రైతు భరోసా నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి 50.58 లక్షల రైతుల కుటుంబాలకు రూ.1,036 కోట్లను ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
తాజాగా జమ చేసిన నగదుతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్నదాతలకు రైతు భరోసా కింద రూ.19,813 కోట్లు ఇచ్చినట్లైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులెన్ని ఉన్నా ఇచ్చిన మాట మేరకు సంక్రాంతికి ముందు ఒక్కో రైతు ఖాతాకు రైతు భరోసా కింద రూ.2000 చొప్పున ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎక్కడా లేనివిధంగా..
సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసా, విత్తనం నుంచి విక్రయాల వరకు సేవలందించేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధరలతో పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకం, రెండు లక్షల బోర్లు లక్ష్యంగా అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరు, మోటార్ అందించేందుకు వైఎస్సార్ జలకళ లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా గత రెండున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.86,313 కోట్లు వ్యయం చేసింది.
చెప్పిన దానికన్నా మిన్నగా..
చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సాయం అందిస్తోంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అన్నదాతలకు సాయంగా అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 మేర రైతన్నలకు ప్రయోజనం చేకూరుస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ.17,500. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 అందచేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500 చొప్పున, రెండో విడతగా అక్టోబర్‌లో పంట కోతల వేళ రబీ అవసరాల కోసం రూ.4,000, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో మూడో విడతగా రూ.2,000 చొప్పున సాయం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment