రైతులతో మాట్లాడుతున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జున రావు
మోడల్ మార్కెట్‌గా ఆదోని
Published Wed, Nov 23 2016 11:14 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జున రావు
ఆదోని: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు. బుధవారం ఆయన మార్కెట్ యార్డును పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రైతులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి, ఇతర మార్కెట్లలో ధరలు తెలుసుకునేందుకు..ఆరు డిస్‌ప్లే బోర్డులు, తాగునీటి సౌలభ్యం కోసం ఆరు ఆర్‌ఓ ప్లాంట్లు, సబ్సిడీ భోజనం మెస్, టాయిలెట్లు , సీసీ కెమెరాలుడిసెంబర్ లోపు ఏర్పాటు చేస్తామని వివరించారు. యార్డుల్లో పదిశాతం పేమెంట్లు మాత్రం నగదు రూపంలో నిర్వహించి మిగిలిన మొత్తానికి చెక్కులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 320 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో 50 యార్డులలో పేమెంట్ సమస్య ఎదురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చిల్లరనోట్ల కొరత కారణంగా నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలో మరో 20 రైతు బజార్‌లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2014–15లో సీసీఐ ద్వారా పత్తికొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వారిలో 92 మంది మార్కెటింగ్ శాఖకు చెందిన వారిగా గుర్తించి ఆర్టికల్ ఆఫ్ చార్జ్‌మెమో జారీ చేçశామని చెప్పారు. దోషులుగా తేలితే అక్రమాలకు సంబంధించిన మొత్తంను రికవరీ చేయడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఏడీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఆదిశేషులు, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, డైరెక్టర్లు రంగస్వామి, యువరాజ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement