సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో గత మూడేళ్ల కంటే మిన్నగా దిగుబడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు. ఈ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్‌లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది.
మేలు చేస్తున్న వర్షాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ప్రారంభమైంది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా మినహా సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1 శాతం అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3 శాతం అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మొక్క నిలదొక్కుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరుకుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు.
సమృద్ధిగా ఎరువుల నిల్వలు
ఈ సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు ç3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.50 కోట్ల విలువైన పురుగుల మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది.
గతేడాది కంటే మిన్నగా సాగు
ఇక సాగు నీటి విడుదల, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగు జోరు పెంచారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు కాగా, జూలై మూడో వారం ముగిసే నాటికి 26.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 25 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 8.30 లక్షల ఎకరాల్లో పత్తి, 5.6 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.32 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి.
ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు
ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు.
ఈసారి అప్పు చేయాల్సిన అవసరం లేదు
నాకు మూడెకరాల సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తున్నా. రైతు భరోసా కింద æరూ.7,500, పంట బీమా పరిహారంగా రూ.18 వేలు వచ్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో చిన్న ట్రాక్టరుకు రూ.70 వేలు సబ్సిడీ అందింది. ఈసారి సాగుకు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. మంచి వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేశాను.
– సానబోయిన శ్యామసుందర్, కొత్తపేట, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నా
నాకు 12 ఎకరాల పొలం ఉంది. ఎంటీయూ 1061 రకం వరి వేశాను. మాను దశలో ఉంది. పెట్టుబడి సాయం, పంటల బీమా చేతికొచ్చింది. పెట్టుబడికి ఇబ్బంది లేదు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నా.
– జి.శ్రీనివాసరావు, ఎస్‌ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం జిల్లా
సాగు ఊపందుకుంటోంది
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. నెలాఖరుకు కనీసం 50 శాతం దాటే అవకాశాలున్నాయి. విత్తనాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రికార్డు స్థాయిలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ జోరుగా సాగుతోంది.
– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment