Andhra Pradesh: New Seeds Into The Market - Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్త విత్తనాలు

Published Thu, Jul 20 2023 4:57 AM | Last Updated on Fri, Jul 21 2023 7:21 PM

New seeds into the market - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్‌లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌  ఎల్‌.ప్రశాంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ సీడ్స్‌ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వేరుశనగలో..
టీసీజీఎస్‌ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు.

ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు అనుకూలం.

పొగాకులో..
ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్‌ 3–58–38, ఎక్స్‌ లైన్‌ (190–27–5–7–32), ఎక్స్‌ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. 

పెసరలో.. 
ఎల్‌జీజీ 630: ఈ వంగడం ఎల్‌జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్‌జీజీ 460 ఎక్స్‌ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు అనుకూలం.

మినుములో..
టీబీజీ 129: ఈ వంగడం ఎల్‌బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్‌ ఎల్‌బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.  గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు అనుకూలం.

ఎల్‌బీజీ 904: ఈ వంగడం ఎల్‌బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్‌బీజీ 645 ఎక్స్‌ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు అనుకూలం.

నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు
బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్‌ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్‌జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగుకు అనుకూలం.

బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్‌ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్‌ జోన్లలో ఖరీఫ్‌ సాగుకు అనుకూలం. 

ఎన్‌ఎల్‌ఆర్‌ 3238: బయో ఫోర్టిఫైడ్‌ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్‌ చేసిన బియ్యంలో జింక్‌ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్‌లలో సాగుకు అనుకూలం.

ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్‌ల్యాండ్స్‌లో ఖరీఫ్‌ సాగుకు అనుకూలం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement