Wells
-
భలే బావులు
నీరే మన జీవన ఆధారం. ‘ఎడ తెగక పారే ఏరు లేని ఊరు’ని వెంటనే వదిలి పెట్టమన్నాడు వేమన మహాకవి. నీరు కాపాడుకుంటే భవిష్యత్తు ఉంటుంది. నీటి జాడను కాపాడుకోవడానికి పూర్వం నుంచి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నించాడు. చెరువులు, బావులు కట్టుకున్నాడు. చెరువు ఊరి వ్యవసాయానికి ఆధారం అయితే బావి మంచినీటికి ఆధారం. బోర్లు లేని కాలంలో ఊరికి, వీధికి, ఇంటికి బావి ఉండేది. ముందు బావి తవ్వి ఆ తర్వాత ఇల్లు కట్టే వారు. ఎప్పుడూ నీళ్లుండే బావి ఉన్న ఇంటికి మర్యాద ఎక్కువ ఉండేది. ఇప్పటికీ బావులు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం, వాటిని కాపాడుకునే స్పృహ కలిగి ఉండటం అవసరం. బావికి తెలుగులో ఉన్న మరో మాట ‘నుయ్యి’.దిగుడు బావుల నగరంప్రజలకు నీటి వనరులుగా ఉపయోగపడుతున్న దిగుడు బావులు, చేదుడు బావులు ఇప్పుడు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాని కొన్ని చోట్ల దిగుడు బావులు విస్తారంగా ఉన్నాయి. ఉదాహరణకు గుజరాత్‌లోని దిగుడుబావులు. ఈ రాష్ట్రంలో దాదాపు 120 విశిష్టమైన దిగుడుబావులు ఉన్నాయి. గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్ను దిగుడుబావుల నగరం అనొచ్చు. అక్కడ ఉన్న ‘రుడాబాయి దిగుడుబావి’ ఐదంతస్తుల లోతు ఉండి ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారైనా చూడ దగ్గ పర్యాటక చోటు ఇది. ఇక్కడ లోతైన బావిలొకి చక్కని మెట్ల నిర్మాణము కనిపించి ఆనాటి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి చిహ్నంగా నిలుస్తుంది. బావి చుట్టూ చక్కని రాతినిర్మాణము ఉంటుంది. అంచెలంచెలుగా విశాలమైన వసారాలు, గదులు, స్తంభాలు , వాటి మీద లతలు, అల్లికలు, నగిషీలు చెక్కబడి దేవాలయ నిర్మాణాన్ని తలపిస్తాయి. నాటి ప్రజలు వీటిని గంగామాతగా భావించేవారు. అందుకే ఈ జలాన్ని దేవతగా భావించి ఈ నిర్మాణం చేశారు. అష్టకోణాల నిర్మాణం ఇది. బావిలోకి ప్రవేశించేందుకు మూడువైపులనుండి ప్రవేశద్వారాలుంటాయి. వీటిలో నుండి దిగితే ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు దిగుతూ మొత్తం ఐదంతస్తుల కిందికి దిగాల్సివుంటుంది . అంత లోతునుండి నీరు పైకి చేరవేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే. అందుకే ఆ శ్రమ తెలియకుండా వుండేందుకే ఇటువంటి విశాలమైన, నెమ్మదిగా ఎక్కే మెట్లు కలిగిన సుందర నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్‌లోని దిగుడుబావులన్నీ 10–15 శతాబ్దాల మధ్య జరిగిన నిర్మాణాలే. దిగుడు బావులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అభానేరి గ్రామంలోని ‘చాంద్ బౌరి’ అనే దిగుడుబావి విశేషమైన ఖ్యాతి పోందింది. ప్రపంచ పర్యాటకులందరూ దీనిని చూడటానికి వస్తారు.హైదరాబాద్‌లో..హైదరాబాద్‌లోని బన్సిలాల్‌పేట్‌లో అద్భుతమైన దిగుడుబావి ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని దిగుడుబావుల పునరుద్ధరణకు నడుము బిగించింది. అలాగే చెరువుల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసింది. నీటిని రక్షించుకోకపోతే భవిష్యత్తు నాశనం. ఈ అవగాహన మనందరం కలిగి ఉండాలి. నీరు వృధా చేయరాదు.బావులలో రకాలు ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటి లోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని కింది పొరల లోనికి వేసి నీటిని మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది. ఇవి గతంలో ఇంటింటా ఉండేవి. -
ఊరంతా బావులే..!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(బి) గ్రామంలో పెద్దపెద్ద బావులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరంగా.. నిండుకుండలా కనిపిస్తున్నాయి. వర్షాధారంపైనే ఆధారపడినా, వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ బావుల్లోని నీటిని మోటార్ల ద్వారా పంటలకు నీటితడులు అందిస్తామని ఆ గ్రామ రైతులు చెబుతున్నారు. నీటిఎద్దడిని అధిగమించేందుకు..అడెగామ(బి)లో 309 రైతు కుటుంబాలు ఉన్నాయి. 772 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దశాబ్దాలుగా వర్షాకాలం కాకుండా ఇతర కాలాల్లో పంటలకు బావుల ద్వారే నీటితడులు అందిస్తూ రక్షించుకుంటున్నారు. బోరు వేసుకోవడం తక్కువ ఖర్చు అయినా, దాని ద్వారా సరిపడా నీరు పంటలకు అందించని పరిస్థితి ఉండడంతో ఈ గ్రామ రైతులు ప్రత్యామ్నాయంగా బావుల వైపు దృష్టి సారించారు. తద్వారా వర్షాకాలంలో నిండుకుండలా, మిగతా కాలాల్లో నీటి ప్రదాయినిగా ఈ బావులు నిలుస్తున్నాయి. ఖర్చుతో కూడుకున్నదే..బోరు 300 ఫీట్ల లోతులో వేయించినా అయ్యే ఖర్చు లక్ష రూపాయలపైనే.. అదే ఇలాంటి బావులు తవ్వించాలంటే రైతుకు సమయంతోపాటు పెద్ద మొత్తం వెచ్చించాల్సిందే. కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రధానంగా పంటలకు నీరు అందించేందుకు రైతులు ఈ ఖర్చుకు వెనుకాడకపోవడం గమనార్హం. బావిని తవ్విన తర్వాత పైనుంచి సుమారు 25 ఫీట్ల వరకు సిమెంట్‌తో తయారు చేసిన రింగులు చుట్టూరా వేస్తున్నారు.సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాంనాకు మూడెకరాల చేను ఉంది. వానాకాలంలో పత్తి, సోయా, కూరగాయలు, యాసంగిలో శనగ, కూరగాయలు సాగు చేస్తున్నా. అక్టోబర్, నవంబర్లలో పత్తి పూత, కాత దశకు వస్తుంది. ఆ సమయంలో రెండు, మూడు నీటితడులు అందిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో బోర్ల నుంచి సరిపడా నీళ్లులేని పరిస్థితి. బావుల నుంచి సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాం. మిగతా పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. – శివ శంకర్, రైతు, అడెగామ(బి)బావుల్లో అధికంగా నీటి ఊటలుఅడెగామ(బి) గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఆ రైతులు బావులు తవ్వించుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బోర్లు లోతులో అధికంగా ఉన్నప్పటికీ వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ఊటలు తక్కువ స్థాయిలో వస్తాయి. అదే బావుల వెడల్పు అధికంగా ఉండడంతో భూమి పొరల నుంచి జలాలు ఎక్కువగా బావుల్లోకి వస్తాయి. తద్వారా బావుల్లో అనేక పొరల నుంచి జలాలు ఊరుతాయి. తద్వారా ఆ రైతులకు ఉపయుక్తంగా మారుతుంది. – పుల్లయ్య, భూగర్భ జలశాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
పంటలు చేతికొచ్చిన దశలో బావులను పూడ్చవద్దని వేడుకున్న రైతులు
-
ఎండిన బోరు, బావిలో పుష్కలంగా నీరు!
వాన నీటిని కందకాల ద్వారా నేలతల్లికి తాపితే.. ఎండిన బోర్లు, బావులు వెంటనే జలకళను సంతరించుకుంటాయనడానికి యువ సేంద్రియ రైతు మార్తి శ్యాంప్రసాద్‌రెడ్డికి కలిగిన తాజా అనుభవమే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎనిమిదిన్నరేళ్లు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి.. వ్యవసాయంపై మక్కువతో తిరిగి వచ్చేసిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గజ్జెనవారిగూడెంలో 20 ఎకరాల ఎర్రగరప నేలను కొనుగోలు చేశారు. గతేడాది 4 ఎకరాల్లో శ్రీవరి, 16 ఎకరాల్లో చిరుధాన్యాలు, దేశీ పుచ్చ (విత్తనం కోసం) సాగు చేశారు. పొలంలో రెండు బోర్లు, బావి ఉన్నాయి. అయితే, ఈ ఎండాకాలంలో ఒక బోరుతోపాటు బావి కూడా ఎండిపోయింది. గత ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. ఈ వేసవిలో బోరు, బావి ఎండిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించి.. వారి సూచనల మేరకు గత నెలలో కందకాలు తవ్వించారు. తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా ఉన్న ఈ భూమిలోకి పై నుంచి కూడా వాన నీటి వరద వస్తూ ఉంటుంది. వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకింపజేసుకోవాలన్న లక్ష్యంతో పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. నెల తిరగక ముందే 4 పెద్ద వర్షాలు పడ్డాయి. వారమంతా వర్షం కురిసింది. కురిసిన 2–3 గంటల్లోనే కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకిందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే బోరు, బావి తిరిగి జలకళను సంతరించుకున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. బోరు రెండించుల నీరు పోస్తున్నదని, 7హెచ్.పి. మోటారుకు రోజుకు ఐదారు గంటలు బావి నీరు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్‌తో వరి విత్తటానికి దమ్ము చేస్తున్నామని, మిగతా 16 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో వర్షం కురిస్తే పైనుంచి కూడా వచ్చే వరద వల్ల పడమర భాగంలో భూమి కోసుకుపోయేదని, మట్టి కట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితుల్లో కందకాలు తవ్వటం వల్ల చుక్క నీరు, పిడికెడు మట్టి కూడా బయటకు కొట్టుకుపోలేదన్నారు. ఇంకో 2–3 వానలు పడితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. వర్షాలకు ముందు కందకాలు తవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే బోరు, బావి జలకళను సంతరించుకోవడం సంతోషకరమని యువ రైతు శ్యాంప్రసాద్‌రెడ్డి (84640 76429) తెలిపారు. మార్తి శ్యాంప్రసాద్ రెడ్డి -
మెట్ల బావుల్ని ‘చూద్దాం’ రండి
సాక్షి, హైదరాబాద్ : ఎంతటి కరువు కాటకాల్లోనూ ఎండిపోని ఘనత నాటి తెలంగాణ మెట్లబావుల సొంతం. ఊటల్ని పునరుద్ధరిస్తే చాలు, నిత్యం నీటితో కళకళలాడటం వీటి ప్రత్యేకత. పునరుద్ధరిస్తే ఒక్కో బావి ఒక్కో ఊరి దాహం తీర్చగలదంటున్నారు నిపుణులు. అలాంటి మెట్ల బావులు తెలంగాణలో ఎన్నున్నాయనే లెక్క ప్రభుత్వం వద్ద కూడా లేదు. ఎప్పుడో గుర్తించిన 35 బావుల పేర్లే పురావస్తు శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిజానికి అవి 200కు పైగా ఉంటాయని స్పష్టమవుతోంది. ఓ ఆర్కిటెక్ట్ విశేష కృషి ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే 140 మెట్ల బావులు వెలుగులోకి వచ్చాయి. ఈ బావులు ఎన్నో ఊళ్ల తాగు నీటి కష్టాలను తీర్చగలవు. కాబట్టి వీటిని మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పునరుద్ధరించాల్సిన అవసరముంది. ఈ మెట్లబావులను వెలికితీస్తున్న ‘హైదరాబాద్ డిజైన్ ఫోరం’ సంస్థ, తాను గుర్తించిన బావుల ఫొటోలతో వారం రోజుల ప్రద ర్శన ఏర్పాటు చేసింది. ‘హెరిటేజ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి స్టేట్ మ్యూజియంలో జూన్ 1 నుంచి 6 దాకా ఇది కొనసాగుతుందని సంస్థ నిర్వాహకుడు, ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి చెప్పారు. రాష్ట్రంలోని మెట్ల బావులు గుజరాత్, రాజస్తాన్లలోని అద్భుత నిర్మాణాలకు ఏమీ తీసిపోవని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు చెబుతున్నారు. వీటిని పునరుద్ధరిస్తే భావి తరాలకు మంచినీటి వనరులనే గాక అద్భుత నిర్మాణాలను కూడా అందించినట్టు అవుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెట్ల బావులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఓ సామాజిక కార్యకర్త ఇటీవల ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంలో ఎన్ని బావులున్నాయి, వాటి పరిస్థితేమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో ప్రశ్నించింది. దాంతో హైదరాబాద్ ఫోరం సేకరించిన వివరాలనే పీఎంవోకు పంపుతున్నారు. -
మురికి నీరే వారికి దిక్కు!
మహరాష్ట్రః మహరాష్ట్ర ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో భూమిలో నీరు కూడ ఎండిపోయి చుక్కనీటికోసం ప్రజలతోపాటు... మూగజీవాలూ కూడ నానా యాతనా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాతూర్ సహా కొన్ని ప్రాంతాలకు ట్రైన్ లో నీరు పంపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నాగపూర్ తదితర దూర ప్రాంతాల్లోని జనం బోర్లు కూడ ఎండిపోయి నీటికోసం అల్లాడుతున్నారు. ఎండిన బావులు, కుంటల్లో అట్టడుగున ఉన్న మడ్డి, మురికి నీటినే సేకరించి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నీటికోసం తపించిపోతున్నారు. చుక్క నీరు దొరకాలన్నా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సి వస్తోందని, దిక్కు లేని పరిస్థితుల్లో అక్కడ దొరికిన మురికి నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నీటిని తాగడంవల్ల అనేక అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని, కొందరి ప్రాణాలకే ప్రమాదంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. మహరాష్ట్రలోని నీటి ఇబ్బందులకు ప్రధాన కారణం అక్కడి ప్రముఖ ఆనకట్టల్లో సైతం నీరు ఇంకిపోవడమే. రాష్ట్రంలో మొత్తం చిన్నా పెద్దా కలిపి 1700 ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో ఐదు వరకూ పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. వీటిలో సతారా జిల్లాలోని కోయనా నదిపై ఉన్నకోయనా, ఔరంగాబాద్ జిల్లాలోని జాయ్ కబాడి, షోలాపూర్ జిల్లాలోని భీమానదిపై ఉన్న ఉజ్జయినీ, యవత్ మాలా జిల్లాలోని పెన్ గంగా నదిపై ఉన్న ఇసాపూర్, నాగపూర్ లోని తోతలాదోహ్ ఆనకట్టలు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల వీటి పరిస్థితి కూడ పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర ప్రజలకు నీటిగండం ఎదురైంది. గత కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాల ప్రభావం... ఈ ప్రముఖ ఆనకట్టల్లో కూడ నీటి పరిస్థితి దుర్భరంగా మారింది. దీంతో రాష్ట్రంలో నీటి కష్టాలు తీవ్రమైపోయాయి. ఆనకట్టల్లో నీరు తక్కువగా ఉండటం ఈసారి రైతులకు కూడ ఇక్కట్లు తప్పేట్టు కనిపించడం లేదు. -
భూగర్భ శోకం
♦ గత ఫిబ్రవరిలో సగటున 8.65 మీటర్ల లోతులో.. ♦ ఈ ఏడాది అదే నెలలో 9.16 మీటర్లు ♦ 19 ప్రాంతాల్లో పడిపోయిన నీటిమట్టం ♦ అత్యధికంగా సత్తుపల్లిలో 32.15 మీటర్లు భూగర్భం అడుగంటుతోంది. ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పడిపోతోంది. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో బోర్లు, బావులు చుక్కనీరూ లేకుండా పోతున్నాయి. జిల్లాలోని 19 ప్రాంతాల్లో అప్పుడే నీటిమట్టం అట్టడుగుకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మండువేసవిలో ఎలా ఉండాలి..అని ప్రజలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. - ఖమ్మం సాక్షి ప్రతినిధి సాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాభావ పరిస్థితులు, వేసవి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతుండటంతో భూగర్భ జలం అడుగంటుతోంది. రెండేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో జిల్లాలోని నీటిమట్టం పడిపోతోంది. వ్యవసాయ, మంచినీటి, బోరు బావులు ఎండిపోతున్నాయి. ఇటు సాగు, అటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది సగటున జిల్లావ్యాప్తంగా ప్రమాదకర స్థితిలో నీటిమట్టం పడిపోయింది. 19 ప్రాంతా ల్లో భూగర్భజలం లోతుల్లోకి వెళ్లింది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వేసవి గటెక్కేదెలా అని ఇటు అధికారులు.. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అడుగంటిన నీరు 2015 ఫిబ్రవరిలో భూగర్భ జల సగటు మట్టం 8.65 మీటర్లుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.16 మీటర్లకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మే, జూన్ నాటికి 10 మీటర్ల లోతులోకి కూడా భూగర్భ జలం వెళ్లే అవకాశం ఉంది. తల్లాడ మండలం అంజనాపురం, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, టేకులపల్లి మండలం బోడు, దుమ్ముగూడెం, కల్లూరు, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, కామేపల్లి మండలం కొత్తలింగాల, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం, వెంకటాపురం మండలం మరికల, ముదిగొండ, బోనకల్ మండలం ముష్టికుంట్ల, ఇల్లెందు మండలం నారాయణపురం-ఎస్, చింతకాని మండలం నేరెడ, సత్తుపల్లి మండలం ప్రకాష్‌నగర్, చండ్రుగొండ మండలం రావికంపాడు, టేకులపల్లి మండలం సులానగర్, వేంసూరులలో భూగర్భ జలాలు లోతుల్లోకి వెళ్లాయి. వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళికపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పినా.. ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా నిధులు జిల్లాకు రాలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముందే మేల్కొనాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈసారి మంచినీటి ఇబ్బందులు తప్పవని రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీనికితోడు కరువు మండలాల జాబితాలో జిల్లా నుంచి ఒక్క మండలానికి కూడా చోటు దక్కకపోవడంతో కేంద్ర సాయం కూడా కొరవడింది. ప్రధానంగా మంచినీటి వసతులపై ఏజెన్సీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో గిరిజనులు దాహార్తితో రోజులు గడుపుతున్నారు. ఎప్పుడూ ఆ ప్రాంతాల్లోనే... భూగర్భ జల వనరుల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో ఏటా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి పడిపోతున్నాయని గుర్తించారు. ఇక్కడ ఇదేస్థాయిలో మంచి నీటికి కూడా కటకట ఏర్పడుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న భూముల్లో నీటిమట్టం కొంత వరకు బాగానే ఉన్నా.. ప్రధానంగా ఆయక ట్టేతర ప్రాంతాల్లో మాత్రం ఏటికి ఏడాది భూగర్భ జలాలు పడిపోతుండటం గమనార్హం. టేకులపల్లి మండలం సులానగర్, కల్లూరు, దుమ్ముగూడెం, బనిగండ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, బోడు ప్రాంతాల్లో ప్రతి ఏటా నీటిమట్టం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు చెబుతుండగా.. ఈ ప్రాంతా ల్లో నీటి వనరులు పెంపొందించేందుకు చర్యలు తీసుకోకపోవడం కూడా మరో కారణం. -
బోరుబావులను వృథాగా వదిలేస్తే చర్యలు
చందంపేట: ఎవరైనా బోరు వేయించి.. వృథాగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా చందంపేట మండలం ఎస్ఐ నాగభూషణ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని పెద్దవూరలో ఆడుకుంటూ వెళ్ళిన చిన్నారి బోరుబావిలో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను విధిగా పూడ్చనట్లయితే బోర్‌వెల్స్ నిర్వాహకులపై, పొలంలో వేసిన రైతులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగభూషణరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. -
జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి ....
సాక్షి, మంచిర్యాల : ఇంకా చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. వేసవికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది. కానీ.. అప్పుడే జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. వేసవికి ముందే వేసవిని గుర్తుచేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. 16 మండలాల్లో పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే గతనెల అక్టోబర్ వరకు 14 మండలాల్లో భూగర్భ జలాలు లోతులోకి వెళ్లాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనని భూగర్భ జల శాఖ అధికారులే స్వయానా చెబుతున్నారు. వేసవి ప్రారంభంలోగా రెండు..మూడు మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య జఠిలంగా మారే ప్రమాదం ఉందని అంచ నా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాకు రూ.12.20 కో ట్లు అవసరమని ప్రభుత్వానికి ఇటీవల నివేదికలు పంపారు. జిల్లాలో 52 మండలాలుం డగా.. ప్రతినెలా సుమారు 30 మండలాల్లో భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేయ గా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బెజ్జూర్, బోథ్, దహెగాం, దిలావర్పూర్, కాగజ్‌నగర్, కెరమెరి, లోకేశ్వరం, ముథోల్, సారంగాపూర్, తాండూర్, తానూర్ మండలాల్లో నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఖానాపూర్, మందమర్రి, తాంసి, వాంకిడి మండలాల్లో ఎనిమిది మీటర్లకు చేరాయి. ఇప్పటికే 200లకు పైగా ఆవాసాల్లో నీటి సమస్య నెలకొంది. రూ.12.20 కోట్ల పనులకు ప్రతిపాదనలు.. జిల్లాలో దారుణంగా పడిపోయిన భూగర్భ జల మట్టంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉన్నందునా.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణకు అత్యవసరంగా రూ.12.20 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందు లో బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు కా వాలని నివేదించారు. జిల్లాలో 3,490 తాగునీటి పథకాలుండగా.. అందులో 425 పథకాలు పని చేయడం లేదని వాటి మరమ్మతు, నిర్వహణ కోసం రూ.10.40 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే బోర్‌వెల్స్ మరమ్మతు, నీటి ట్రాన్స్‌పోర్టేషన్, బావులు అద్దెకు చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో కాలిపోయిన మోటార్ల మరమ్మతు, కొత్త మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ పనులపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21,682 బోర్వెల్లలో సుమారు తొమ్మిది వేల బోర్లు పనిచేయడం లేదు. 13వ ఫైనాన్స్ నిధులు రూ.2.50 లక్షల (మూడు నెలలకోసారి)తో వీటి మరమ్మతు చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు పంపాం.. - ఇంద్రసేన్, ఎస్ఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ సారి వేసవికి ముందే నీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నెలారంభంలో భూగర్భ జల శాఖ ఇచ్చిన నివేదికలు చూసి మరింత అప్రమత్తమయ్యాం. బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు, పనిచేయని 425 నీటి పథకాల నిర్వహణకు రూ.10.40 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. -
బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించే పరికరం
పరిగి, న్యూస్‌లైన్: బోరు బావుల్లో పొరపాటున పడిపోయిన చిన్నారులను రక్షించేందుకు తోడ్పడే.. అద్భుతమైన పరికరాన్ని రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ అనే విద్యార్థి రూపొందించారు. దీని సహాయంతో బోరు బావిలో పడిన చిన్నారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు... మరింత కిందికి జారిపోకుండా చూడవచ్చు. మొత్తంగా గంటలోపే చిన్నారులను బోరుబావి నుంచి బయటకు తీసేందుకు ఈ పరికరం తోడ్పడుతుంది. రామకృష్ణ పరిగిలోని శిశుమందిర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతను తయారు చేసిన ఈ పరికరం ఈ నెల 26, 27 తేదీల్లో కర్ణాటకలోని మంగళూర్లో జరిగే అంతర్రాష్ట్ర ప్రదర్శనలో ప్రదర్శనకు ఎంపికైంది. ఇలా పనిచేస్తుంది..: రామకృష్ణ రూపొందించిన పరికరం బోరుబావిలో పట్టే విధంగా అరమీటరు పొడవు ఇనుప చువ్వలతో ఉంటుంది. దీని అడుగు భాగంలో మూడు ఇనుప ప్లేట్లు ఉంటాయి. ఈ పరికరం బోరుబావిలో పడిన చిన్నారి పక్క నుంచి అడుగు భాగానికి చేరుకోగానే.. ప్లేట్లకు అమర్చిన తీగలను లాగుతారు. దాంతో ప్లేట్లు అడ్డుగా మూసుకుని చిన్నారులు మరింత కిందికి జారకుండా ఉంటారు. ఇక పరికరానికి పైభాగంలో అమర్చిన లైట్, వెబ్ కెమెరా ద్వారా కంప్యూటర్లో చిన్నారి పరిస్థితిని గమనించవచ్చు. ఇదంతా ఘటనా స్థలానికి చేరుకున్న పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. మొత్తంగా ఒక గంటలోపు బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీయవచ్చు. రామకృష్ణ బోరు బావి ఆకారంలో ఉన్న ఓ పరికరంలో ఈ ప్రయోగం చేసి చూపించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని చెబుతున్నాడు.