రెయిన్ గన్‌తో ఎండిన వేరుశనగ పంటను తడుపుతున్న దృశ్యం
చేజారిన వేరుశనగ
Published Tue, Aug 30 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
–90శాతం ఎండిపోయిన పంట
–40వేల హెక్టార్లలో పంటపై ఆశలు లేనట్టే
– రెయిన్‌గన్లతో తడులు అంతంతమాత్రమే
– సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
– ఆఖరు నిమిషంలో హడావుడి
– రంగంలోకి మంత్రులు, ఐఏఎస్‌లు
చిత్తూరు: జిల్లాలో నెలకున్న తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ఈ ఖరీఫ్‌కు సాగవుతున్న వేరుశనగ పంటలో దాదాపు 90 శాతం పంట ఎండిపోయింది. రైతులకు చేయూతగా చేపట్టాల్సిన సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎండిపోయిన పంటను కాపాడుతామంటూ రెయిన్‌గన్లతో ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నెల రోజులుగా వర్షాభావంతో వేరుశనగ ఎండిపోతుంటే చోద్యం చూసిన ప్రభుత్వం ఆఖరునిమిషంలో ఎండిపోయిన పంటను కాపాడేస్తామంటూ ముఖ్యమంత్రి జిల్లాకు విచ్చేసి హడావుడి చేశారు. ఇందులోభాగంగా జిల్లాలో కరువు నివారణ చేపట్టేందుకు రంగంలోకి రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను దింపారు.
జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్ సీజన్‌కు 2.11లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వేరుశనగతో పాటు వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారు. అందులో వేరుశనగ మాత్రం 1.36లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే మోస్తరుగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లావ్యాప్తంగా రైతులు 1.31లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నెల రోజులుగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో 90 శాతం మేరకు పంట పూర్తిగా ఎండిపోయి ఆకులు సైతం రాలిపోయే దశకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వేరుశనగ పంటను ఆదుకునేందుకు సకాలంలో సహాయ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది.
సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
వేరుశనగ పంటకు వరుసగా రెండు వారాల పాటు వర్షం పడకపోతే ప్రభుత్వం దీనిపై స్పందించి సత్వర చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాల్సి ఉంది. దాదాపు 20 రోజుల పాటు పంట ఎండిపోతున్నా అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పరిస్థితులపై ఏమాత్రం పట్టించుకోకపోగా కష్ణాపుష్కరాలు, వేడుకల్లో ఈనెల 24వతేది వరకు గడిపారు. తరువాత తీరిగ్గా జిల్లాకు రెండు రోజుల క్రితం విచ్చేసిన చంద్రబాబు ఇక్కడ వేరుశనగ పంట దుస్థితి చూసి ఈ విషయాన్ని నా దష్టికి తీసుకురాకపోవడం అధికారులు, మంత్రులదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడం విశేషం.
రెయిన్‌గన్లతో తడులు అంతంతమాత్రమే
వారం రోజులుగా వ్యవసాయశాఖాధికారులు రెయిన్‌గన్లతో పంటకు ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 80వేల హెక్టార్ల మేరకు వేరుశనగ పంట పది రోజుల క్రితమే బాగా ఎండుముఖం పట్టింది. వ్యవసాయాధికారులు మాత్రం 962 రెయిన్‌గన్లు, 251 జనరేటర్లను తెప్పించి ఇప్పటికీ 10వేల హెక్టార్లలో మాత్రమే తడులు చేపట్టారు. దీంతో 40వేల హెక్టార్ల మేరకు ఇప్పటికే పంట చేజారిపోయింది. మిగిలిన పంట కూడా ఒకటి రెండు రోజుల్లో తడులివ్వకపోతే రైతులు పంటను వదులుకోవాల్సిన దుస్థితి.
అంతా హడావుడే..
పంట ఎండిపోయిన తరువాత జిల్లాకు విచ్చేసిన సీఎం హడావుడిగా చర్యలను ప్రకటించారు. 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆరుగురు మంత్రులను, 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను, 45 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరంతా పూర్తిగా పంట ఎండిపోయిన 11 నియోజకవర్గాల పరిధిలోని 49 మండలాల్లోని పంటలను పరిశీలించి సత్వరం కాపాడే చర్యలు చేపడుతారని ముఖ్యమంత్రి ప్రకటించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కంటితుడుపు చర్యలుగా రైతులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement