ఖరీఫ్.. సాగు బాగు | Kharif already has crops on above 30 lakh hectares | Sakshi
Sakshi News home page

సాగు బాగు

Published Thu, Sep 3 2020 3:46 AM | Last Updated on Thu, Sep 3 2020 8:10 AM

Kharif already has crops on above 30 lakh hectares - Sakshi

సాక్షి, అమరావతి: పుడమి తల్లికి పచ్చని తివాచీ పరిచినట్లుగా ఖరీఫ్‌ సాగు జోరుగా సాగుతోంది. తొలకరి పలకరించిన నాటి నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలలో వర్షపాతం సాధారణానికి మించి నమోదైంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 37.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 30.88 లక్షల హెక్టార్లలో(83 శాతం) పంటలు సాగవుతున్నాయి. ఈనెలాఖరు వరకు గడువున్నందున ఈ ఏడాది లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ చర్యలు, ముందుగానే అందిన వైఎస్సార్‌ రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా మేలైన విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతన్నలు హుషారుగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.

రికార్డు స్థాయిలో నూనెగింజల సాగు..
► ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు లక్ష్యం 14.97 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 12.20 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 11.40 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది.

► సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 20.76 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 16.03 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. గతేడాది కంటే లక్ష హెక్టార్లలో సాగు పెరిగింది. 

► నూనె గింజల సాగు లక్ష్యం 7.66 లక్షలహెక్టార్లు కాగా ఇప్పటికే 7.84 లక్షల హెక్టార్లకు చేరింది. 7.50 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగులో ఉంది.

► పత్తి సాగు విస్తీర్ణం 6.08 లక్షల హెక్టార్లు కాగా 5.54 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు.

► మిర్చి, ఉల్లి, పసుపు సాగు ఊపందుకుంది. సీజన్‌ ముగిసే నాటికి లక్ష్యానికి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

► కొన్ని పంటలకు అక్కడక్కడ తెగుళ్లు సోకినట్లు గుర్తించడంతో నివారణకు గన్నవరంలోని వ్యవసాయ సమగ్ర కాల్‌ సెంటర్‌ ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నారు. నాగార్జున సాగర్‌ కుడి కాలువ కింద సుమారు పది లక్షల ఎకరాలలో ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు వేయనున్నారు.

ఎరువుల కొరత లేదు..
‘రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో 11.54 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 12.01 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 7.83 లక్షల టన్నుల నిల్వలున్నాయి. యూరియా 2.37 లక్షల టన్నులు, డీఏపీ 91వేల టన్నులు, మ్యూరేట్‌ పొటాషియం 74 వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 6 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 3.09 లక్షల టన్నులు, ఇతర ఎరువులు 6 వేల టన్నులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 2.71 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించి కేంద్ర ఎరువులు, రసాయన శాఖ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’
– హెచ్‌.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌  

వర్షపాతం ఇలా
► ఖరీఫ్‌ సీజన్‌లో కురవాల్సిన వర్షం 556 మిల్లీమీటర్లు 
► ఇప్పటికి కురవాల్సిన వర్షం 412.5 మీల్లీమీటర్లు 
► ఇప్పటిదాకా కురిసిన వర్షం 491.7 మిల్లీ మీటర్లు 
► ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు మిగులు వర్షపాతంలో ఉన్నాయి.  
► విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా స్వల్ప లోటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement