Rice shortage
-
భోజనానికి బియ్యం లేవ్ !
♦ అరువు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న వైనం ♦ వండిపెట్టేందుకు ఏజెన్సీల విముఖత ♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యాచారం: యాచారం మండల పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నానికి బియ్యం కొరత ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిన బియ్యం తో సరిపెడుతుండగా మరికొన్ని పాఠశాలల్లో అవికూడా లేకపోవడంతో కిరాణషాపులు, రేషన్ డీలర్ల వద్ద అరువపై బియ్యం తెచ్చి విద్యార్థులకు వండిపెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజ నానికి సంబంధించి బియ్యం సరఫరా చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువుతున్నాయి. మండల పరిధిలో 20 ఉన్నత, 37 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ ఉంది. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,771 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 120 లోపే విద్యార్థులు ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 200 పైగానే ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం పథకం కింద ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 150 గ్రాములు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున బియ్యం వండిపెడుతున్నారు. మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 3 క్వింటాళ్ల బియ్యం బియ్యం అవసరమవుతాయి. ఏజెన్సీలను నిర్వహించలేం.. రెండు రోజుల్లో బియ్యం పంపిణీ చేకపోతే మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేస్తామని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికే నెల రోజుల బిల్లు పెండింగ్‌లో ఉందని, ఈ నేపథ్యంలో కూరగాయలతో పాటు బియ్యం కూడా అప్పు తెచ్చి భోజనం పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. మూడు రోజుల్లో బియ్యం సరఫరా చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. బియ్యం నిల్వల కోసం డీఈఓకు నివేదిక పంపించాం. రెండు, మూడు రోజుల్లో బియ్యం సరఫరా అవుతాయి. కొన్ని పాఠశాలల్లో వేసవి భోజనానికి సంబంధించిన బియ్యం ఉన్నాయి. అవి కూడా లేని చోట ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బియ్యం తెచ్చి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నాం. - వినోద్‌కుమార్, ఎంఈఓ, యాచారం -
మెతుకు కరువే..!
ఆదోని: తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టు భూములకు సక్రమంగా సాగు నీరందక పోవడంతో రైతులు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వరి పంటకు బదులుగా పత్తి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో బియ్యం కొరత ఏర్పడి ధర అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగువ కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో మొత్తం లక్షా 51 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఖరీఫ్‌లో 49వేల ఎకరాలు, రబీలో లక్షా ఒక వెయ్యి ఎకరాలు గుర్తించారు. ఖరీఫ్, రైతులు కాలువ కింద వరి పంట సాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌లో మొత్తం భూముల్లో వరి పంట సాగు అవుతోంది. రబీలో సగానికి పైగా వరి పంటను సాగు చేస్తారు. అయితే కర్ణాటక ప్రాంతంలో దిగువ కాలువ నీటిని నానాయకట్టుకు మళ్లించుకోవడంతో ఆయకట్టు భూములకు సాగు నీటి కొరత ఏర్పడుతోంది. ఏటా 30 నుంచి 50 వేల ఎకరాలకు సరిపోయే 3 నుంచి 5 టీఎంసీల నీరు దారి మళ్లుతున్నట్లు అంచనా. రాష్ట్ర వాటా కింద రావాల్సిన నీరు రాక పోవడంతో మొత్తం ఆయకట్టులో ఏటా 40 వేల నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు. దీంతో 90 వేల నుంచి లక్షా పది వేల ఎకరాల వరకు ఎంతో విలువైన ఆయకట్టు భూములు వర్షాధార భూములుగా మారుతున్నాయి. సాగు అవుతున్న భూములకు కూడా కీలక దశలో నీటి కొరత మరింత తీవ్రం అయి వరి పంట దెబ్బ తింటోంది. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టక ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కాలువ కింద ఏటేటా వరి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ ఏడు ఖరీఫ్‌లో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే సాగు నీరు అందుతుందో లేదోనన్న ఆనుమానంతో రైతులు ఇప్పటికేతమ ఆయకట్టు భూములలో ప్రత్యమ్నాయ పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా పత్తి పంట సాగు చేశారు. ఒకటి రెండు తడులు సాగు నీరు అందక పోయినా వరియేతర పంటలు తట్టుకుంటాయి, దీంతో రైతుల ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించారు. పొంచి ఉన్న బియ్యం కొరత ముఖ్యంగా బియ్యం కొరత తీవ్రం అయి ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో నాణ్యతను బట్టి క్వింటాలు రూ.4800 నుంచి రూ.5200 వరకు పలుకుతున్నాయి. స్థానికంగా పండుతున్న సోనా మసూరి బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విస్తీర్ణం తగ్గిపోవడంతో బియ్యం మరింత ప్రియమై ధరపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.