Alternative crops
-
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జూలై 15, జూలై 31, ఆగస్ట్ 15 నాటికి సరైన వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంటలు, పంట రకాల మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా పంటల కాలంలో అవసరమయ్యే వివిధ పంటల సరళి, అవసరమైన ఉత్పాదకలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా జూలై 15 నాటికి వర్షాలు పడకపోతే.. 40 వేల క్వింటాళ్లు, జూలై 31 నాటికి వర్షాలు పడకపోతే 71 వేల క్వింటాళ్లు, ఆగష్టు 15 నాటికి వర్షాలు పడకపోతే లక్ష క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల పంపిణీకి కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే నేషనల్ సీడ్స్, తెలంగాణ సీడ్స్, కర్ణాటక సీడ్స్ కార్పొరేషన్ల నుంచి విత్తనాలు సమీకరించి ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలపై సర్టిఫికెట్ కోర్సులు
సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో రైతులకు సాయపడేందుకు వ్యవసాయ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైతులకు కొత్త రకాల పంటలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా వివిధ పంటల విధానంపై ముఖ్యంగా యువ రైతులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 పరిశోధన స్థానాలు, రెండు పాలిటెక్నిక్‌లు, రెండు బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం కొనసాగుతున్నాయి. తొలుత రెండు పరిశోధనా స్థానాల్లో మూడు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకంపై రెండు కోర్సులను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పరిశోధన స్థానంలో, అయిల్ పామ్ పెంపకం, నిర్వహణపై ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని పరిశోధన స్థానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే స్టడీ మెటీరియల్ సైతం అందించనున్నారు. ఒక్కో కోర్సులో 20 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులకు నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించనున్నారు. జనవరి మొదటివారంలో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ తెలిపారు. -
Andhra Pradesh: వరి బదులు ‘సిరి’
సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతన్నలకు అవగాహన కల్పించడంతో పాటు తగిన తోడ్పాటు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం లభించేలా చూడాలని పేర్కొన్నారు. వరి పండిస్తే వచ్చే ఆదాయం చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు రైతులకు కూడా దక్కేలా చూడాలని, ఇందుకోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలని నిర్దేశించారు. చిరుధాన్యాలు పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా విధానాలు ఉండాలని స్పష్టం చేశారు. వెంటనే చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, ఉన్నతాధికారులు మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలి. సేంద్రీయ, ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి. రసాయన ఎరువులు, పురుగు మందుల స్థానంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించాలి. రసాయనాలు లేని సాగు పద్ధతులపై ఉత్తమ విధానాలను రూపొందించాలి. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న సీహెచ్‌సీల్లో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలి. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ ఇచ్చే వ్యవస్థ రావాలి. కల్తీకి పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష.. రైతులకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు చేపట్టాలి. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేద్దాం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొద్దాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలన్న సదుద్దేశంతో ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. ఎవరైనా వీటిని నీరుగార్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ వ్యవహారాల్లో ఎవరైనా ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడమే కాకుండా చట్టం ముందు నిలబెడతాం. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తాం. రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు. డిమాండ్ మేరకు విత్తనాలు సరఫరా చేయాలి. రైతుల సంఖ్యను బట్టి పరికరాలు కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పరికరాలపై హేతుబద్ధత ఉండాలి. రైతుల సంఖ్య, సాగు చేస్తున్న భూమి, పంటల ఆధారంగా హేతుబద్ధతతో పరికరాలను అందుబాటులోకి తేవాలి. దీనిపై మ్యాపింగ్ చేయాలి. సేంద్రియ దాణా పశువులకు సేంద్రియ దాణా (ఆర్గానిక్ ఫీడ్) అందుబాటులో ఉంచాలి. ఆర్గానిక్ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలి. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి పెట్టి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలి. 1.12 కోట్ల ఎకరాలు ఇ–క్రాపింగ్ ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాల్లో పంటలు ఇ–క్రాప్‌లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 45,35,102 మంది రైతులు ఇ– క్రాపింగ్ చేసుకున్నట్లు చెప్పారు. రబీలో ఇ– క్రాప్ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మంది మహిళలకు ప్రయోజనం చేకూరింది. సగటున రోజువారీ పాల సేకరణ గతేడాది నవంబర్‌లో 2,812 లీటర్లు కాగా ఈ ఏడాది 71,911 లీటర్లకు చేరుకుంది. ఇప్పటివరకూ 1.32 కోట్ల లీటర్ల పాలు కొనుగోలు చేశారు. కృష్ణా, అనంతపురం జిల్లాల్లో డిసెంబరులో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం కానుంది. సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్‌ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్టారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ఎంకే మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఏ.బాబు, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మల్టి ‘ఫుల్’ జోష్
సాక్షి, మంచిర్యాల: వరి వేస్తే కొంటారో కొనరో తెలియదు. కొన్నా పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని భయం. పత్తి పండిస్తే తెగుళ్ల బెడద. సమయానికి కూలీలు ఉంటారో లేరోనని ఆందోళన. ఈ కష్టాల నుంచి గట్టేక్కేందుకని ఉమ్మడి ఆదిలాబాద్ రైతులు ఒకసారి ప్రత్యామ్నాయ పంటలు వేసి చూశారు. అంతే.. మునుపటి పంటలతో పోలిస్తే మంచి లాభాలు రావడంతో వెనక్కి చూడలేదు. మిశ్రమ పంటలు వేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కూరగాయలు, పండ్లు, పూలు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వ విధానాలెలా ఉన్నా మార్కెట్‌ను తట్టుకొని నిలబడుతున్నారు. కొందరైతే డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ లాంటి పంటలూ పండించడం మొదలుపెట్టారు. కూరగాయలతో రోజూ ఆదాయం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తాటిగూడెంకు చెందిన శ్రీనివాస్ తన రెండెకరాల భూమిలో వానాకాలంలో వరి పంట సాగు చేస్తున్నాడు. యాసంగిలో వరి కాకుండా రకరకాల ఆహార పంటలేస్తున్నాడు. ఎకరా భూమిలో పాలిహౌస్‌ను ఏర్పాటు చేశాడు. అంతర పంటల సాగు , పంట మార్పిడి పద్ధతితో రోజువారీగా ఆదాయాన్నీ పొందుతున్నాడు. ప్రతి ఏడాది యాసంగిలో సుమారు రూ. 2.55 లక్షలకు పైబడి సంపాదిస్తున్నాడు. టమాట సాగు ద్వారా రూ.18,500, మిరప నుంచి రూ.14,500, క్యాబేజీతో రూ.14,000 కాకర, బీరతో రూ.53,000, దోసతో రూ.15,000 వరకు ఆర్జిస్తున్నాడు. వీటితోపాటు పాలు, గుడ్లు, పశుపోషణతో మరో రూ.1.36,000 పొందుతున్నాడు. ఖాళీ ఉంటే పంట వేయడమే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారంకు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ తన పదెకరాల భూమిలో విభిన్న పంటలు వేస్తున్నాడు. ఐదెకరాల్లో మామిడి, నాలుగెకరాల్లో వరి, ఎకరంలో కంది, మిర్చి, వంకాయ, టమాటతో పాటు మొత్తం 25 రకాల మిశ్రమ కూరగాయాలు పండిస్తున్నాడు. పొలం గట్టుల చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, పనాస, అల్లనేరేడు, ఆపిల్ బేర్, చింతతో పాటు అనేక రకాలు మొక్కలు నాటాడు. బంతి పూలూ సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు పోను మార్కెట్లోను సేంద్రియ పండ్లను అమ్ముతున్నాడు. ఈ యాసంగిలో కొత్తగా కుసుమ సాగుకు సిద్ధమయ్యాడు. సేంద్రియ సాగు కాబట్టి కూరగాయాలకు, పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. డిమాండ్‌ను బట్టి పంటలను మార్చుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్.. 30 ఏళ్లదాకా పండ్లే పండ్లు మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన జాడి సాయితేజ, విశ్వతేజ ఓవైపు చదువుకుంటూనే వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. తండ్రి రాజలింగు అకాల మరణంతో డ్రాగన్ ఫ్రూట్ పండించాలనే ఆయన కలను కొడుకులు సాకారం చేస్తున్నారు. వారికున్న భూమిలో రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అధ్యయనం చేసి మరీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కిలో రూ.150 నుంచి 200 పలుకుతోంది. సేంద్రియ పద్ధతిలో పండిస్తే నగరాల్లో మరింత డిమాండ్ ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి ఎక్కువకాలం సాగు చేసుకోవచ్చు. ఒకసారి విత్తుకుంటే 30 ఏళ్ల పాటు ఫలాలనిస్తాయి. సంప్రదాయ పంటలకు పూర్తిగా భిన్నమైన పంట డ్రాగన్ ప్రూట్. వరికి మించి లాభం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రా మానికి చెందిన గట్టు భీమా గౌడ్ వరి పంటకు పరిమి తం కాకుండా వాణిజ్య పం టలైన మిరప,మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మూడెకరాల్లో వరి, 4 ఎకరాల్లో పత్తితో పాటు ఎకరం మిరప తోట, అరెకరం మొక్కజొ న్న, మరో అరెకరంలో కూరగాయల సాగు చేస్తున్నాడు. మిర్చి, మొక్కజొన్న, కూరగాయల సాగు లో ఎకరాకు వరి కన్నా రూ.20 వేలు పైనే లాభం వస్తోందని చెబుతున్నాడు. సొంతూరితో పాటు చుట్టుపక్కల ప్రజలూ మిర్చి, కూరగాయలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేస్తుండటంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. చుట్టూ సోయా.. మధ్యలో కంది పత్తి సాగు చేస్తే గులాబీ పు రుగు ఉధృతి, తెగుళ్లతో ది గుబడి రావట్లేదు. పైగా కూలీల కొరత. అందుకే సో యా, కంది పంటలను సా గు చేస్తూ లాభాలు పొందు తున్నాడు ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన యువ రైతు సామ రాహు ల్ రెడ్డి. తనకున్న 8 ఎకరాల్లో సోయా, అందులో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నాడు. సోయా సాగుకు ఖర్చు ఎక్కువేం లేదు. యాసంగిలో సాగు చేసిన సోయా, కంది పూర్తయ్యాక రబీలో జొన్న, పెసర పంటలనూ సాగుచేస్తున్నాడు. ప్రస్తుత యాసంగిలో సోయా 65 క్వింటాళ్లు వచ్చిందని రాహుల్ రెడ్డి చెప్పాడు. -
200 ఏళ్ల క్రితమే మారు పంటలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండొందల ఏళ్ల కిందటే రైతులు అద్భుతంగా ప్రత్యామ్నాయ పంటల పద్ధతి పాటించారు. భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానం అనుసరించారు. నీరు పొదుపుగా వాడుకునే ప్రాంతాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో 8 నాగళ్లుంటే మోతుబరి రైతు అనేవారు. ఆ కాలంలో అదో స్టేటస్ సింబల్. ఆ సమయంలో మణుగు వరి విత్తనాల సాగుకు రూ.6 ఖర్చయ్యేది. అప్పట్లో వ్యవసాయంలో మార్పులు జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసిన బ్రిటిష్ పరిశోధకుడు డాక్టర్ ఎ. వాకర్ వివరించారు. ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ సర్కార్ ఆఫ్ వరంగల్’ పేరుతో మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ మేగజైన్లో ఇవన్నీ ప్రచురితమయ్యాయి. దీన్ని పుదుచ్చేరి–కంచి–మామునివర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీజీ స్టడీస్ అండ్ రీసెర్చ్ హిస్టరీ విభాగాధిపతి రామచంద్రారెడ్డి సేకరించి భద్రపరిచారు. నీరున్నా.. లేకున్నా.. తెలంగాణ ప్రాంతంలో వరే ప్రధాన పంట. నీటి లభ్యత బాగున్న ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపేవారు. అయినా అటు వరి వేస్తూనే తదుపరి కాలానికి భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానాన్ని అనుసరించారని బ్రిటిష్ పరిశోధకుడి అధ్యయనంలో తేలింది. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో అటు వానలు, ఇటు చెరువులే ప్రధాన నీటి వనరు. ఫలితంగా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యం ఉండేది. రెండు శతాబ్దాల క్రితమే ఈ తీరు కనిపించింది. వరి సాగులో ఇబ్బందులు, పరిమితుల వల్ల కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించటం విశేషం. వెరసి ఇటు వరి, అటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు కలిసి ఈ ప్రాంత పంట సాగులో ప్రత్యేకత తీసుకొచ్చాయి. పంట మార్పిడి ఇలా.. రాష్ట్రంలో రకరకాల స్వభావాలున్న నేలలున్నాయి. వీటి సారాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పంట మార్పిడి విధానం అనుసరించారు. నీటి లభ్యత కూడా దీనికి మరో ప్రధాన కారణమైంది. ఎర్ర నేలల్లో మొదటి సంవత్సరం పచ్చ జొన్నలు వేసేవారు. రెండో సంవత్సరం ఆముదం, పెసర, పత్తి పండించేవారు. మూడో సంవత్సరం పచ్చ జొన్నలు లేదా ఇతర చిరు ధాన్యాలు సాగు చేసేవారు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ ఈ సైకిల్ మొదలు. ఇలా ఏడెనిమిదేళ్లు కొనసాగించేవారు. ఇక నల్ల నేలల్లో తొలి సంవత్సరం రబీ పంటగా తెల్ల జొన్నలు లేదా నల్ల పెసర్లు వేసేవారు. రెండో ఏడాది పునాస పంటగా చిరు ధాన్యాలు, పచ్చ జొన్న పండించేవారు. మూడో సంవత్సరం రబీలో ఆముదం, పెసర్లు, పత్తి సాగు చేసేవారు. నాలుగో ఏడాది పునాసగా పచ్చ, ఎర్ర జొన్న, కందులు లాంటివి వేసేవారు. కమలాపూర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో తమలపాకు, బెల్లంకొండ ప్రాంతంలో చెరుకు బాగా సాగయ్యేది. ప్రత్యామ్నాయ పంటలుగా పచ్చ, ఎర్ర, తెల్ల, నల్ల జొన్నలు, సజ్జలు, కొర్రలు, బూర సామలు, పొట్ట సామలు, అరికెలు, వరికెలు, గోధుమ, మొక్కజొన్న, పెసర్లు, బొబ్బర్లు, అనుములు, ఉలువలు, కందులు, శనగలు వేసేవారు. రూ.20 మిగిలితే మంచి దిగుబడి నాగళ్ల సంఖ్య ప్రకారం అప్పట్లో రైతు స్థాయిని నిర్ధారించేవారు. 2 నాగళ్లుంటే సాధారణ రైతు అనేవారు. రెండో నాగళిని కూడా సమకూర్చుకోకపోతే పేద రైతుగా పేర్కొనేవారు. 4 నాగళ్లుంటే పెద్ద రైతుగా భావించేవారు. జమీందారులు, దొరలు, పట్వారీలు, పోలీసు, మాలీ పటేళ్లు లాంటి కొందరికి 8 నాగళ్లుండేవి. వీరిని ధనిక రైతులనేవారు. 8 నాగళ్లుండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవారు. రెండు జతల నాగళ్లకు రూ.100, జత ఎడ్లు సమకూర్చుకోవాలంటే రూ. 50 ఖర్చయ్యేది. సాగులో రూ.20 మిగిలితే మంచి దిగుబడిగా భావించేవారు. ఈ భరోసా వరి ద్వారానే వచ్చేదని బ్రిటిష్ పరిశోధకుడు పేర్కొన్నారు. రూ.60 నుంచి రూ.80 వస్తే ధనిక రైతుగా గుర్తింపు దక్కేది. ఓ మణుగు (దాదాపు 38 కిలోలు) వరి విత్తనాల సాగు ఖర్చు ఇలా.. ♦మొత్తం వ్యయం రూ.6 ♦ఇందులో విత్తనాల ఖర్చు రూ.2, మహిళా కూలీల వ్యయం 14 అణాలు, నీటిని పెట్టేందుకు ఖర్చు 8 అణాలు, పంట కోత సమయంలో మొత్తం వ్యయం 2 రూపాయల 8 అణాలు, ఇతర ఖర్చులు 2 అణాలు. ♦ఈ పరిమాణంలో సాగు చేస్తే సాధారణ పరిస్థితుల్లో దిగుబడి విలువ 8 రూపాయల 8 అణాలు. అంటే మిగులు 2 రూపాయల 8 అణాలు -
ఏ పంట వేస్తే ఎంత లాభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసేలా.. వారిని ప్రత్యా మ్నాయ పంటలవైపు మళ్లించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వరి కోత లన్నీ పూర్తవుతాయని, యాసంగికి ఏర్పాట్లు జరుగుతుండ గానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వరికి బదులు ఇతర పంటలు వేయాల్సిన ప్రాధాన్యం గురించి చెప్పాలని నిర్ణయిం చింది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహించాలో ఇంకా ఖరారు కాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించే సద స్సుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవ డం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరి స్తారు. మద్దతు ధర, మార్కెట్లో డిమాండ్ వంటి అంశాలను తెలియజెప్పి రైతులకు భరోసా కల్పించాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో మినుములకు బాగా డిమాండ్ ఉంది. దేశంలో ఆహార భద్రతను అంచనా వేసే సెంట్రల్ పూల్ వ్యవస్థ ఉంది. దాని ప్రకారం అవసరమైనన్ని మినుములు సెంట్రల్ పూల్‌లో లేవు. కాబట్టి మినుములను కొనుగోలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. మద్దతు ధరకే కాకుండా, అవసరమైతే మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత ధరకు మినుములు కొనుగోలు చేయాలని ఆదేశించింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 కాగా, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు రూ.7 వేల వరకు కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.7 వేలైనా సరే కొనాలని కేంద్రం ఆదేశించింది. అంటే ఇక నుంచి మార్క్‌ఫెడ్ కూడా రూ.7 వేలు లేదా మార్కెట్లో అప్పుడున్న ధరలను బట్టి మినుములు కొనుగోలు చేస్తుంది. ఒకవేళ మద్దతు ధర కంటే మార్కెట్లో ధర తక్కువుంటే, మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. కాగా, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అయ్యే ఖర్చు, రాబడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక తయారు చేసింది. వరి బదులు ఏయే పంటలు సాగు చేస్తే ఎంత లాభం వస్తుందనే దానిపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సహకారంతో పంటల వారీగా పెట్టుబడి, లాభాల తీరును నివేదికలో పొందుపర్చింది. ప్రత్యామ్నాయ పంటల్లో ఆవాలకు ఎక్కువ లాభాలు వస్తున్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తర్వాత అధిక లాభాలు వచ్చే వరుసలో మినుములు, శనగ, నువ్వుల పంటలున్నాయి. అతి తక్కువ లాభం వచ్చే కేటగిరీలో కుసుమ పంట ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జోన్లవారీగా పంటలు... జోన్ల వారీగా ఏ పంటలను సాగు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ గతంలోనే అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఆయా జోన్లలోని రైతులను స్పెషల్ డ్రైవ్‌లో సన్నద్ధం చేస్తారు. ఉత్తర తెలంగాణ జోన్ కింద ఉన్న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వరికి బదులు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు. సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో వరి స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయిస్తారు. దక్షిణ తెలంగాణ జోన్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో వరికి బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయా జిల్లాల్లో మిగిలిన ప్రత్యామ్నాయ పంటలను కూడా రైతులకు సూచిస్తారు. -
మెతుకు కరువే..!
ఆదోని: తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టు భూములకు సక్రమంగా సాగు నీరందక పోవడంతో రైతులు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వరి పంటకు బదులుగా పత్తి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో బియ్యం కొరత ఏర్పడి ధర అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగువ కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో మొత్తం లక్షా 51 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఖరీఫ్‌లో 49వేల ఎకరాలు, రబీలో లక్షా ఒక వెయ్యి ఎకరాలు గుర్తించారు. ఖరీఫ్, రైతులు కాలువ కింద వరి పంట సాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌లో మొత్తం భూముల్లో వరి పంట సాగు అవుతోంది. రబీలో సగానికి పైగా వరి పంటను సాగు చేస్తారు. అయితే కర్ణాటక ప్రాంతంలో దిగువ కాలువ నీటిని నానాయకట్టుకు మళ్లించుకోవడంతో ఆయకట్టు భూములకు సాగు నీటి కొరత ఏర్పడుతోంది. ఏటా 30 నుంచి 50 వేల ఎకరాలకు సరిపోయే 3 నుంచి 5 టీఎంసీల నీరు దారి మళ్లుతున్నట్లు అంచనా. రాష్ట్ర వాటా కింద రావాల్సిన నీరు రాక పోవడంతో మొత్తం ఆయకట్టులో ఏటా 40 వేల నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు. దీంతో 90 వేల నుంచి లక్షా పది వేల ఎకరాల వరకు ఎంతో విలువైన ఆయకట్టు భూములు వర్షాధార భూములుగా మారుతున్నాయి. సాగు అవుతున్న భూములకు కూడా కీలక దశలో నీటి కొరత మరింత తీవ్రం అయి వరి పంట దెబ్బ తింటోంది. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టక ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కాలువ కింద ఏటేటా వరి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ ఏడు ఖరీఫ్‌లో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే సాగు నీరు అందుతుందో లేదోనన్న ఆనుమానంతో రైతులు ఇప్పటికేతమ ఆయకట్టు భూములలో ప్రత్యమ్నాయ పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా పత్తి పంట సాగు చేశారు. ఒకటి రెండు తడులు సాగు నీరు అందక పోయినా వరియేతర పంటలు తట్టుకుంటాయి, దీంతో రైతుల ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించారు. పొంచి ఉన్న బియ్యం కొరత ముఖ్యంగా బియ్యం కొరత తీవ్రం అయి ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో నాణ్యతను బట్టి క్వింటాలు రూ.4800 నుంచి రూ.5200 వరకు పలుకుతున్నాయి. స్థానికంగా పండుతున్న సోనా మసూరి బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విస్తీర్ణం తగ్గిపోవడంతో బియ్యం మరింత ప్రియమై ధరపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.