మక్కలు ఇంకెప్పుడు కొంటరు?  | Markfed is waiting for the government's decision | Sakshi
Sakshi News home page

మక్కలు ఇంకెప్పుడు కొంటరు? 

Apr 17 2023 2:12 AM | Updated on Apr 17 2023 8:31 AM

Markfed is waiting for the government's decision - Sakshi

సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్‌లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు.

సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్‌ఫెడ్‌ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా చేస్తేనే మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది.  

తగ్గుతున్న ధర.. 
మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్‌ పడిపోతోంది. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు.  

మార్క్‌ఫెడ్‌ కొనాలి.. 
నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్‌లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.  
–గడ్డం బాల్‌రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా 

కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే
ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. 
– బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement