మెతుకు కరువే..! | farmers focus on alternative crop due to rainfall | Sakshi
Sakshi News home page

మెతుకు కరువే..!

Published Wed, Aug 13 2014 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

farmers focus on alternative crop due to rainfall

 ఆదోని: తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టు భూములకు సక్రమంగా సాగు నీరందక పోవడంతో రైతులు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వరి పంటకు బదులుగా పత్తి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో బియ్యం కొరత ఏర్పడి ధర అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగువ కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో మొత్తం లక్షా 51 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది.

ఇందులో ఖరీఫ్‌లో 49వేల ఎకరాలు, రబీలో లక్షా ఒక వెయ్యి ఎకరాలు గుర్తించారు. ఖరీఫ్, రైతులు కాలువ కింద వరి పంట సాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌లో మొత్తం భూముల్లో వరి పంట సాగు అవుతోంది. రబీలో సగానికి పైగా వరి పంటను సాగు చేస్తారు. అయితే కర్ణాటక ప్రాంతంలో దిగువ కాలువ నీటిని నానాయకట్టుకు మళ్లించుకోవడంతో ఆయకట్టు భూములకు సాగు నీటి కొరత ఏర్పడుతోంది. ఏటా 30 నుంచి 50 వేల ఎకరాలకు సరిపోయే 3 నుంచి 5 టీఎంసీల నీరు దారి మళ్లుతున్నట్లు అంచనా. రాష్ట్ర వాటా కింద రావాల్సిన నీరు రాక పోవడంతో మొత్తం ఆయకట్టులో ఏటా 40 వేల  నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు.

దీంతో 90 వేల నుంచి లక్షా పది వేల ఎకరాల వరకు ఎంతో విలువైన ఆయకట్టు భూములు వర్షాధార భూములుగా మారుతున్నాయి. సాగు అవుతున్న భూములకు కూడా కీలక దశలో నీటి కొరత మరింత తీవ్రం అయి వరి పంట దెబ్బ తింటోంది. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టక ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కాలువ కింద ఏటేటా వరి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.

ఈ ఏడు ఖరీఫ్‌లో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే సాగు నీరు అందుతుందో లేదోనన్న ఆనుమానంతో రైతులు ఇప్పటికేతమ ఆయకట్టు భూములలో ప్రత్యమ్నాయ పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా పత్తి పంట సాగు చేశారు. ఒకటి రెండు తడులు సాగు నీరు అందక పోయినా వరియేతర పంటలు తట్టుకుంటాయి, దీంతో రైతుల ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించారు.

 పొంచి ఉన్న బియ్యం కొరత
   ముఖ్యంగా బియ్యం కొరత తీవ్రం అయి ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో నాణ్యతను బట్టి క్వింటాలు రూ.4800 నుంచి రూ.5200 వరకు పలుకుతున్నాయి. స్థానికంగా పండుతున్న సోనా మసూరి బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  విస్తీర్ణం తగ్గిపోవడంతో బియ్యం మరింత ప్రియమై ధరపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement