మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు! | Grain arrived at Suryapet market yard on Friday | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు!

Published Sat, Apr 22 2023 2:38 AM | Last Updated on Sat, Apr 22 2023 2:50 PM

Grain arrived at Suryapet market yard on Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరికోతలు ఊపందుకుంటున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. పలు జిల్లాల్లో వరికోతలు మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు 1,150 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్‌ వంటి పలుజిల్లాల్లోనే ఈ సెంటర్లను ప్రారంభించారు.

ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ధాన్యాన్ని సెంటర్లకు తీసుకువస్తున్నా.. కొనుగోళ్లు లేక రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ధాన్యం ఆరబెడుతూ..
ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేసే పరిస్థితి ఉండటంతో రైతులు కొన్నేళ్లుగా.. వరి కోతలు కాగానే ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. అయితే అధికారులు గత యాసంగి నుంచి కోసిన పంటను సొంత కల్లాల్లో ఆరబెట్టుకుని, ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు.

సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో.. కొందరు రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంది పొలాల్లో తాత్కాలిక కల్లాలను ఏర్పాటు చేసుకొని ధాన్యం ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చినా.. కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి మాత్రం మారలేదు. ఈ యాసంగిలోనైనా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

7,029 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం
రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.20 కోట్ల టన్నులకుపైగా వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సొంత అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా కోటి టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,028 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

కొన్ని జిల్లాల్లో ఇంకా కోతలు మొదలవకపోవడం, కోతలు జరుగుతున్న నల్లగొండ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో కొందరు రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తుండటంతో.. ఇప్పటికిప్పుడే కొనుగోలు కేంద్రాల అవసరం లేదని భావిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని అంటున్నారు.

సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం ఇది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 868 మంది రైతులు 45,253 బస్తాల ధాన్యాన్ని మార్కెట్‌ తీసుకొచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాల్‌ ధాన్యానికి రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ధర చెల్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. – సూర్యాపేట

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం రాశులు ఇవి. శుక్రవారం ఒక్కరోజే 29,300 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. – తిరుమలగిరి (తుంగతుర్తి)


ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
అధికారులకు మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశం
కరీంనగర్‌:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. మంత్రి శుక్రవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.

రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 90 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement