‌కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అనంతరం కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, మేనేజర్ రాంబాబు, డీఈ మహేష్, ఏఈ గోపీనాథ్, టీపీఎస్ కుముదిని తదితరులు పాల్గొన్నారు.
Advertisement