సాక్షి, అమరావతి: కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన అత్యాధునిక యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 50% సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనుంది.
రూ.2,016 కోట్ల అంచనా వ్యయంతో..
రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల (రూ.6 లక్షలు సబ్సిడీ) విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల (రూ.10 లక్షలు సబ్సిడీ) అంచనా వ్యయం కాగల కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల విలువైన 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. వీటికి అదనంగా త్వరలో రైతన్నలకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
1.80 లక్షల మందిని సర్వే చేసి..
రైతులకు ఏ పరికరాలు అవసరమో గుర్తించేందుకు ఆర్బీకే స్థాయిలో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి 20 మంది చొప్పున రాండమ్‌గా 1.80 లక్షల మందిని సర్వే చేసి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 34 శాతం మంది.. పీపీ ఎక్విప్‌మెంట్స్ (నాప్‌సాక్, తైవాన్, పూట్ బూమ్ తదితర కంపెనీలకు చెందిన స్ప్రేయర్లు), 25 శాతం మంది.. టార్పాలిన్స్, 15 శాతం మంది.. భూమి చదును యంత్రాలు (కల్టివేటర్స్, ఎంబీ ప్లాఫ్, లెవెలింగ్ బ్లేడ్, డిస్క్ ప్లో, డిస్క్ పడ్లెర్, రోటో పడ్లెర్ తదితర), 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ (పవర్ టిల్లర్, పవర్ వీడర్, క్రాప్ రేపర్, బ్రష్ కట్టర్, చాప్ కట్టర్), 9 శాతం మంది.. రోటోవేటర్స్, 4 శాతం మంది.. సీడింగ్ పరికరాలు (సీడింగ్ డ్రిల్, సీడ్ కమ్ పెర్ట్ డ్రిల్, డ్రమ్ సీడర్), ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్‌మెంట్ కావాలని కోరారు.
50 శాతం సబ్సిడీపై పరికరాలు
రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైన యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామానికి 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైనవి 2 యూనిట్ల చొప్పున 50 శాతం సబ్సిడీపై మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యూనిట్లను అందించడానికి రూ.403 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
అర్హుల గుర్తింపు పూర్తికాగానే అమలుకు చర్యలు..
గత మూడేళ్లలో గ్రామ, క్లస్టర్ స్థాయిలో రైతు కమిటీలతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అందించాం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీహెచ్‌సీలతో పాటు వ్యక్తిగతంగా రైతులకు పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అర్హుల గుర్తింపు కోసం విధివిధానాల రూపకల్పన పూర్తి కాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం.
–కాకాని గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment