మురికి నీరే వారికి దిక్కు!
మహరాష్ట్రః మహరాష్ట్ర ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో భూమిలో నీరు కూడ ఎండిపోయి చుక్కనీటికోసం ప్రజలతోపాటు... మూగజీవాలూ కూడ నానా యాతనా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాతూర్ సహా కొన్ని ప్రాంతాలకు ట్రైన్ లో నీరు పంపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నాగపూర్ తదితర దూర ప్రాంతాల్లోని జనం బోర్లు కూడ ఎండిపోయి నీటికోసం అల్లాడుతున్నారు. ఎండిన బావులు, కుంటల్లో అట్టడుగున ఉన్న మడ్డి, మురికి నీటినే సేకరించి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాగపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నీటికోసం తపించిపోతున్నారు. చుక్క నీరు దొరకాలన్నా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సి వస్తోందని, దిక్కు లేని పరిస్థితుల్లో అక్కడ దొరికిన మురికి నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నీటిని తాగడంవల్ల అనేక అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని, కొందరి ప్రాణాలకే ప్రమాదంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. మహరాష్ట్రలోని నీటి ఇబ్బందులకు ప్రధాన కారణం అక్కడి ప్రముఖ ఆనకట్టల్లో సైతం నీరు ఇంకిపోవడమే.
రాష్ట్రంలో మొత్తం చిన్నా పెద్దా కలిపి 1700 ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో ఐదు వరకూ పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. వీటిలో సతారా జిల్లాలోని కోయనా నదిపై ఉన్నకోయనా, ఔరంగాబాద్ జిల్లాలోని జాయ్ కబాడి, షోలాపూర్ జిల్లాలోని భీమానదిపై ఉన్న ఉజ్జయినీ, యవత్ మాలా జిల్లాలోని పెన్ గంగా నదిపై ఉన్న ఇసాపూర్, నాగపూర్ లోని తోతలాదోహ్ ఆనకట్టలు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల వీటి పరిస్థితి కూడ పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర ప్రజలకు నీటిగండం ఎదురైంది. గత కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాల ప్రభావం... ఈ ప్రముఖ ఆనకట్టల్లో కూడ నీటి పరిస్థితి దుర్భరంగా మారింది. దీంతో రాష్ట్రంలో నీటి కష్టాలు తీవ్రమైపోయాయి. ఆనకట్టల్లో నీరు తక్కువగా ఉండటం ఈసారి రైతులకు కూడ ఇక్కట్లు తప్పేట్టు కనిపించడం లేదు.