
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అధిక మొత్తంలో ఎరువులు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. స్థానిక విత్తన పరీక్ష కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 23.45 లక్షల టన్నుల అన్ని రకాల ఎరువులను రబీ సీజన్‌కు కేటాయించిందన్నారు.
వీటిలో తొమ్మిది లక్షల టన్నుల ఎరువులను ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటి అవసరాలను ముందుగానే గుర్తించి రైతాంగానికి అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. కొరతపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మి ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టుకోవద్దని అరుణ్‌కుమార్ చెప్పారు.