dried
-
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
రైతు కుదేలు
– రబీలో చీడపీడలు – ఖరీఫ్‌లో వర్షాభావం – అందని ఇన్పుట్ సబ్సిడీ – వెంటాడుతున్న రుణపాశం – బంగారంపై రుణాలివ్వద్దంటున్న ప్రభుత్వం – అయోమయంలో అన్నదాతలు చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలోని రైతులు నష్టాలను చవిచూస్తూ కుదేలవుతున్నారు. గత రబీసీజన్‌లో వరి పంటకు చీడపీడలు సోకడంతో దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట పూర్తిగా చేజారిపోయింది. ఏ సీజన్‌కు ఆ సీజన్లో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా జిల్లాలో 2.11 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. రబీలో అత్యధికంగా తూర్పు మండలాల్లో వరి సాగుచేయగా, ఖరీఫ్‌లో పడమటి మండలాల్లో వేరుశనగను సాగుచేస్తారు. దశాబ్ద కాలంగా తీవ్ర వర్షాభావంతో పంటల సాగు అంతంత మాత్రంగా ఉంటోంది. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు గత రబీ సీజన్లో పంటల సాగుపై ఆసక్తి చూపారు. చీడపీడల బెడద గత రబీలో జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగుచేశారు. పంట ఏపుగా పెరగడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావొచ్చని అందరూ భావించారు. అయితే పంట చేతికందే సమయంలో చీడపీడలు వరి కంకులను నాశనం చేశాయి. దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల మేరకు దిగుబడి తగ్గిపోయింది. చేజారిన వేరుశనగ ప్రస్తుత ఖరీఫ్‌లో సాగవుతున్న వేరుశనగ పంటకు సాగునీరు లేక పూర్తిగా చేజారింది. జిల్లాలో 1.21 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుచేశారు. 50 రోజులుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట దాదాపుగా ఎండిపోయింది. ప్రభుత్వం రెండు వారాల క్రితం వేరుశనగకు రెయిన్‌గన్స్ ద్వారా తడులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రైతులకు దాదాపు రూ.130 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు నిపుణులు చెబుతున్నారు. అందని ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 2013–14కి గాను రైతులకు 98 వేల హెక్టార్లలకు రూ.90 కోట్ల మేరకు, 2014–15కి గాను 1.1 లక్షల హె క్టార్లకు రూ.108 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు చిల్లిగవ్వకూడా రైతులకు విదల్చలేదు. దీంతో వారు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటాడుతున్న రుణపాశం 2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,780.25 కోట్ల మేర బ్యాంకర్లకు బకాయి పడ్డారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది రైతులు మోసపోయారు. అనేక ఆంక్షల కారణంగా జిల్లాలో 4,53,773 మంది రైతులే రుణమాఫీకి అర్హత సాధించారు. వీరికి కూడా స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ పేరుతో నిబంధనలు పెట్టి వడ్డీలకు కూడా చాలని విధంగా రుణమాఫీ చేశారు. అప్పులు ఏమాత్రం తీరకపోగా మరిన్ని కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. బంగారు రుణాలపై ఆంక్షలు బంగారంపై తీసుకునే వ్యవసాయ రుణాల వల్ల రుణమాఫీలో సమస్యలు వస్తున్నాయని, కావున సాగుకు బంగారంపై రుణాలివ్వద్దంటూ ఈ నెల 13న నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఫలితంగా చాలా మంది రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. బ్యాంకు రుణాల పరపతి పూర్తిగా దెబ్బతింది. ఈ ఏడాదికి కేటాయించిన రూ.2,500 కోట్ల మేర రుణ లక్ష్యం అధికమించే పరిస్థితులు కనిపించడం లేదు. -
చేజారిన వేరుశనగ
–90శాతం ఎండిపోయిన పంట –40వేల హెక్టార్లలో పంటపై ఆశలు లేనట్టే – రెయిన్గన్లతో తడులు అంతంతమాత్రమే – సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం – ఆఖరు నిమిషంలో హడావుడి – రంగంలోకి మంత్రులు, ఐఏఎస్‌లు చిత్తూరు: జిల్లాలో నెలకున్న తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ఈ ఖరీఫ్‌కు సాగవుతున్న వేరుశనగ పంటలో దాదాపు 90 శాతం పంట ఎండిపోయింది. రైతులకు చేయూతగా చేపట్టాల్సిన సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎండిపోయిన పంటను కాపాడుతామంటూ రెయిన్గన్లతో ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నెల రోజులుగా వర్షాభావంతో వేరుశనగ ఎండిపోతుంటే చోద్యం చూసిన ప్రభుత్వం ఆఖరునిమిషంలో ఎండిపోయిన పంటను కాపాడేస్తామంటూ ముఖ్యమంత్రి జిల్లాకు విచ్చేసి హడావుడి చేశారు. ఇందులోభాగంగా జిల్లాలో కరువు నివారణ చేపట్టేందుకు రంగంలోకి రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను దింపారు. జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్ సీజన్‌కు 2.11లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వేరుశనగతో పాటు వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారు. అందులో వేరుశనగ మాత్రం 1.36లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే మోస్తరుగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లావ్యాప్తంగా రైతులు 1.31లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నెల రోజులుగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో 90 శాతం మేరకు పంట పూర్తిగా ఎండిపోయి ఆకులు సైతం రాలిపోయే దశకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వేరుశనగ పంటను ఆదుకునేందుకు సకాలంలో సహాయ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వేరుశనగ పంటకు వరుసగా రెండు వారాల పాటు వర్షం పడకపోతే ప్రభుత్వం దీనిపై స్పందించి సత్వర చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాల్సి ఉంది. దాదాపు 20 రోజుల పాటు పంట ఎండిపోతున్నా అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పరిస్థితులపై ఏమాత్రం పట్టించుకోకపోగా కష్ణాపుష్కరాలు, వేడుకల్లో ఈనెల 24వతేది వరకు గడిపారు. తరువాత తీరిగ్గా జిల్లాకు రెండు రోజుల క్రితం విచ్చేసిన చంద్రబాబు ఇక్కడ వేరుశనగ పంట దుస్థితి చూసి ఈ విషయాన్ని నా దష్టికి తీసుకురాకపోవడం అధికారులు, మంత్రులదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడం విశేషం. రెయిన్గన్లతో తడులు అంతంతమాత్రమే వారం రోజులుగా వ్యవసాయశాఖాధికారులు రెయిన్గన్లతో పంటకు ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 80వేల హెక్టార్ల మేరకు వేరుశనగ పంట పది రోజుల క్రితమే బాగా ఎండుముఖం పట్టింది. వ్యవసాయాధికారులు మాత్రం 962 రెయిన్గన్లు, 251 జనరేటర్లను తెప్పించి ఇప్పటికీ 10వేల హెక్టార్లలో మాత్రమే తడులు చేపట్టారు. దీంతో 40వేల హెక్టార్ల మేరకు ఇప్పటికే పంట చేజారిపోయింది. మిగిలిన పంట కూడా ఒకటి రెండు రోజుల్లో తడులివ్వకపోతే రైతులు పంటను వదులుకోవాల్సిన దుస్థితి. అంతా హడావుడే.. పంట ఎండిపోయిన తరువాత జిల్లాకు విచ్చేసిన సీఎం హడావుడిగా చర్యలను ప్రకటించారు. 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆరుగురు మంత్రులను, 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను, 45 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరంతా పూర్తిగా పంట ఎండిపోయిన 11 నియోజకవర్గాల పరిధిలోని 49 మండలాల్లోని పంటలను పరిశీలించి సత్వరం కాపాడే చర్యలు చేపడుతారని ముఖ్యమంత్రి ప్రకటించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కంటితుడుపు చర్యలుగా రైతులు పేర్కొంటున్నారు. -
ముంచేశావు బాబూ ..
జిల్లాలో 90 శాతం ఎండిపోయిన వేరుశనగ పంట రెయిన్గన్లతో కాపాడలేకపోయిన ప్రభుత్వం పంట ఎండిన సంగతి తనకు తెలీదని సీఎం వింత వాదన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మంత్రులు పల్లె, పరిటాల, ప్రత్తిపాటి రైతులను ఆదుకోవడంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం నేటి నుంచి రంగంలోకి మంత్రులు, ఐఏఎస్, గ్రూపు–1 అధికారులు ‘అనంత’ వేరుశనగ రైతుల పరిస్థితి నాలుగేళ్లుగా అత్యంత దయనీయంగా ఉంది. కరువు దెబ్బకు నిలవలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు తెగించారు. తక్కిన రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే వాతావరణ నిపుణుల ప్రకటనను నమ్మి జిల్లా వ్యాప్తంగా 6.06 లక్షల హెక్టార్లలో పంట సాగు చేశారు. ఇందులోనూ జూన్‌లో తొలకరి వర్షాలకు అధికశాతం పంట వేశారు. మామూలుగానైతే ఈ పంటను సెప్టెంబరు 15లోపు తొలగించాలి. అయితే.. నెల రోజులుగా వర్షం లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటి వరకూ 57 మండలాల్లో ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారికంగానే 55 మండలాల్లో డ్రైస్పెల్స్(28 రోజులుగా వర్షం పడని మండలాలు)ను అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు అప్రమత్తమయినా.. జిల్లాలో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 6.30 లక్షల హెక్టార్లు. ఇందులో 6.06 లక్షల హెక్టార్లలో పంటసాగు చేశారు. ఇందులో 5.41లక్షల హెక్టార్లు ఈ నెల 29 నాటికే ఎండుముఖం పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పంటలకూ నీళ్లిస్తే రెండు లక్షల హెక్టార్లను ఒకమేర కాపాడొచ్చు. అయితే 50 శాతానికి పైగా పంట దిగుబడి తగ్గుతుంది. మరో 3లక్షల హెక్టార్ల పంట పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 2–3బస్తాల కాయలు రావొచ్చు. తక్కిన 41వేల హెక్టార్లు దేనికీ పనికిరాకుండా ఎండిపోయింది. జూలైలో సాగైన పంటకు 2–3రోజుల్లో నీళ్లిస్తేనే పైన పేర్కొన్న దిగుబడి వస్తుంది. లేదంటే అది కూడా గ్రాసానికే పరిమితమవుతుంది. మరి ఈ మేరకు ప్రభుత్వం నీరిచ్చి పంటను కాపాడటం కష్టసాధ్యమైన పని. కొట్టొచ్చినట్లు కన్పిస్తోన్న ప్రభుత్వ నిర్లక్ష్యం పంట ఎండిపోవడం వెనుక ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. వర్షం రాకపోతే పంటను కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న ధర్మవరం, 15న అనంతపురం పర్యటనలో ప్రకటించారు. అయితే.. ఈ నెల 6వ తేదీకే మంచి వర్షం కురవాల్సిన పరిస్థితి. వర్షం లేక అప్పటి నుంచే పంట ఎండుముఖం పట్టింది. అప్పుడే కాపాడే చర్యలకు ఉపక్రమించి ఉంటే కొంతమేర న ష్టం తగ్గేది. అయితే.. ఆగస్టు 15 వరకూ స్వాతంత్య్ర వేడుకలు మినహా అధికార యంత్రాంగానికి రైతుల సంక్షేమం పట్టలేదు. పంట స్థితిగతులపై మంత్రులు పల్లె, పరిటాల సునీత కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించలేదు. విపక్షపార్టీతో పాటు తక్కిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ నెల అరంభం నుంచి 24వరకూ కృష్ణాపుష్కరాలు, విజయోత్సవ సంబరాల్లో మునిగితేలారు. టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఎంత వర్షం కురిసింది, పంటల పరిస్థితి ఏంటనేది తాను చెప్పగలనని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించిన చంద్రబాబుకు.. మరి ‘అనంత’ దుస్థితి ఎందుకు కన్పించలేదనేది తేలాల్సిన ప్రశ్న. ధర్మవరం పర్యటన తర్వాత సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చే సమయానికే పంట ఎండుతోంది. అప్పుడు కూడా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించలేదు. మంత్రులు, అధికారులే బాధ్యులా? పంట ఎండిపోవడాన్ని ఆలస్యంగా గుర్తించడంలో మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం ఉందని నేరుగా సీఎం వ్యాఖ్యానించడాన్ని చూస్తే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. దీంతో పాటు నెలరోజులుగా పంట పరిస్థితి తెలుసుకోలేకపోవడంలో సీఎం నిర్లక్ష్యం కూడా ఉంది. దీనికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని ప్రజలు మరచిపోయేలా, ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిందనే భావన కలిగేలా నేటి నుంచి సీఎం, మంత్రులు, అధికారులు జిల్లాలో తిష్టవేసి హడావుడి చేస్తుండడం రైతులను మోసం చేయడమేనని స్పష్టమవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 61,430 హెక్టార్లలో పంట ఎండిపోయిందని, ఇందులో42వేల హెక్టార్లకు నీళ్లిచ్చి కాపాడామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు లెక్కలను వల్లించడమేనని పరిశీలకులు మండిపడుతున్నారు. ఇప్పుడైనా వాస్తవాలను గుర్తించి బతికే అవకాశమున్న పంటకు నీరివ్వాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలకు పాలకులు బాధ్యత వహించక తప్పదు. -
మురికి నీరే వారికి దిక్కు!
మహరాష్ట్రః మహరాష్ట్ర ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో భూమిలో నీరు కూడ ఎండిపోయి చుక్కనీటికోసం ప్రజలతోపాటు... మూగజీవాలూ కూడ నానా యాతనా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాతూర్ సహా కొన్ని ప్రాంతాలకు ట్రైన్ లో నీరు పంపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నాగపూర్ తదితర దూర ప్రాంతాల్లోని జనం బోర్లు కూడ ఎండిపోయి నీటికోసం అల్లాడుతున్నారు. ఎండిన బావులు, కుంటల్లో అట్టడుగున ఉన్న మడ్డి, మురికి నీటినే సేకరించి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నీటికోసం తపించిపోతున్నారు. చుక్క నీరు దొరకాలన్నా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సి వస్తోందని, దిక్కు లేని పరిస్థితుల్లో అక్కడ దొరికిన మురికి నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నీటిని తాగడంవల్ల అనేక అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని, కొందరి ప్రాణాలకే ప్రమాదంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. మహరాష్ట్రలోని నీటి ఇబ్బందులకు ప్రధాన కారణం అక్కడి ప్రముఖ ఆనకట్టల్లో సైతం నీరు ఇంకిపోవడమే. రాష్ట్రంలో మొత్తం చిన్నా పెద్దా కలిపి 1700 ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో ఐదు వరకూ పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. వీటిలో సతారా జిల్లాలోని కోయనా నదిపై ఉన్నకోయనా, ఔరంగాబాద్ జిల్లాలోని జాయ్ కబాడి, షోలాపూర్ జిల్లాలోని భీమానదిపై ఉన్న ఉజ్జయినీ, యవత్ మాలా జిల్లాలోని పెన్ గంగా నదిపై ఉన్న ఇసాపూర్, నాగపూర్ లోని తోతలాదోహ్ ఆనకట్టలు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల వీటి పరిస్థితి కూడ పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర ప్రజలకు నీటిగండం ఎదురైంది. గత కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాల ప్రభావం... ఈ ప్రముఖ ఆనకట్టల్లో కూడ నీటి పరిస్థితి దుర్భరంగా మారింది. దీంతో రాష్ట్రంలో నీటి కష్టాలు తీవ్రమైపోయాయి. ఆనకట్టల్లో నీరు తక్కువగా ఉండటం ఈసారి రైతులకు కూడ ఇక్కట్లు తప్పేట్టు కనిపించడం లేదు. -
నోళ్లు తెరుస్తున్న పంటపొలాలు
రాఘవాపురం (నందిగామ రూరల్) : మునేటి వాగునీటిని నమ్ముకొని దాళ్వా వరి సాగు చేసిన రైతులకు తిప్పలు తప్పటం లేదు. మునేటి వాగులో నీరు వట్టిపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే రాఘవాపురం గ్రామ సమీపంలో మునేటి తీరాన శ్రీసీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ పరిధిలో రాఘవాపురం, కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో సుమారు 650 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు కారణాల వలన స్కీమ్ పనిచేయక పంట సాగు కాలేదు. ఈ నేపథ్యంలో మునేటిలో నీరు అధికంగా ఉందనే ఆలోచనతో రైతులు సుమారు 400 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. ఈ నేపథ్యంలో మునేటి వాగులో నీరు పూర్తిగా ఎండిపోయింది. పంటలను కాపాడుకునేందుకు స్కీమ్ నిర్వాహకులు ఇప్పటికే పొక్లెయిన్ల ద్వారా మునేటిలో పూడిక తీతలు తీసి సాగు నీటి కోసం ప్రయత్నాలు చేశారు. అయినా నీరు లేకపోవడంతో ప్రస్తుతం లంకప్రాంతంలో బోరులు వేసి వాటి ద్వారా వచ్చే నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు సరిపోకపోవడంతో పలువురు రైతులకు చెందిన పంటలు ఇప్పటికే ఎండుదశకు చేరుకోగా కొన్ని భూములు నీరు లేక బీటలు వారి దర్శనమిస్తున్నాయి. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల కళ్లముందే పంటలు ఎండుతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆందోళన చెందుతున్న రైతులు శ్రీ సీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ పరిధిలో రైతులందరూ దాదాపుగా చిన్న, సన్నకారు వారే. మాగాణిలో దిగుబడి వచ్చిన ధాన్యాన్ని ఎక్కువశాతం మంది రైతులు తిండి గింజలకే వినియోగించుకుంటారు. ఈ ఏడాది పలు కారణాల వలన ఖరీఫ్‌లో స్కీమ్ పరిధిలో పూర్తిగా పంట సాగు కాలేదు. ఈ నేపథ్యంలో దాళ్వా సాగు ద్వారా అయినా తిండిగింజలు సంపాదించుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పొట్టదశలో సమయానికి నీరందించకపోవడంతో ధాన్యం ఎక్కువ శాతం తాలుగా మారే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. బీటలు వారిన భూములను చూసిన రైతులు కంటతడి పెడుతున్నారు. సాగర్ ద్వారా నీరు విడుదల చేయాలి వరి పొట్ట దశలో నీరు లేకపోవడం వలన పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక్కసారి సాగర్ జలాలను మునేటికి విడుదల చేస్తే పంటలకు జీవం పోసినట్లు అవుతుంది. ఈ ఏడాది కౌలుకు తీసుకొని 50 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశాను. పంట సాగుకు సుమారు రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టా. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా నీరు లేకపోవడంతో పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. -కోట శ్రీనివాసరావు, రైతు పంట పూర్తిగా ఎండిపోయింది ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశా. పంట పొట్టదశలో ఉంది. పొలాలకు నీరందకపోవడంతో పంట కళ్లముందే తెల్లబారిపోతోంది. ఎండిపోయిన పంట చివరకు పశువుల మేతకు కూడా పనికిరాని విధంగా ఉంది. ఏమి చేయాలో తెలియడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం రానురాను మరింత భారం అవుతుంది. సాగర్ నీరు ఇచ్చి పంటలను కాపాడాలి. -ఓరుగంటి ఆంజనేయులు, రైతు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం స్కీమ్ పరిధిలో పంట పొలాలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. మునేటిలో నీరు పూర్తిగా నీరు ఎండిపోవడంతో పంట పొలాలకు నీరందించేందుకు అధిక వ్యయ ప్రయాసల కోర్చి లంక ప్రాంతంలో 12 బోర్లు వేశాం. వాటిలో 4 బోరుల్లో నీరు పడాయి. ఆ నాలుగు బోరుల్లో రెండు బోర్లలో నీరు వెంటనే ఇంకిపోయింది. ప్రస్తుతం రెండు బోర్ల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి కాలువల ద్వారా పంట పొలాలకు నీరందించే ప్రయత్నాలు చేస్తున్నాం. -చెన్నుపాటి వెంకటేశ్, స్కీమ్ అధ్యక్షుడు