సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 5,177 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ప్రారంభిస్తోంది. రైతుల కమిటీలతో కూడిన ఈ సీహెచ్‌సీల ద్వారా ఆ ప్రాంత రైతులకు ఎక్కువ ఏ యంత్ర పరికరాలు అవసరమో వాటిని అందిస్తారు.
ఇందులో భాగంగా తొలిసారిగా ప్రభుత్వం ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను అందుబాటులోకి తెస్తోంది. మంగళవారం (7వ తేదీ) గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీటి పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు.
చిన్న, సన్నకారు రైతుల కోసం
వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చిన్న, సన్నకారు రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో రూ.1,612.50 కోట్లతో 10,750 సీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా సాగయ్యే ఎనిమిది (ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల్లో క్లస్టర్ స్థాయిలో రూ.403.75 కోట్లతో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెస్తోంది. ఈ మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. రైతు కమిటీలు పది శాతం , మిగిలిన 50 శాతం ఆప్కాబ్ ద్వారా రుణంగా అందిస్తున్నారు.
ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల చొప్పున ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో రూ.163.70 కోట్లతో 3,624 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.17.75 కోట్లతో 71 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.65.06 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించింది. మిగిలిన మొత్తంలో రూ.25.66 కోట్లు రైతు కమిటీలు సమకూర్చుకోగా, రూ.90.72 కోట్లు రుణంగా అందించారు.
నాలుగో విడతలో 5,177 సీహెచ్‌సీలు
నాలుగో విడతలో రూ.470 కోట్ల అంచనా వ్యయంతో 5,177 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ట్రాక్టర్లతో కూడిన ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు 3,800 ఉంటాయి. హార్వెస్టర్లతో కూడినవి 320 క్లస్టర్ స్థాయిలో ఉన్నాయి. ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలతో ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు మరో 1,057 ఏర్పాటు చేస్తున్నారు. వ్యయంలో రూ.170 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగిలిన మొత్తంలో 10 శాతం రైతు కమిటీలు, మిగిలినది బ్యాంకుల నుంచి రుణం రూపంలో అందిస్తున్నారు.
ప్రతి సీహెచ్‌సీకి ఓ ట్రాక్టర్
ఆర్బీకే స్థాయిలో ప్రతి సీహెచ్‌సీకి ఓ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం ఏడుకు పైగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వందకు పైగా మోడళ్లు ఉంటాయి. హార్స్ పవర్‌ను బట్టి రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ విలువలో 40 శాతం (రూ.2లక్షల నుంచి రూ.3.4లక్షల) వరకు సబ్సిడీగా అందిస్తున్నారు. తొలి విడతగా మండలానికి కనీసం ఆరు చొప్పున 3,800 ట్రాక్టర్లను ఇస్తారు. కంబైన్డ్ హార్వెస్టర్ల మాదిరిగానే ఈ ట్రాక్టర్లకు కూడా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను అమర్చుతున్నారు.
రైతుల వెతలు తీర్చేందుకే
విత్తు నుంచి కోతల వరకు కూలీల కోసం రైతులు పడుతున్న ఇక్కట్లకు తెరదించేందుకే గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను తీసుకొస్తోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆర్బీకేలోనూ ఓ ట్రాక్టర్ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే తొలి విడతగా 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేయబోతున్నాం. 320 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు, ఇతర పరికరాలతో మరో 1,057 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. మెగా మేళా రూపంలో రాష్ట్రస్థాయిలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
– వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment