సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవుల గోపిరెడ్డికి రెండేళ్లపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయం జమయ్యింది. ఏడాది కాలంగా ఆ మొత్తం జమ కావడం లేదు. ఆరా తీస్తే ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కాలేదని చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎన్‌పీసీఐ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం లేదు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన కోనేటి రెడ్డప్పకు కూడా గత రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం జమ కాలేదు. పరిశీలిస్తే ఆధార్ ఫెయిల్యూర్ అని వస్తోంది. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన యు.వరహాలమ్మకు ఈ ఏడాది మూడో విడత సాయం జమ కాలేదు. పరిశీలిస్తే బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా నమోదైనట్టు చూపిస్తోంది. ఇలా లక్షలాది మంది వివిధ కారణాలతో పీఎం కిసాన్ సాయానికి దూరమవుతున్నారు. కొంతమందికి ఏటా మూడు విడతల్లోనూ పెట్టుబడి సాయం జమ కావడం లేదు. మరికొంత మందికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జమవుతోంది.
13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్
విడతకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. కేవలం పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతో పాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే, వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యలన్నిటినీ ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. పెండింగ్ దరఖాస్తుల డేటాను మండల వ్యవసాయాధికారులతో పాటు రైతు భరోసా కేంద్రాలకు కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడతారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్ పోర్టల్‌లో తగిన వివరాలను అప్‌లోడ్ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా ఎన్‌పీసీఐ పోర్టల్‌తో మ్యాపింగ్ చేయించేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కేటగిరీల వారీగా పెండింగ్ ఇలా..
లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్‌దారు ఉండటం వంటి కారణాలతో 3,11,158 మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్ పోర్టల్ అనుసంధానం కాలేంటూ 5,32,145 మందికి, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సమస్యలతో 2.05 లక్షల మందికి, ఆదాయ పన్ను చెల్లింపుదారులంటూ 99,106 మందికి, ఆధార్ విఫలం, అప్‌డేట్ చేయటం వంటి కారణాలతో 97,215 మందికి, ఆర్‌టీజీఎస్/ఎన్‌ఐసీ సమస్యలతో 76,743 మందికి, చనిపోయిన కారణంతో 25,626 మందికి, అకౌంట్ బ్లాక్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా నమోదైన కేటగిరీలో 13 వేల మందికి, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలున్నాయనే కారణంతో 8166 మందికి, ఇతర కారణాలతో 7,645 మందికి పీఎం కిసాన్ సాయం అందడం లేదని గుర్తించారు. వీరిలో 10 నుంచి 20 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం జమవుతోంది.
సద్వినియోగం చేసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. ఈ నెల 24వ తేదీలోగా పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించి సాధ్యమైనంత ఎక్కువ మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటాం.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment