buying center
-
మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరికోతలు ఊపందుకుంటున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. పలు జిల్లాల్లో వరికోతలు మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు 1,150 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్ వంటి పలుజిల్లాల్లోనే ఈ సెంటర్లను ప్రారంభించారు. ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ధాన్యాన్ని సెంటర్లకు తీసుకువస్తున్నా.. కొనుగోళ్లు లేక రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ఆరబెడుతూ.. ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేసే పరిస్థితి ఉండటంతో రైతులు కొన్నేళ్లుగా.. వరి కోతలు కాగానే ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. అయితే అధికారులు గత యాసంగి నుంచి కోసిన పంటను సొంత కల్లాల్లో ఆరబెట్టుకుని, ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు. సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో.. కొందరు రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంది పొలాల్లో తాత్కాలిక కల్లాలను ఏర్పాటు చేసుకొని ధాన్యం ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చినా.. కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి మాత్రం మారలేదు. ఈ యాసంగిలోనైనా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7,029 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.20 కోట్ల టన్నులకుపైగా వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సొంత అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా కోటి టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,028 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఇంకా కోతలు మొదలవకపోవడం, కోతలు జరుగుతున్న నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొందరు రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తుండటంతో.. ఇప్పటికిప్పుడే కొనుగోలు కేంద్రాల అవసరం లేదని భావిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని అంటున్నారు. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం ఇది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 868 మంది రైతులు 45,253 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాల్ ధాన్యానికి రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ధర చెల్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. – సూర్యాపేట సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాశులు ఇవి. శుక్రవారం ఒక్కరోజే 29,300 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. – తిరుమలగిరి (తుంగతుర్తి) ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం కరీంనగర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మంత్రి శుక్రవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 90 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచామన్నారు. -
మక్కలు ఇంకెప్పుడు కొంటరు?
సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్‌ఫెడ్ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది. తగ్గుతున్న ధర.. మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్ పడిపోతోంది. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనాలి.. నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. –గడ్డం బాల్‌రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా -
పాత తూకం యంత్రంతో రైతులకు భారీ టోకరా
రామాయంపేట (మెదక్): మండలంలోని కాట్రియాల గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. దీంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. ఎల్రక్టానిక్ తూకం యంత్రానికి బదులుగా పాత తూకం యంత్రం వినియోగించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రతీ తూకానికి 40 కిలోలకు బదులుగా 48 నుంచి 50 కిలోల వరకు అక్రమంగా తూకం చేసుకొని రైతులను మోసగించారు. కాగా రైతులకు తెలియకుండానే ఒక్కో తూకం (40 కిలోలు)లో ఎనిమిది నుంచి పది కిలోల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు పదివేల బ్యాగుల వరకు తూకం వేయగా, ఇందులో సుమారుగా ఐదు వేల బ్యాగులను పాత కాంటాపై తూకం చేశారు. ఈ లెక్కన రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కాగా ఎవరి ప్రోద్బలంతో తూకం వేసిన హమాలీలు ఈ మోసానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. బయటపడింది ఇలా.. సాయంత్రం మ్యాన్యువల్ కాంటాతో ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో అనుమానించిన కొందరు రైతులు ఈ కాంటాతో తూకం వేసిన బస్తాలను కొన్నింటిని ఎల్రక్టానిక్ తూకం యంత్రంపై తూకం వేయగా, ఈ మోసం బయటపడింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వందలాది మంది కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకొని వచి్చన పోలీసులు రైతులను శాంతపర్చారు. చదవండి: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న -
ఎన్నాళ్లకెన్నాళ్లకు !
జడ్చర్ల: పదేళ్ల తరువాత జడ్చర్లకు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రం మంజూరైంది. సోమవారం నుండి ఇక్కడ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని బాదేపల్లి మార్కెట్‌యార్డు కార్యదర్శి అనంతయ్య తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, దశాబ్దకాలంగా జడ్చర్లలో సీసీఐ కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ఏనాడూ ప్రభుత్వం స్పందించలేదు. 2004లో బాదేపల్లి మార్కెట్‌యార్డులో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలుచేశారు. అయితే అప్పట్లో మద్దతుధరలు రాకపోవడంతో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేశారు. నాటినుండి ఎంత ప్రయత్నించినా.. సీసీఐ ఇక్కడ కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో జిల్లాలో ఒక్క షాద్‌నగర్‌లోనే సీసీఐ కొనుగోలు కేంద్రం కొనసాగుతూ వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో సీసీఐ కొనుగోలుకేంద్రం మంజూరైంది. దీంతో రైతులకు ప్రభుత్వ మద్దతుధరలు దక్కే అవకాశం ఏర్పడింది. జడ్చర్లలో కేవలం పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్ల అంచనావ్యయంతో గంగాపూర్ రహదారి సమీపంలో పత్తి మార్కెట్‌యార్డును ప్రత్యేకంగా నిర్మించారు. అయితే పత్తి మార్కెట్‌ను అన్ని హంగులతో నిర్మించినా సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో సాధారణ విక్రయాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఇక్కడ సీసీఐ కేంద్రం లేకపోవడంతో రైతులు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకునిపోయే పరిస్థితి ఉండేది. గ్రామాల్లో దళారులు, మార్కెట్లో వ్యాపారులు పత్తి రైతులను నిలువునా మోసంచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీసీఐ కేంద్రం ఏర్పాటుకావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.