Andhra Pradesh: వరి బదులు ‘సిరి’ | CM YS Jagan High level review on agricultural allied sectors | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వరి బదులు ‘సిరి’

Published Tue, Dec 7 2021 2:37 AM | Last Updated on Tue, Dec 7 2021 7:56 AM

CM YS Jagan High level review on agricultural allied sectors - Sakshi

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు

సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతన్నలకు అవగాహన కల్పించడంతో పాటు తగిన తోడ్పాటు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం లభించేలా చూడాలని పేర్కొన్నారు. వరి పండిస్తే వచ్చే ఆదాయం చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగు రైతులకు కూడా దక్కేలా చూడాలని, ఇందుకోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలని నిర్దేశించారు. చిరుధాన్యాలు పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా విధానాలు ఉండాలని స్పష్టం చేశారు. వెంటనే చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, ఉన్నతాధికారులు 

మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు
మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలి. సేంద్రీయ, ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి. రసాయన ఎరువులు, పురుగు మందుల స్థానంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించాలి. రసాయనాలు లేని సాగు పద్ధతులపై ఉత్తమ విధానాలను రూపొందించాలి. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న సీహెచ్‌సీల్లో కూడా ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలి. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చే వ్యవస్థ రావాలి. 

కల్తీకి పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష..
రైతులకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు చేపట్టాలి. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేద్దాం. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొద్దాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలన్న సదుద్దేశంతో ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. ఎవరైనా వీటిని నీరుగార్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ వ్యవహారాల్లో ఎవరైనా ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడమే కాకుండా చట్టం ముందు నిలబెడతాం. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తాం. రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు. డిమాండ్‌ మేరకు విత్తనాలు సరఫరా చేయాలి.

రైతుల సంఖ్యను బట్టి పరికరాలు
కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో పరికరాలపై హేతుబద్ధత ఉండాలి. రైతుల సంఖ్య, సాగు చేస్తున్న భూమి, పంటల ఆధారంగా హేతుబద్ధతతో పరికరాలను అందుబాటులోకి తేవాలి. దీనిపై మ్యాపింగ్‌ చేయాలి. 

సేంద్రియ దాణా 
పశువులకు సేంద్రియ దాణా (ఆర్గానిక్‌ ఫీడ్‌) అందుబాటులో ఉంచాలి. ఆర్గానిక్‌ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలి. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. ఆర్గానిక్‌ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి పెట్టి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలి. 

1.12 కోట్ల ఎకరాలు ఇ–క్రాపింగ్‌
ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాల్లో పంటలు ఇ–క్రాప్‌లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 45,35,102 మంది రైతులు ఇ– క్రాపింగ్‌ చేసుకున్నట్లు చెప్పారు. రబీలో ఇ– క్రాప్‌ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మంది మహిళలకు ప్రయోజనం చేకూరింది. సగటున రోజువారీ పాల సేకరణ గతేడాది నవంబర్‌లో 2,812 లీటర్లు కాగా ఈ ఏడాది 71,911 లీటర్లకు చేరుకుంది. ఇప్పటివరకూ 1.32 కోట్ల లీటర్ల పాలు కొనుగోలు చేశారు. కృష్ణా, అనంతపురం జిల్లాల్లో డిసెంబరులో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం కానుంది.

సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్టారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, పుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి ఎంకే  మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ.బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement