మల్టి ‘ఫుల్‌’ జోష్‌ | Telangana: Adilabad Farmers Getting Profit In Vegetable Alternative Crops | Sakshi
Sakshi News home page

మల్టి ‘ఫుల్‌’ జోష్‌

Published Tue, Nov 30 2021 2:34 AM | Last Updated on Tue, Nov 30 2021 2:34 AM

Telangana: Adilabad Farmers Getting Profit In Vegetable Alternative Crops - Sakshi

సాక్షి, మంచిర్యాల: వరి వేస్తే కొంటారో కొనరో తెలియదు. కొన్నా పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని భయం. పత్తి పండిస్తే తెగుళ్ల బెడద. సమయానికి కూలీలు ఉంటారో లేరోనని ఆందోళన. ఈ కష్టాల నుంచి గట్టేక్కేందుకని ఉమ్మడి ఆదిలాబాద్‌ రైతులు ఒకసారి ప్రత్యామ్నాయ పంటలు వేసి చూశారు. అంతే.. మునుపటి పంటలతో పోలిస్తే మంచి లాభాలు రావడంతో వెనక్కి చూడలేదు.

మిశ్రమ పంటలు వేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి కూరగాయలు, పండ్లు, పూలు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వ విధానాలెలా ఉన్నా మార్కెట్‌ను తట్టుకొని నిలబడుతున్నారు. కొందరైతే డ్రాగన్‌ ఫ్రూట్, ఆయిల్‌ పామ్‌ లాంటి పంటలూ పండించడం మొదలుపెట్టారు. 

కూరగాయలతో రోజూ ఆదాయం 
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తాటిగూడెంకు చెందిన శ్రీనివాస్‌ తన రెండెకరాల భూమిలో వానాకాలంలో వరి పంట సాగు చేస్తున్నాడు. యాసంగిలో వరి కాకుండా రకరకాల ఆహార పంటలేస్తున్నాడు. ఎకరా భూమిలో పాలిహౌస్‌ను ఏర్పాటు చేశాడు. అంతర పంటల సాగు , పంట మార్పిడి పద్ధతితో రోజువారీగా ఆదాయాన్నీ పొందుతున్నాడు.

ప్రతి ఏడాది యాసంగిలో సుమారు రూ. 2.55 లక్షలకు పైబడి సంపాదిస్తున్నాడు. టమాట సాగు ద్వారా రూ.18,500, మిరప నుంచి రూ.14,500, క్యాబేజీతో రూ.14,000 కాకర, బీరతో రూ.53,000, దోసతో రూ.15,000 వరకు ఆర్జిస్తున్నాడు. వీటితోపాటు పాలు, గుడ్లు, పశుపోషణతో మరో రూ.1.36,000 పొందుతున్నాడు.  

ఖాళీ ఉంటే పంట వేయడమే 
మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం శివ్వారంకు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌ తన పదెకరాల భూమిలో విభిన్న పంటలు వేస్తున్నాడు. ఐదెకరాల్లో మామిడి, నాలుగెకరాల్లో వరి, ఎకరంలో కంది, మిర్చి, వంకాయ, టమాటతో పాటు మొత్తం 25 రకాల మిశ్రమ కూరగాయాలు పండిస్తున్నాడు. పొలం గట్టుల చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, పనాస, అల్లనేరేడు, ఆపిల్‌ బేర్, చింతతో పాటు అనేక రకాలు మొక్కలు నాటాడు.

బంతి పూలూ సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు పోను మార్కెట్‌లోను సేంద్రియ పండ్లను అమ్ముతున్నాడు. ఈ యాసంగిలో కొత్తగా కుసుమ సాగుకు సిద్ధమయ్యాడు. సేంద్రియ సాగు కాబట్టి కూరగాయాలకు, పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటోంది. డిమాండ్‌ను బట్టి పంటలను మార్చుతున్నాడు.  

డ్రాగన్‌ ఫ్రూట్‌.. 30 ఏళ్లదాకా పండ్లే పండ్లు 
మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన జాడి సాయితేజ, విశ్వతేజ ఓవైపు చదువుకుంటూనే వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. తండ్రి రాజలింగు అకాల మరణంతో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండించాలనే ఆయన కలను కొడుకులు సాకారం చేస్తున్నారు. వారికున్న భూమిలో రెండెకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అధ్యయనం చేసి మరీ సాగు చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ కిలో రూ.150 నుంచి 200 పలుకుతోంది. సేంద్రియ పద్ధతిలో పండిస్తే నగరాల్లో మరింత డిమాండ్‌ ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి ఎక్కువకాలం సాగు చేసుకోవచ్చు. ఒకసారి విత్తుకుంటే 30 ఏళ్ల పాటు ఫలాలనిస్తాయి. సంప్రదాయ పంటలకు పూర్తిగా భిన్నమైన పంట డ్రాగన్‌ ప్రూట్‌.  

వరికి మించి లాభం  
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రా మానికి చెందిన గట్టు భీమా గౌడ్‌ వరి పంటకు పరిమి తం కాకుండా వాణిజ్య పం టలైన మిరప,మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మూడెకరాల్లో వరి, 4 ఎకరాల్లో పత్తితో పాటు ఎకరం మిరప తోట, అరెకరం మొక్కజొ న్న, మరో అరెకరంలో కూరగాయల సాగు చేస్తున్నాడు.

మిర్చి, మొక్కజొన్న, కూరగాయల సాగు లో ఎకరాకు వరి కన్నా రూ.20 వేలు పైనే లాభం వస్తోందని చెబుతున్నాడు. సొంతూరితో పాటు చుట్టుపక్కల ప్రజలూ మిర్చి, కూరగాయలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేస్తుండటంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. 

చుట్టూ సోయా.. మధ్యలో కంది  
పత్తి సాగు చేస్తే గులాబీ పు రుగు ఉధృతి, తెగుళ్లతో ది గుబడి రావట్లేదు. పైగా కూలీల కొరత. అందుకే సో యా, కంది పంటలను సా గు చేస్తూ లాభాలు పొందు తున్నాడు ఆదిలాబాద్‌ జిల్లా తాంసికి చెందిన యువ రైతు సామ రాహు ల్‌ రెడ్డి.

తనకున్న 8 ఎకరాల్లో సోయా, అందులో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నాడు. సోయా సాగుకు ఖర్చు ఎక్కువేం లేదు. యాసంగిలో సాగు చేసిన సోయా, కంది పూర్తయ్యాక రబీలో జొన్న, పెసర పంటలనూ సాగుచేస్తున్నాడు. ప్రస్తుత యాసంగిలో సోయా 65 క్వింటాళ్లు వచ్చిందని రాహుల్‌ రెడ్డి చెప్పాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement