ఆదిలాబాద్ జిల్లా అడెగామ(బి)లో నీటిఎద్దడిని అధిగమించిన రైతులు
బోర్ల నుంచి సరిపడా నీళ్లు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా పెద్ద బావుల తవ్వకం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(బి) గ్రామంలో పెద్దపెద్ద బావులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరంగా.. నిండుకుండలా కనిపిస్తున్నాయి. వర్షాధారంపైనే ఆధారపడినా, వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ బావుల్లోని నీటిని మోటార్ల ద్వారా పంటలకు నీటితడులు అందిస్తామని ఆ గ్రామ రైతులు చెబుతున్నారు.
నీటిఎద్దడిని అధిగమించేందుకు..
అడెగామ(బి)లో 309 రైతు కుటుంబాలు ఉన్నాయి. 772 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దశాబ్దాలుగా వర్షాకాలం కాకుండా ఇతర కాలాల్లో పంటలకు బావుల ద్వారే నీటితడులు అందిస్తూ రక్షించుకుంటున్నారు. బోరు వేసుకోవడం తక్కువ ఖర్చు అయినా, దాని ద్వారా సరిపడా నీరు పంటలకు అందించని పరిస్థితి ఉండడంతో ఈ గ్రామ రైతులు ప్రత్యామ్నాయంగా బావుల వైపు దృష్టి సారించారు. తద్వారా వర్షాకాలంలో నిండుకుండలా, మిగతా కాలాల్లో నీటి ప్రదాయినిగా ఈ బావులు నిలుస్తున్నాయి.
ఖర్చుతో కూడుకున్నదే..
బోరు 300 ఫీట్ల లోతులో వేయించినా అయ్యే ఖర్చు లక్ష రూపాయలపైనే.. అదే ఇలాంటి బావులు తవ్వించాలంటే రైతుకు సమయంతోపాటు పెద్ద మొత్తం వెచ్చించాల్సిందే. కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రధానంగా పంటలకు నీరు అందించేందుకు రైతులు ఈ ఖర్చుకు వెనుకాడకపోవడం గమనార్హం. బావిని తవ్విన తర్వాత పైనుంచి సుమారు 25 ఫీట్ల వరకు సిమెంట్‌తో తయారు చేసిన రింగులు చుట్టూరా వేస్తున్నారు.
సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాం
నాకు మూడెకరాల చేను ఉంది. వానాకాలంలో పత్తి, సోయా, కూరగాయలు, యాసంగిలో శనగ, కూరగాయలు సాగు చేస్తున్నా. అక్టోబర్, నవంబర్‌లలో పత్తి పూత, కాత దశకు వస్తుంది. ఆ సమయంలో రెండు, మూడు నీటితడులు అందిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో బోర్ల నుంచి సరిపడా నీళ్లులేని పరిస్థితి. బావుల నుంచి సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాం. మిగతా పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. – శివ శంకర్, రైతు, అడెగామ(బి)
బావుల్లో అధికంగా నీటి ఊటలు
అడెగామ(బి) గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఆ రైతులు బావులు తవ్వించుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బోర్లు లోతులో అధికంగా ఉన్నప్పటికీ వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ఊటలు తక్కువ స్థాయిలో వస్తాయి. అదే బావుల వెడల్పు అధికంగా ఉండడంతో భూమి పొరల నుంచి జలాలు ఎక్కువగా బావుల్లోకి వస్తాయి. తద్వారా బావుల్లో అనేక పొరల నుంచి జలాలు ఊరుతాయి. తద్వారా ఆ రైతులకు ఉపయుక్తంగా మారుతుంది. – పుల్లయ్య, భూగర్భ జలశాస్త్రవేత్త, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment