నంద్యాల మార్కెట్‌కు పర్సన్ ఇన్‌చార్జి నియామకం
Published Tue, Jan 17 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
- ఆరు నెలలుగా ఏర్పాటు కాని పాలకవర్గం
- రాజకీయ విభేదాలే ఇందుకు కారణం
- ప్రభుత్వ నిర్ణయంతో భూమా, శిల్పాకు చుక్కెదురు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కీలకంగా ఉన్న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎట్టకేలకు ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జిగా మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్‌ను నియమించింది. రెండేళ్ల క్రితం నంద్యాల మార్కెట్ కమిటీకి సిద్ధం శివరామ్ నేతృత్వంలో పాలకవర్గం ఏర్పాటైంది. ఏడాది క్రితం పూర్తయిన పదవీ కాలాన్ని ఆర్నెళ్లపాటు పొడిగించారు. పొడిగింపు కూడా ఐదు నెలల క్రితమే పూర్తయింది. తర్వాత ఇప్పటివరకు పొడిగించలేదు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మధ్య విభేదాల కారణంగా పాలక వర్గం పొడిగింపు మరుగున పడిపోయింది. ఇటీవల పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న సిద్ధం.. శిల్పా అనుచరుడు కావడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అడ్డుకున్నట్లు సమాచారం. దీనివల్ల పాలకవర్గం పొడిగింపునకు నోచుకోలేదు. పాలకవర్గం లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బిల్లులతోపాటు ఇతర ల్లులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దించి పర్సన్ ఇన్‌చార్జిగా సుధాకర్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇరువర్గాలకు షాక్...
మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించుకోవడంలో తమదే పైచేయిగా ఉండాలని భావించిన శిల్పా, భూమా వర్గాలకు షాక్ తగిలినట్లయింది. మొన్నటి వరకు సిద్ధం శివరాం నేతృత్వంలోని పాలకవర్గాన్ని పొడిగించాలని శిల్పా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ వచ్చారు. తాను చెప్పిన వారికే చైర్మన్‌గిరి ఇవ్వాలని భూమా పట్టుబట్టారు. ఈ క్రమంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం సంక్లిష్టం కావడంతో ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జిని నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ చర్య ఇరువర్గాలకు విస్మయాన్ని కల్గించింది.
Advertisement
Advertisement