భోజనానికి బియ్యం లేవ్ !
♦ అరువు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న వైనం
♦ వండిపెట్టేందుకు ఏజెన్సీల విముఖత
♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
యాచారం: యాచారం మండల పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నానికి బియ్యం కొరత ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిన బియ్యం తో సరిపెడుతుండగా మరికొన్ని పాఠశాలల్లో అవికూడా లేకపోవడంతో కిరాణషాపులు, రేషన్ డీలర్ల వద్ద అరువపై బియ్యం తెచ్చి విద్యార్థులకు వండిపెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజ నానికి సంబంధించి బియ్యం సరఫరా చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువుతున్నాయి.
మండల పరిధిలో 20 ఉన్నత, 37 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ ఉంది. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,771 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 120 లోపే విద్యార్థులు ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 200 పైగానే ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం పథకం కింద ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 150 గ్రాములు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున బియ్యం వండిపెడుతున్నారు. మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 3 క్వింటాళ్ల బియ్యం బియ్యం అవసరమవుతాయి.
ఏజెన్సీలను నిర్వహించలేం..
రెండు రోజుల్లో బియ్యం పంపిణీ చేకపోతే మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేస్తామని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికే నెల రోజుల బిల్లు పెండింగ్‌లో ఉందని, ఈ నేపథ్యంలో కూరగాయలతో పాటు బియ్యం కూడా అప్పు తెచ్చి భోజనం పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు.
మూడు రోజుల్లో బియ్యం సరఫరా చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. బియ్యం నిల్వల కోసం డీఈఓకు నివేదిక పంపించాం. రెండు, మూడు రోజుల్లో బియ్యం సరఫరా అవుతాయి. కొన్ని పాఠశాలల్లో వేసవి భోజనానికి సంబంధించిన బియ్యం ఉన్నాయి. అవి కూడా లేని చోట ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బియ్యం తెచ్చి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నాం.
- వినోద్‌కుమార్, ఎంఈఓ, యాచారం